Thursday, 2 April 2015

విమలక్కపై కుట్ర అభియోగం ఆయుధాల కేసు!

విమలక్కపై కుట్ర అభియోగం ఆయుధాల కేసు!

బీడీ కార్మిక ఉద్యమానికి ‘కుట్ర’ రూపం
పాల్గొంటున్నవారిపై కేసుల నమోదు
కార్మికులతో పాటు ‘ఉద్యమ’ నేతలపైనా వేటు
విమల, అమర్‌, రాజన్నలపై కేసులు
తీవ్రంగా నిరసిస్తున్న తెలంగాణ మేధావులు
కేసీఆర్‌ వ్యతిరేక స్వరాల అణచివేతంటూ నిప్పులు
కోదండరాం సహా 32 మంది నిరసన సంతకాలు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గజ్జెకట్టినా...గళం విప్పినా కేసులు తప్పవంటున్నది తెలంగాణ సర్కారు. తమ ఆట..పాటలతో తెలంగాణలో చైతన్యాన్ని పెంపొందింపజేస్తున్న ప్రజా సంఘాలపై పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. కుట్రకేసులు, ఆయుధాల కేసులతో వేధించడం మొదలైంది. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కో-చైర్మన్‌, అరుణోదయ గాయని విమలక్క, అమె భర్త అమర్‌, తదితరులపై నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డిలో కుట్ర కేసు నమోదైంది. అసలు ఆ కేసు ఏమిటో, ఆ గొడవ ఏమిటో వారికి తెలియదు. స్థానికులు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చేంత వరకు ఏమి జరిగిందో తెలియలేదు. దీన్నిబట్టి చూస్తే ఎంత పకడ్బందీగా కేసులు నమోదవుతున్నాయో అర్ధమవుతున్నదని ప్రజాసంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. విమలక్కపై సర్కారు తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టిందని విద్యావేత్తలు, హక్కుల సంఘాల నేతలు, పాత్రికేయులు, ప్రజాసంఘాల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?
విమలక్క సారథ్యంలోని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌) బీడీకార్మికుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నది. తెలంగాణలో ప్రభుత్వంపై నేరుగా ఎక్కుపెట్టిన పెద్ద ఉద్యమం ఇది. దానివల్ల ఈ ఉద్యమంలో పాల్గొనేవారు ప్రభుత్వానికి కంటగింపుగా మారారని చెబుతున్నారు. ఈ క్రమంలో మార్చి 23 భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా బీడీ కార్మికులతో నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డిలో సభను నిర్వహించారు. 10 జిల్లాల నుంచి టఫ్‌ కార్యకర్తలు, అరుణోదయ సభ్యులతోపాటు ఏఐఎఫ్‌టీయూ, అనుబంధ శ్రామికశక్తి బీడీ వర్కర్స్‌ యూనియన్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు వచ్చారు. సామ్రాజ్యవాదుల కోసమే వనరులను తరలిస్తున్నారని విమలక్క సభావేదికగా గళం విప్పారు. సభ ప్రశాంతంగా జరిగింది. సభకు వచ్చినవారు తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. అంతే..మరునాటి నుంచి పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్యమ నాయకత్వం, సభ నిర్వహణ.. వంటి విషయాలను ఆరా తీశారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లో బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు వెంకటలక్ష్మి, అనుసూయ, లింగయ్యలను అరెస్ట్‌ చేశారు. వీరి విడుదల కోసం విమలక్క జిల్లా ఎస్పీని కలిశారు. నిజామాబాద్‌ ఎంపీ కవితను కలిసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు సాగుతుండగానే గత నెల 26వ తేదీన విమలక్కకు నిజామాబాద్‌ పోలీసులు ఫోన్‌ చేశారు. ‘మీ మీద కుట్ర.. ఆయుధాల కేసు నమోదు చేసి’నట్టు చెప్పారు. దాంతో ఆశ్చర్యపోవడం విమలక్క వంతు అయింది. అప్పటికప్పుడే.. బీడీ ఉద్యమ సభ జరిగిన మాచారెడ్డి కాస్తా ‘మాచారెడ్డి కుట్ర కేసు’గా మా రింది. విమలక్కతోపాటు ఆమె భర్త అమర్‌, జనశక్తి అగ్రనేత రాజన్న సహా 17 మందిపై మారణాయుధాలు, కుట్ర అభియోగాలపై కేసు నమోదు చేశారు.
కేసీఆర్‌పై నిరసన స్వరం
ఉద్యమకాలంలో కేసీఆర్‌ విధానాలను ప్రశ్నించేవారిలో విమలక్క ముందు నిలిచారు. దానివల్ల కేసీఆర్‌.. మీడియాలో ఆమెకు చోటు ఇచ్చేవారు కాదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 2011లో నిజామాబాద్‌ జిల్లాలో ‘దేవునిపల్లి కుట్రకేసు’ నమోదైంది. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నవారికి బెయిల్‌ ఇచ్చారు. విమలక్కకు బెయిల్‌ వచ్చినా విడుదల చేయకుండా నిరంకుశంగా వ్యవహరించారు. ఆ సమయంల ఉద్యమం ఉధృతంగా ఉంది. అయినా ఉద్యమ సంస్థ టీఆర్‌ఎస్‌.. విమల విడుదలపై ఆసక్తి చూపింలేదని చెబుతారు. నేరుగా ఉద్యమ నేత కేసీఆర్‌ని కోరినా ఫలితం లేకపోయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అప్పట్లో ఆమె కోసం ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మించారు. ఆయన కృషికి లాయర్ల పట్టు దల తోడు కావడంతో విమలక్క విడుదలయ్యారు. ఆ తరువాత ’దేవునిపల్లి కు ట్ర కేసు’ను కోర్టు కొట్టివేసింది. విచిత్రంగా.. ఏడాది తరువాత నూతన రాష్ట్రంలో అదే జిల్లాలో ఆమెపై ‘మాచారెడ్డి కుట్ర కేసు‘ దాఖలైంది.
కళాకారులను వేధించొద్దు!
విమలక్కపై వంటి ప్రజా కళాకారులపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి, వేధించడం సరికాదని తెలంగాణ విద్యావంతులు, మేధావులు, హక్కుల నేతలు గర్హించారు. కుట్ర, ఆయుధాల అభియోగాలను ఉసంహరించుకోవాలంటూ 32 మంది సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనపై సంతకం చేసినవారిలో తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, విద్యావేత్త చుక్కా రామయ్య, కేశవరావు జాదవ్‌, రమా మెల్కొటే, ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు తదిత రులున్నారు. ‘‘విమలక్కను కుట్రకేసులో ఇరికించడాన్ని నిరసిస్తున్నాం. నూతన రాష్ట్రంలో పదవులు ఆశించకుండా, నవ తెలంగాణ నిర్మాణానికి అంకితమై పనిచేస్తున్న విమలక్కపై ఆయుధచట్టం లాంటి తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి. ఉద్యమకారులను అణచివేయడం, వేధించడం నిలిపివేయాలి. తెలంగాణ ఉద్యమ గీతాల ద్వారా ఉద్యమానికి ఊతమిచ్చిన ఆమె సహచరుడు అమర్‌ (మిత్ర)పైనా అభియోగాలను వెనక్కి తీసుకోవాలి’’ అని వారు డిమాండ్‌ చేశారు.

No comments:

Post a Comment