- ఉద్యోగుల బదిలీకి ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మరోసారి రంగం సిద్ధమైంది. ముచ్చటగా మూడోసారి బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా మే నుంచి జూన్ మధ్యలో వరకు సడలింపు ఇస్తారు. బదిలీల ప్రక్రియకు ఈ సమయంలో దాదాపు నెల రోజుల గడువును ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఈ ఏడాది కూడా బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసి జూన్‌లో సాధారణ బదిలీలు నిర్వహించుకునేందుకు గడువిస్తూ ప్రభుత్వం తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పట్టుమని వారం రోజులు కూడా సమయం ఇవ్వకపోవడంతో మంత్రులంతా కలసి ఈ గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు అంగీకరించిన ప్రభుత్వం గడువు పొడిగిస్తూ రెండోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియ జరిగే క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతో బదిలీలకు అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ జూలై 10వ తేదీ వరకూ అమలులో ఉండడంతో బదిలీలను నిలిపివేస్తూ ప్రభుత్వం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా జరిగిన బదిలీలను సైతం సమీక్షించాలని పేర్కొనడంతో అప్పటివరకూ చేసిన బదిలీలను పెండింగ్‌లో పెట్టారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం బదిలీలు నిర్వహించాలని భావించిన ప్రభుత్వం గోదావరి పుష్కరాలు రావడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్న ఉద్యోగులను కదిలించాల్సి వస్తుందని.. ఫలితంగా పుష్కర పనులకు అడ్డంకులు ఏర్పడతాయని భావించింది. పుష్కరాలు ముగిసిన అనంతరం మరోసారి తాజాగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి 15 వరకూ సాధారణ బదిలీలను నిర్వహించుకోవచ్చంటూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆదాయ వనరులుగా ఉన్న వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, రవాణా, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్యా శాఖల్లో బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతి అవసరమని పేర్కొంది. ట్రెజరీ, వర్కులు, అకౌంట్లు, జోనల్, మల్టీ జోనల్, విభాగాధిపతి కార్యాలయాలు, స్టేట్ ఆడిట్, కమిషనర్ భూసర్వే, రికార్డులు, ఆర్థిక, గణాంక శాఖలను బదిలీల నుంచి మినహాయించింది. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి వరకూ ఇతర శాఖల్లో బదిలీలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
http://epaper.andhrajyothy.com/news?cat=hyderabad&day=20150805#
No comments:
Post a Comment