Sunday, 30 August 2015

కలిసి కొట్లాడుదాం..!

కలిసి కొట్లాడుదాం..!
Updated :31-08-2015 02:16:44
  • హోదా కోసం బలవన్మరణాలు వద్దు
  • చంద్రబాబు మౌనమే ఏపీకి శాపం: కవిత
  • రాష్ట్రపతికి పరామర్శ, భగవద్గీత బహుకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదాకోసం ఏపీలో జరుగుతున్న ఆత్మహత్యలు చూస్తే బాధగా ఉందని, హక్కుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పోరాడుదామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో తెలంగాణలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్నాయన్నారు. అప్పటి తెలంగాణ తల్లుల కడుపుకోత తనకు తెలుసు కాబట్టే.. ఏపీలో ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని కవిత కోరారు. ‘ఒక సోదరిగా ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’నని తెలిపారు. కాగా, ప్రతి రాషా్ట్రన్ని ప్రధాని మోదీ ఫెడరల్‌ స్పూర్తితో సమానంగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు సాధించడానికి ఏపీతో కలిసి కొట్లాడేందుకు తమకెలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. మోదీ వైఖరిని చంద్రబాబు తప్పుపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీహార్‌లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ప్యాకేజీ ప్రకటించారని, కానీ.. ఏడాదిగా పెండిగ్‌లో ఉన్న ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు, అభివృద్ధి కోసం తెలంగాణకు ఇస్తామన్నవి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేర్చలేదన్నారు. వీటన్నింటిని చంద్రబాబు ఎత్తి చూపాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆయన మౌనం ఏపీకి శాపంగా మారుతోందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే.. ఇప్పుడు కృష్ణా జలాల కొరత ఏర్పడిందని, రాబోయే రోజుల్లో గోదావరి జలాల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంటుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పరిష్కారం కోసం తెలుగు రాషా్ట్రలుగా, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. సతీవియోగంతో దు:ఖంలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని.. సీఎం కేసీఆర్‌ తరపున ఎంపీ కవిత, మరికొందరు ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి హిందూ సాంప్రదాయం ప్రకారం భగవద్గీత బహూకరించినట్లు కవిత తెలిపారు.

No comments:

Post a Comment