Monday, 10 August 2015

‘‘మీ ఇంటికి మీ భూమి’’ ప్రారంభం

ఇక నుంచి ఎవరి భూమి వారి ఆధీనంలో ఉంటుంది
రేషన్‌ కార్డు ఆధారంగానే స్కాలర్‌షిప్‌లు
మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో చంద్రబాబు

అనకాపల్లి, ఆగస్టు 10 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి... మీ పట్టా’ రాష్ర్టానికే ఆదర్శమని, పట్టాదారుకు పాస్‌బుక్‌ ఇవ్వాలంటే ప్రభుత్వమే ఇంటికి తీసుకుపోయి ఇచ్చే విధంగా శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ‘‘మీ ఇంటికి మీ భూమి’’ కార్యక్రమాన్ని సోమవారం విశాఖ జిల్లా అనకాపల్లి శంకరంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వాలు మన భూమి మనకు కాకుండా ఎన్నో లిటిగేషన్లు, ఎన్నో సమస్యలు సృష్టించి.. దీన్ని ఒక సమస్యగా చేశారని విమర్శించారు. ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాత పటేల్‌ పట్వారీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని పెట్టిన ఘనత ఆయనదేనని బాబు కొనియాడారు. రెండు కోట్ల 24లక్షల సర్వే నెంబర్లు ఉన్నాయని, అందులో 72 లక్షల మంది పట్టాదారులు ఉన్నారని, ఒక సర్వేలో 3, 4గురు ఉంటారని, ఒక సర్వేలో గవర్నమెంట్‌ భూమి ఉంటుందని, అదే మాదిరిగా పట్టాదారులు ఉంటారని ఆయన అన్నారు.

మీ ఇంటికి మీ భూమి పేరుతో వెబ్‌సైట్‌ రూపొందించామని, భూ వివాదాల నివారణకు ఇది చక్కటి మార్గమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీ భూమి మీపేరుతో ఉందోలేదో తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు అందిస్తారని, మీ భూమిని మీ ఇంటికి అందించడమే నా లక్ష్యం అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పాసు పుస్తకాల కోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆ దుస్థితిని పోగొట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఇక నుంచి ఎవరి భూమి వారి ఆధీనంలోనే ఉంటుందని, అధికారుల పెత్తనానికి ఆస్కారం లేకుండా చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. సర్వే నెంబర్ల వారీగా భూములను గుర్తించామని తెలిపారు.

విద్యార్థులకు రేషన్‌కార్డుల ఆధారంగానే స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ కు ఇన్‌కం సర్టిఫికెట్లు అవసరంలేదని ఆయన అన్నారు. కులధ్రువీకరణ పత్రాల జారీని సరళీకృతం చేస్తామని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని బాబు తెలిపారు.

రెవెన్యూ రికార్డులకు ఆధార్‌ అనుసంధానం చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనవసర సర్టిఫికెట్ల వ్యవస్థను రద్దు చేస్తామని, అవసరమైన వాటి కోసం దరఖాస్తు చేస్తే...నిర్దిష్ట కాల పరిమితిలో నేరుగా ఇంటికే సర్టిఫికెట్లు అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

ఈటీఎస్‌ మిషన్లతో భూ సర్వేను వేగవంతం చేశామని, ఉద్యోగులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉద్యోగులకు 42శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంచిన ఘనత టీడీపీదేనని ఆయన అన్నారు. ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. తప్పుడు పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బాగా పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

No comments:

Post a Comment