Tuesday 11 August 2015

హోదాపై కాదంటే చెప్పండి.. మా దారి మేం చూసుకొంటాం - చంద్రబాబు

హోదాపై కాదంటే చెప్పండి.. మా దారి మేం చూసుకొంటాం!.. ఢిల్లీ పెద్దలకు బాబు స్పష్టీకరణ


  •  ఏం చేశారని మీ హామీలు నమ్మాలి?
  •  జనం మనల్ని నమ్మి గెలిపించారు
  •  పరిస్థితి ఆత్మాహుతుల దాకా వచ్చింది
  •  ఏడాదిపాటు ఎంతో ఓపిక పట్టాం
  •  ఇక మీ తరఫున సర్ది చెప్పలేను
  •  ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు స్పష్టీకరణ
  •  జైట్లీ, రాజ్‌నాథ్‌, వెంకయ్యకు ఫోన్‌
  •  సర్ది చెప్పినా శాంతించని బాబు
  •  గట్టిగా మాట్లాడాలని ఎంపీలకు ఆదేశం
  •  మెతక వైఖరిపై మంత్రులకు అక్షింతలు
హైదరాబాద్‌/విజయవాడ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా నాన్చుతున్న బీజేపీ కేంద్ర నాయకత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మీరు ఇలాగే సాగదీస్తూ పోతే కష్టం. ఇది మీరు ఇచ్చిన హామీనే. కచ్చితంగా నెరవేర్చాలని మేము, మా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాం. చేయలేకపోతే చెప్పండి! మా దారి మేం చూసుకొంటాం!’’ అని ముక్కుసూటిగా చెప్పారు. ప్రస్తుతం విజయవాడలోని క్యాంప్‌ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు మంగళవారం అక్కడి నుంచే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌తోపాటు వెంకయ్య, నిర్మలా రామన్‌లతో ఫోన్లో మాట్లాడారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి పార్లమెంటులో మీరు కూడా అంగీకరించారు. ఇప్పటికి ఏడాది దాటిపోయింది. ఇంతవరకూ ఏదీ తేల్చడంలేదు. చివరకు ఇక్కడ ఈ అంశం ఆత్మాహుతుల వరకూ వచ్చింది. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మోదీ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు ఇప్పటి వరకు సహనంతో ఉన్నారు. ఇంకెన్నాళ్ళు ఓపికతో ఉంటారు? మీరు చేస్తామంటున్నారు. ఎప్పుడో కాకుండా అదేదో వెంటనే చేస్తే బాగుంటుంది’’ అని సూటిగా చెప్పారు. ‘‘ప్రజలు మీపైనా... నా పైనా ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించారు. వాటిని వమ్ము చేద్దామా? ఏడాది కాలంగా నేను అందరికీ మీ తరఫున నచ్చచెబుతూ వచ్చాను. ఇక ఆ పని చేయలేను. ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో ఏదో ఒకటి నిర్ణయించుకొని చెప్పండి’’ అని కేంద్ర మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే... కేంద్ర మంత్రులు ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ‘‘ఇతర రాషా్ట్రలతో రాజకీయంగా ఉన్న ఇబ్బందుల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వగలిగే పరిస్థితిలో లేం. దాని బదులు అంతే ప్రయోజనకరంగా ఉండేలా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని జైట్లీ చెప్పారు. కానీ... చంద్రబాబు ఆయన వాదనను ఒప్పుకోలేదు. ‘మీ మాటలు ఎలా నమ్మాలి? ఇవే విషయాలు ఎంత కాలం నుంచి చెబుతున్నారు? మా రాషా్ట్రనికి చెప్పుకోదగింది ఒక్కటైనా చేశారా? మొదటి ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక లోటు మొత్తాన్ని కేంద్రం భరిస్తుందని విభజన చట్టంలోనే పెట్టారు. దానిని అమలు చేశారా? నవ్యాంధ్ర లోటు రూ. 