Tuesday 4 August 2015

ఈ నిజాలను మనం ఎదుర్కోగలమా? - తారిఖ్ ఎం ఖోసా.

ఈ నిజాలను మనం ఎదుర్కోగలమా? తమ సర్కారును
ప్రశ్నించిన పాకిస్తాన్ ఎఫ్ఐఎ మాజీ డీజీ..

ఇస్లామాబాద్, ఆగస్టు 04: "జీర్ణించుకోలేని నిజాల్ని ఎదుర్కోవడానికి... మన భూభాగం నుంచే పేట్రేగిపోతున్న ఉగ్రవాద రాక్షసుల పనిపట్టడానికి ఒక జాతిగా మనం సిద్ధంగా ఉన్నామా?" అని పాక్ సర్కారుకు ఒక ప్రశ్న సంధించారు ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ) తారిఖ్ ఎం ఖోసా. భారత ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వందలాది ప్రాణాల్ని బలిగొన్న 2008 నాటి ఉగ్రవాద దాడులకు (26/11) పాక్ భూభాగం నుంచే కుట్ర చేసి, అమలు జరిపినట్లు డాన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ద్వారా మరోసారి తిరుగులేని ఆధారం బయటపడింది. ఆ దాడుల్లో దొరికిపోయి, భారత ప్రభుత్వం ఉరితీసిన ఉగ్రవాది కసబ్ పాక్ జాతీయుడేనంటూ... ఈ దేశంలో అతని చదువు, నిషేధిత ఉగ్రవాద సంస్థలో శిక్షణ పొందడం గురించి పాక్ పత్రిక డాన్‌లో రాసిన వ్యాసం ద్వారా ఖోసా స్వయంగా అంగీకరించారు. 2008 నాటి ఈ ఘోరం గురించి పాకిస్తాన్‌లో నమోదైన కేసులను ఖోసా బృందమే దర్యాప్తు చేసింది. ముంబై మారణకాండపై పాక్ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని ఖోసా తన వ్యాసంలో నిష్కర్షగా వ్యాఖ్యానించారు.
 
రష్యాలో భారత్, పాక్ ప్రధానుల సమావేశాన్ని ఉటంకిస్తూ ఈ వ్యాసం రాసిన ఖోసా... అందులో భాగంగానే పై ప్రశ్నను తన ప్రభుత్వానికి సంధించారు. సింధ్‌లో ఉన్న లష్కరే తొయిబా ఉగ్రవాద శిబిరం నుంచి శిక్షణ పొందిన 10 మందిని సముద్ర మార్గంలో ముంబై పంపిన విషయాన్ని ఖోసా ధృవీకరించారు. అప్పుడు ఉపయోగించిన పేలుడు పదార్థాలు కూడా ఇక్కడివేనని నిర్ధారించారు. కలకలం రేపుతున్న ఈ తాజా వ్యాసంపై పాక్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

No comments:

Post a Comment