|
విజయవాడ, ఆగస్టు 24: రతన్ టాటా రాకతో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావారణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో వనరులకు కొదవ లేదని, పరిశ్రమల స్థాపనకు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడి గేట్‌వే హోటల్లో రతన్ టాటాతో పాటుగా పలువురు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టాటా ట్రస్టు దత్తత తీసుకున్న విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 264 గ్రామాల అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళికలను సీఎం చంద్రబాబు, రతన్ టాటా విడుదల చేశారు. దీంతో పాటుగా రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద లోక్‌సభ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడం దేశ చరిత్రలోనే ప్రథమం అని, దానికి విజయవాడ నాంది కావడం గర్వకారణం అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రతన్ టాటా లాంటి వారి సలహాలు ఎంతగానో అవసరం అన్నారు. అమరావతి నిర్మాణ దశలో రతన్ టాటా రాష్ట్రానికి రావటం ఎంతో సంతోషం అని అన్నారు. ప్రపంచంలోనే విలువలనున్న వ్యాపారవేత్త రతన్ టాటా అని, వ్యాపారానికి వన్నె తచ్చిన వ్యక్తి అని సీఎం కొనియాడారు. దేశంలోని వ్యాపార వేత్తలకు ఆదర్శవంతమైన వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసలు గుప్పించారు. రతన్ టాటా విజయవాడకు రావటం సంతోషమని.. విశాఖ, చిత్తూరు ప్రాంతాలకూ రావాలని కోరారు. రాష్ట్రంలో ఆక్వా, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధికి టాటా ప్రోత్సాహం కావాలని సీఎం కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ఖనిజ నిక్షేపాలకు కొదవే లేదని, ఈ నేపథ్యంలో ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు టాటా సంస్థ ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
వివిధ రంగాల వారు గ్రామాలను దత్తత తీసుకోవాలని తాను ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటి వరకు 10 వేల గ్రామాలు దత్తత తీసుకున్నారని, ఇంకా ఆరు వేల గ్రామాల దత్తతకు ఎన్‌ఆర్‌ఐలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ చరిత్రలో ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం ఇది అని బాబు చెప్పారు. టాటా ట్రస్టు రాష్ట్రంలోని 10 లక్షల జనాభాకు సంబంధించిన సంపూర్ణ వివరాలు సేకరించిందని, ఈ ట్రస్టుతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఎంతో విలువైనదని సీఎం పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న సాన్నిహిత్యంతో రాష్ట్రంలో ఇంక్యూబేషన్ కంపెనీలను ప్రమోట్ చేయాలని కోరానన్నారు. ఇందుకు ఆయన పూర్తిగా సానుకూలత వ్యక్తం చేశారని రతన్ టాటాకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇంటికో కంప్యూటర్ లిటరేట్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉండేలా చూస్తామని చెప్పారు. ఏపీలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్, సింగిల్ డెస్క్ పాలసీ, భూములు, నీరు ఆకర్షణీయ అంశాలని వివరించారు.
|
No comments:
Post a Comment