Tuesday 25 August 2015

ప్రత్యేక హోదా ఇస్తే ఏం వస్తుంది?

ప్రత్యేక హోదా ఇస్తే ఏం వస్తుంది?
గ్రాంటు, విదేశీ నిధులతోనే నవ్యాంధ్రకు లాభం


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రం నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తుందా!? హోదా పేరు లేకుండా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుందా!? అందులో గ్రాంటు ఎంత ఇస్తుంది!? ప్రత్యేక హోదాతో సమానంగా 90 శాతం గ్రాంటు ఇస్తుందా? 70 శాతానికే పరిమితం చేస్తుందా? హోదా ఇస్తే ఏపీకి ఒరిగేదేమిటి? హోదా లేకుండా ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తే ఒనగూరే లబ్ధి ఏమిటి? ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ సందర్భంగా వ్యక్తమవుతున్న ప్రశ్నలివి. ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలు.. ఏపీకి కలిగే ప్రయోజనంపై ఆర్థిక శాఖ వర్గాలు ఒక నివేదిక తయారు చేశాయి. దాని ప్రకారం, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే సాయం రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలకు ఒక పద్ధతిలో, మిగిలిన రాష్ట్రాలకు మరో పద్ధతిలో ఈ సాయం ఇస్తారు. మన దేశంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు పదకొండు (జమ్మూ కశ్మీర్‌, సిక్కిం, హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపుర) ఉన్నాయి. కేంద్రం తాను రాష్ట్రాలకు ఇచ్చే సాయంలో 30 శాతం ఈ ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, మిగిలిన 70 శాతం ఇతర రాష్ట్రాలకు ఇస్తుంది. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు కూడా ఎంత అంటే అంత ఇవ్వరు. వాటి వార్షిక ప్రణాళిక సైజు, అందులో ఖర్చు చూసి దాని ప్రకారమే ఇస్తారు. అయితే, అలా ఇచ్చే మొత్తంలో 90 శాతం గ్రాంటుగా ఇస్తారు. మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సాయంలో కేవలం 30 శాతం మాత్రమే గ్రాంటుగా ఉంటుంది. వివిధ పద్దుల కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తేడా ఇలా ఉంటుంది.
90 శాతం గ్రాంటు వస్తే..!?
నవ్యాంధ్రకు 90 శాతం గ్రాంటు ఇచ్చినా భారీగా నిధులు రావని అధికార వర్గాలు చెబుతున్నాయి. 90 శాతం గ్రాంటుగా ఇస్తున్న ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు, 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఈ రెండు రకాల రాష్ట్రాలకు కలిపి తన బడ్జెట్‌లో రూ.57,575 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు రూ.17 వేల కోట్లు కేటాయించింది. ఇందులో 90 శాతం గ్రాంటు కింద ఆ 11 రాష్ట్రాలకు కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు 30 శాతం గ్రాంటు కింద రూ.40 వేల కోట్లు ఇచ్చింది. అదే ఏడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వార్షిక ప్రణాళికను రూ.53 వేల కోట్లుగా నిర్థారించింది. నవ్యాంధ్రకు ఆ ప్రణాళిక రూ.27 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. నవ్యాంధ్రకు ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తే, ఈ ప్రణాళిక సైజు, కేంద్రం లెక్కల ప్రకారం 90 శాతం గ్రాంటు కింద రాష్ట్రానికి వచ్చే సాయం రూ.5600 కోట్లు మాత్రమే ఉంటుందని అంచనా. దీనికన్నా విదేశీ రుణ ప్రాజెక్టులకింద ఎక్కువ సాయం వచ్చే అవకాశం ఉందని ఏపీ ఆర్థిక శాఖ అంచనా. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, జపాన్‌కు చెందిన జైకా, ప్రపంచ బ్యాంక్‌ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రాష్ట్రానికి వచ్చే రుణ సహాయంలో కూడా తొంభై శాతం గ్రాంటుగా వస్తుంది. విదేశీ రుణ ప్రాజెక్టులు కూడా కేంద్రం ఆమోదిస్తేనే వస్తాయి. కేంద్రాన్ని ఒప్పించి ఈ రుణ ప్రాజెక్టులను ఎంత ఎక్కువ తెచ్చుకోగలిగితే రాష్ట్రానికి అంత ఉపయోగం ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఏఐబీపీ పథకం కింద కూడా ప్రత్యేక హోదా ద్వారా కొంత లాభం పొందే అవకాశం ఉందన్నది ఆ వర్గాల అంచనా. నీతి ఆయోగ్‌ ఆమోదం పొందిన మేజర్‌, మీడియం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ పథకం కింద కేంద్రం నిధులు ఇస్తుంది. ఇప్పటికే నిర్మాణం మొదలై వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయడానికి అవకాశం ఉన్న సాగునీటి పథకాలకు ఈ నిధులు ఇస్తారు. ప్రత్యేక హోదా వస్తే ఇవి కూడా 90 శాతం గ్రాంటుగా వస్తాయి. అయితే, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, దాని బదులు ఆ పేరుతో ఆర్థిక ప్రయోజనాలు ఇస్తామని కేంద్రం చెబుతున్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment