Monday, 17 August 2015

జూన్‌ నాటికి తాత్కాలిక రాజధానికి: యనమల

జూన్‌ నాటికి తాత్కాలిక రాజధానికి: యనమల
తరలివెళ్లే ఉద్యోగులకు ‘ప్రత్యేక’ ఏర్పాట్లు: సీఎస్

హైదరాబాద్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తాత్కాలిక రాజధానికి తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. రాజధానికి తరలిపోతే నివాసాలు, పిల్లల స్థానికత, వారి భవిష్యత్తుపై ఉద్యోగులు తొలి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందుగా ఈ సమస్యల నుంచి బయటపడే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. అధికారులకు కార్యాలయాలు, ఉద్యోగులకు నివాసాల కోసం విజయవాడ, గుంటూరు, నూజివీడుల్లో అందుబాటులో ఉన్న నిర్మాణాలను పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో చెప్పారు. ఆ మూడు ప్రాంతాల్లో కలిపి 6 లక్షల 72 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులో ఉందని గుర్తించారు. అధికారులు, మంత్రుల నివాసాల కోసం నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని 252 ఫ్లాట్లు, 31 విల్లాలు పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రైవేటు భవనాల అద్దె రుసుమును స్థానిక పరిస్థితికి అనుగుణంగా సవరిస్తామన్నారు. రాజధాని తరలింపు కోసం ఎంతైనా వెచ్చిస్తామని, ఎన్ని సమస్యలెదురైనా పరిష్కరిస్తామని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. విజయవాడ నుంచి పాలన సాగించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయని, తద్వారా రాష్ట్రానికి అన్ని విధాలా ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. కాగా, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకూ నిర్వహిస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

జాబితా రూపొందించాలంటూ సీఎస్‌ ఆదేశం 
హైదరాబా ద్‌ నుంచి నవ్యాంధ్ర రాజధానికి వెళ్లే ఉద్యోగుల పిల్లలకు స్థానికత విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి... అంతకు ముందు ఏడేళ్ల వ్యవధిలో నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే అక్కడ లోకల్‌గా పరిగణించాలని రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టం చేశాయి. ఈ వ్యవధిని రెండేళ్లకు కుదించి మధ్యేమార్గాన్ని చూపాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా హైదరాబాద్‌లో ఉండి... తిరిగి ఏపీకి వచ్చే ఇతర ఉద్యోగుల విషయంలో కూడా స్థానికత సమస్య తలెత్తుతుంది. ఈ వాదన పరిష్కరించడానికి అనేక న్యాయ, చట్టపరమైన చిక్కులు ఉన్నందున తాత్కాలిక ఏర్పాటుగా ఉద్యోగుల వరకూ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సోమవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సమక్షంలో జరిగిన సమావేశంలో న్యాయశాఖ కార్యదర్శి దుర్గాప్రసాద్‌ పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. హైదరాబాద్‌ నుంచి కొత్త రాజధానికి వెళ్లే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంటే.. వారి పేర్ల వరకూ జాబితా రూపొందించి కేంద్రం అనుమతి తీసుకుని ఆ ఉద్యోగుల పిల్లలను ఏపీకి స్థానికులుగా పరిగణించే ఏర్పాటు చేయవచ్చని దుర్గాప్రసాద్‌ సూచించినట్లు తెలిసింది. దీంతో ఆంధ్రా స్థానికత ఉండి హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారిలో తొమ్మిది నుంచి ఇంటర్‌ వరకూ చదువుతున్న పిల్లలు ఉన్నవారు ఎవరు? వారిలో ఎంతమంది కొత్త రాజధానికి శాశ్వత ప్రాతిపదికన తరలివెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లెక్కలు తీయాలని సీఎస్‌ ఆదేశించారు.

No comments:

Post a Comment