15 వేల కోట్లని మేం ఎన్నికల్లో గెలవక ముందే గవర్నర్‌ తన నివేదికను మీకు పంపారు. ఆ మొత్తం మాకు ఇచ్చారా? విభజన కోరుకున్నది ఏపీ ప్రజలు కాదు. వారికి ఇష్టంలేకున్నా విభజించారు. దానికి బదులుగా ఆదుకొంటామని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని మిగిలిన రాషా్ట్రలతో ఎలా ముడి పెడతారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘నేను చెప్పాల్సింది చెప్పాను. ఆపై మీ ఇష్టం. మీరు స్పందించకపోతే మేం కఠిన నిర్ణయాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. నేను ఇలా మాట్లాడే వాడిని కాను. మిగిలిన పార్టీల మాదిరిగా బెదిరింపులు నాకు ఇష్టం లేదు. కానీ, ఉన్న విషయం చెబుతున్నాను’’ అని స్పష్టం చేశారు.
ఎంపీలకూ కర్తవ్య బోధ
ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇంతకంటే పెద్ద అంశం మరొకటి లేదని, దీనిపై గట్టిగా మాట్లాడాలని వారికి సూచించారు. ‘మొహమాటాలు అవసరం లేదు. రావాల్సింది సాధించుకోవాలి’ అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని టీడీపీ మంత్రులకు మరింత గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. ‘‘కేంద్ర మంత్రుల వద్ద ఎందుకు మెత్తగా మాట్లాడుతున్నారు? నాకు లేని మొహమాటం మీకు ఎందుకు? మన పరిస్థితిని బలంగా చెప్పండి. చెప్పింది చేయలేకపోతే వచ్చే ఇబ్బందుల గురించి వారికి వివరించండి. మీరు గట్టిగా చెప్పకపోతే నేను ఊరుకోను’’ అని ఆయన వారితో అన్నారు. ప్రత్యేక హోదాతోపాటు... ప్యాకేజీ, రైల్వే జోన్‌ వంటి చట్టంలో పేర్కొన్న అంశాలు, అప్పటి ప్రధాని మన్మోహన్‌ మౌఖికంగా చేసిన హామీల అమలుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను ఏర్పాటు చేసుకోవలసిన సమయం వచ్చిందని చెప్పినట్టు తెలిసింది. వెరసి... ‘స్నేహంగా ఉంటూనే సాధించుకుందాం’ అనే వైఖరిని మార్చుకున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంత తీవ్రంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అని పేర్కొంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కఠిన వైఖరి తీసుకున్నారని ఆయన మంత్రివర్గంలోని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘కేంద్రం సరైన రీతిలో స్పందించకపోతే బీజేపీతో తెగదెంపులకు కూడా వెనకాడేది లేదని ఆయన మా వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కూడా చాలా కాలం ఓపిక పట్టారు. ఇంకా ఎంత కాలం చూస్తూ ఊరుకుంటారు? అందుకే కఠిన వైఖరితో వెళ్తున్నారు’’ అని ఆ మంత్రి అన్నారు.

