|
వైమానిక దాడుల్లో మృతి
ఇరాన్ రేడియో ధ్రువీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఇస్లామిక్ రాజ్యం (ఐఎస్) ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతమయ్యాడు. సుమారు నెల క్రితం అమెరికా నాయకత్వంలో మిత్రదేశాలు జరిపిన వైమానిక దాడులలో తీవ్రంగా గాయపడిన ఈ ఉగ్రవాది చనిపోయాడు. ఇరాన్ రేడియో సోమవారం అధికారికంగా ఈ వార్తను ప్రసారం చేసింది. అల్ కాయిదా తర్వాత అంతటి క్రూరమైన జిహాది గ్రూప్‌గా తయారైన ఇస్లామిక్ రాజ్యం(ఐఎస్) ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. బగ్దాదీ వయస్సు 43 ఏళ్లు. సిరియా సరిహద్దులో నినెవె జిల్లా అల్‌బాజ్ ప్రాంతం వద్ద వైమానిక దాడులలో బగ్దాదీ గాయపడినప్పుడు అతనికి తగిలిన గాయాలు అంత తీవ్రమైనవి కావనీ, కొంత ఆలస్యంగానైనా కోలుకుంటాడనీ తొలుత మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తమ నేత పరిస్థితి విషమంగా ఉందనీ, కొత్త చీఫ్ పేరును ప్రకటించేందుకు బగ్దాదీ అనుచరులు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే ఇరాన్ రేడియో బగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించింది. ఇస్లాం రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో బగ్దాదీ 2013లో ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్, సిరియా (ఐసిస్) సంస్థను ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అధినేతగా తనకు తాను ప్రకటించుకున్నాడు. అనంతరం దీని పేరును ఐఎస్‌గా మార్చారు. పశ్చిమ ఇరాక్, లిబియా, నైజీరియా, సిరియాల్లో ఐఎస్ జెండా ఎగురవేయడంతోపాటు త్వరలో పలు యూరప్ దేశాలను హస్తగతం చేసుకుంటామని బహిరంగంగా సవాల్ విసిరాడు. 1971లో బాగ్దాద్‌లో సాధారణ కుటుంబంలో పుట్టిన బగ్దాదీ....బాగ్దాద్ ఇస్లామిక్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ చేశాడు. 2003లో అమెరికా సారథ్యంలోని మిత్రదేశాల సేనలు ఇరాక్‌పై దాడులు జరిపిన సమయంలో బగ్దాదీ మతబోధకుడిగా పనిచేసేవాడు. మొదట స్థానిక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాల్గొన్న తర్వాత ముజాహిదీన్ షౌరా కమిటీకి సారథ్యం చేపట్టాడు. ఈ సంస్థనే 2006లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్‌గా పేరుమార్చారు. 2010లో అల్‌ఖైదా ఇరాక్ విభాగం సారథిగా ఎదిగాడు. ఇరాక్‌లో కారుబాంబులు, మానవబాంబులతో అనేక చోట్ల మారణహోమం సృష్టించాడు. వేలాదిమందిని బలితీసుకున్నాడు. లాడెన్ మరణంతో అల్‌ఖైదా పట్టుకోల్పోవడం మొదలైంది. దీంతో 2013లో అల్‌ఖైదాతో తెగతెంపులు చేసుకుని ఐసిస్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. సౌదీఅరేబియా, ఖతర్ వంటి దేశాలకు చెందిన సానుభూతిపరులు స్వచ్ఛందంగా ఐఎస్‌కు భారీగా నిధులు సమకూర్చేవారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. బగ్దాదీని అమెరికా 2011లోనే ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని ఆచూకీ తెలిపిన వారికి కోటి డాలర్ల నజరానా ఇస్తామని ప్రకటించింది. ఉగ్రవాదులు సైతం వణికిపోయేలా ఐఎస్‌ను తీర్చిదిద్దినా, ప్రపంచ మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా ఎదిగినా అతని కథ కూడా మిగిలిన ఉగ్రవాదుల్లానే ముగిసిపోవడం కొసమెరుపు
|
No comments:
Post a Comment