Tuesday, 11 August 2015

రైతు ఆత్మహత్యలపై సర్కార్ చర్యలు శూన్యం

రైతు ఆత్మహత్యలపై సర్కార్ చర్యలు శూన్యం
హైకోర్టును త్వరంగా విభజించాలి : కోదండరాం

న్యూ ఢిల్లీ, ఆగస్టు 11: రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల వ్యవహార శైలి వల్లే రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆరోపించిన ఆయన ఈ ఆత్మహత్యల నివారణకు టీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా రైతు ఆత్మహత్యల నివారణకు పూర్థిస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మంగళవారం ఢిల్లీలో ఆల్ అస్సాం విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న రాష్ట్రాల సదస్సులో కొదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో మరిన్ని చిన్న రాష్ట్రాలు ఏర్పాటు కావాల్సిన అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏర్పడే చిన్న రాష్ట్రాలకు తెలంగాణ సమాజం మద్దతు ఉంటుందని ప్రకటించారు.
 
రాష్ట్ర విభజన తరువాత హైకోర్టు విభజించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించిన కోదండరాం ఏపీ, తెలంగాణల ఉమ్మడి హైకోర్టు విభజన ఆలస్యంతో ఇరు రాష్ట్రాల మధ్య మనస్పర్థలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఒకే రాష్ట్రంలో రెండు హైకోర్టులు ఉండొద్దన్న తీర్పు సమంజసం కాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా ఏపీ, తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రిని ఆయన కోరారు.

No comments:

Post a Comment