Monday 17 August 2015

20న మోదీతో బాబు భేటీ.. హోదాపై పట్టు

20న మోదీతో బాబు భేటీ.. హోదాపై పట్టు
రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం

బీహార్‌తో ముడి పెట్టవద్దని వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ఖరారైంది. ఈనెల 20వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబుకు మోదీ సమయం ఇచ్చారు. మోదీ, బాబుతోపాటు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధాని నివాసంలోనే జరగనున్న ఈ కీలక సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ భవితవ్యం తేలనుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రతన్‌ పి. వటల్‌ ఇప్పటికే ఏపీ ప్యాకేజీపై ప్రధాని కార్యాలయానికి నివేదిక అందజేశారు. ఈ భేటీలో చంద్రబాబు ప్రధానంగా ప్రత్యేక హోదాపైనే పట్టుపట్టనున్నట్లు తెలిసింది. తిరుపతిలో మునికోటి ఆత్మాహుతి తర్వాత ప్రధాని మోదీ.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా, ప్రత్యేక ప్యాకేజీ కన్నా హోదానే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని నెరవేర్చకపోతే ఉభయ పార్టీలకు గడ్డు రోజులు తలెత్తుతాయని కూడా బాబు చెప్పినట్లు తెలిసింది. టీడీపీ ఎంపీలు ఇటీవల రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీలను కలిసి అందజేసిన లేఖలో కూడా ఘాటైన పదజాలాన్నే ఉపయోగించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ‘కాళ్ల కింద భూమి కదులుతుందం’టూ నేరుగానే ధ్వజమెత్తారు. అదే సమయంలో కేంద్ర మంత్రులపై కూడా చంద్రబాబు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలోనే, చంద్రబాబుతో మాట్లాడినప్పుడు.. ఒకసారి ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుని దీనిపై ఏం చేయాలో నిర్ణయిద్దామని ప్రధాని హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈనెల 20నే సమావేశం కానున్నారు. కాగా, ప్రధానితో భేటీ ఖరారు కావడంతో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఆశలు చిగురించాయి. ‘‘ఈసారి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీకి ఇవ్వాల్సిన వాటిపై ఇంకా జాప్యం తగదని చంద్రబాబు ఢిల్లీ నేతలకు స్పష్టంగా చెప్పారు. క్షేత్ర స్థాయి పరిస్థితి వారికి కూడా అర్థమైనట్లే కనిపిస్తోంది. అందుకే ఈసారి స్పష్టమైన పురోగతి ఉండగలదని ఆశిస్తున్నాం’’ అని అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి గత కొద్ది రోజులుగా దీనిపైనే కేంద్ర మంత్రులు, ముఖ్య శాఖల కార్యదర్శులను కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉండటంతో తుది పరిష్కారం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. హోదా పేరు గురించి పట్టుపట్టవద్దని, వేరే పేరుతో అవే ప్రయోజనాలు ఇస్తామన్నది కేంద్రంలోని కొందరు మంత్రుల సూచన. హోదా కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు 90 శాతం గ్రాంటుగా వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 90 శాతం గ్రాంటుగా ఇవ్వలేమని, 70 శాతం ఇస్తామని కేంద్రం మధ్యేమార్గ ప్రతిపాదన చేసింది. అయితే, కేంద్రం ద్వారా విదేశీ రుణాలను భారీగా తెచ్చుకొనే వెసులుబాటును కల్పించుకొని ఆ రుణాలకు 70 శాతం గ్రాంటు నిబంధన వర్తింప చేసుకోగలిగితే రాషా్ట్రనికి చాలా ఉపయోగం ఉంటుందని ఎంపీల్లో కొందరు భావిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, పరిస్థితిని ఇంకా నాన్చడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్న కేంద్రం.. ముందుగా ప్యాకేజీని ఖరారు చేయాలని భావిస్తోంది. బీహార్‌కు ఇవ్వనున్న రూ.50 వేల కోట్ల ప్యాకేజీకన్నా ఏపీకి రెండింతలు అధికమైన ప్యాకేజీయే ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలాగే, హోదా అంశాన్ని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి చౌహాన్‌ నేతృత్వంలోని నీతి ఆయోగ్‌ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తేలుస్తామని చంద్రబాబుకు చెప్పి ఒప్పించాలని కేంద్రం భావిస్తోంది.

No comments:

Post a Comment