పేరులో ఏముంది?.. హోదాకంటే ఎక్కువే ఇస్తాం


  • రాష్ట్ర అవసరాలు, ఆకాంక్షలకు తగ్గదు
  • అడుగు ముందుకేసి మరీ ఆదుకుంటాం
  • అతి త్వరలోనే మరిన్ని ప్రకటనలు: జైట్లీ
  • పది రోజుల్లో సమస్యల పరిష్కారం: రాజ్‌నాథ్‌
  • కేంద్ర మంత్రులను కలిసిన టీడీపీ బృందం
 
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘ప్రత్యేక హోదా’ అనే పేరులో ఏముందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశ్నించారు. విభజనతో ఏపీ నష్టపోయిందని, దానిని భర్తీ చేసేందుకు వరుసగా కొన్నేళ్లపాటు తాము ఏపీని ఆదుకోవాల్సి ఉంటుందని, ఒక అడుగు ముందుకేసి మరీ ఏపీని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, సుజనా చౌదరి, ఏపీకి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు మంగళవారం పార్లమెంటులో జైట్లీని కలిశారు. అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడారు. తనను కలిసిన వారంతా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ఆందోళనగా ఉన్నారని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో పరిశీలన చేస్తున్నామని, పేరు ఏదైనా సరే.. ఏపీకి రాబోయే కొన్నేళ్లపాటు నిరంతరాయంగా ప్రత్యేక మద్దతు ఇస్తామని చెప్పారు. రాష్ట్రం అవసరాలు, ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గకుండా ఇది ఉంటుందని, ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా ఇది ఉంటుందని చెప్పారు. రాయితీలు, ఆదాయ లోటు భర్తీ, రాజధాని నిర్మాణానికి సహాయం, ఇప్పుడు ఇచ్చిన ప్రాజెక్టులకు అదనంగా మరికొన్ని ఇవ్వటం వంటివి ఇందులో ఉంటాయన్నారు. వీటిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఆందోళన పూర్తిగా రాజకీయమయమని కొట్టిపారేశారు. అసలు ప్రత్యేక హోదాపై ఆందోళన చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి హక్కు లేదన్నారు. ఏపీ విభజన చట్టం అమల్లో తలెత్తుతున్న సమస్యలను పది రోజుల్లో పరిష్కరించాలని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సుజనా బృందం రాజ్‌నాథ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించింది. దాదాపు అరగంటపాటు విభజన సమస్యలను వివరించింది. దీంతో సంబంధిత అధికారుల్ని పిలిఝట ఇరు రాషా్ట్రల సీఎ్‌సలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌నాథ్‌ సూచించారు.
ఇంతవరకూ న్యాయం జరగలేదు: సుజనా చౌదరి
ఈ 15 నెలల్లో ఏపీకి తగిన న్యాయం జరగలేదని తాము జైట్లీకి స్పష్టంగా చెప్పామని సుజనా చౌదరి చెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా, పారిశ్రామిక రాయితీలు రెండూ ఇచ్చి ఇతర రాషా్ట్రలతో సమాన హోదా ఏపీకి వచ్చేలా చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారని చెప్పారు. పారిశ్రామిక రాయితీలు తుది దశకు చేరుకున్నాయని, ఏపీ అధికారులు ఆర్థిక శాఖ అధికారులతో కూర్చుని వీటికి తుదిరూపు ఇస్తారన్నారు. కాగా, ప్రత్యేక హోదా ఇస్తే ఎంత సహాయం జరుగుతుందో అంతకంటే ఎక్కువే సహాయం వస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. బీజేపీ ఏపీకి ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి తీరుతుందని, చట్టంలో పేర్కొనని వాటిని కూడా చేస్తోందన్నారు. అలాగే, అప్పుడు విభజనతో రాషా్ట్రన్ని కాంగ్రెస్‌ పార్టీ బలి తీసుకుందని, ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో ప్రజల్ని బలి తీసుకుంటోందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి విమర్శించారు. మునికోటి ఆత్మాహుతికి ఆ పార్టీ నాయకులే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పేరు పెట్టడంపై ఏవో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని, అయినా, దానిలోని రాయితీల కంటే ఎక్కువే అందనున్నాయని చెప్పారు. ఆంధ్రాలో మిగతా ప్రాంతాలకంటే ఎక్కువ వెసులుబాటు రాయలసీమకు ఇవ్వాలని, తమది అత్యంత వెనుకబడిన ప్రాంతమని, ప్రత్యేక దృష్టితో నిధులు ఇవ్వాలని మంత్రుల్ని కోరానని, వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

http://www.sakshi.com/news/hyderabad/chandra-babu-hitech-drama-in-special-status-266090?pfrom=inside-news-arround-hyd

"ఇంకెన్నాళ్ళు బాబూ ఈ దొంగాట"
 

No comments:

Post a Comment