Tuesday 18 August 2015

‘మేడిగడ్డ’ ఒక సాంకేతిక అవసరం

‘మేడిగడ్డ’ ఒక సాంకేతిక అవసరం
కాళేశ్వరం కోసం పాకులాట ఎందుకు అని వేములపల్లి వెంకట్రామయ్య నా వ్యాసానికి స్పందిస్తూ అనేక ప్రశ్నలు నాకు సంధించినారు. నా ‘అపొహలు - వాస్తవాలు’ అన్న వ్యాసం ఇంకా అనుమానాలు, అపోహలు పెంచే విధంగా ఉన్నాయి అని ఆరోపించినారు. వెంకట్రామయ్య గారికి వివరణలు ఇచ్చే క్రమంలో ప్రజలకు మరి కొన్ని అంశాలను చెప్పే అవకాశం చిక్కినందుకు సంతోషిస్తున్నాను.
 
తుమ్మిడిహెట్టి వద్ద ముంపు ఎంతో చెప్పలేదు. ఎక్కువ ముంపు అంటే ఎంత? అని ప్రశ్నిస్తూ తనే ముంపు వివరాలు పేర్కొన్నారు. అవి దాదాపు కరెక్టే. 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద ముంపు మహారాష్ట్రలో నదిలో 3395 ఎకరాలు, నది ఎగువన భూమి 1852 ఎకరాలు, తెలంగాణలో నదిలో 367 ఎకరాలు, నది ఒడ్డున 526 ఎకరాలు మొత్తం 6140 ఎకరాలు ముంపునకు గురి అవుతున్నాయి. కాలువల కోసం 8000 ఎకరాలు సేక రించిన ప్రభుత్వం మహారాష్ట్రలో 5247 ఎకరాలు సేకరించలేదా అన్నది వెంకట్రామయ్య ప్రశ్న. ముంపు ఎన్ని ఎకరాలు ఉన్నా సేకరించడానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలన్నది ప్రాథమిక అంశం. మహారాష్ట్రతో చర్చించకుండానే వారు ఒప్పుకోవడం లేదని అంటున్నారు అన్నది మరో ప్రశ్న. చర్చించలేదని అనడం సరి అయింది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తొలుత సాగునీటి మంత్రి హరీశ్‌ రావు గారు మహారాష్ట్ర సాగునీటి మంత్రితో జూలై, 2014లో సమావేశమై లెండి, పెన్‌ గంగ, ప్రాణహిత వివాదాలపై చర్చ జరిపారు. వారు అప్పుడు కూడా ముంపును తగ్గించడానికి తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును తగ్గించమని కోరినారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి స్వయంగా ఫిబ్రవరి, 2015లో ముంబాయి వెళ్ళి మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసినారు. ఆయన 160 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం తరలించికుపోవచ్చుననీ, అయితే తమ భూభాగంలో ముంపును ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసినారు. మహారాష్ట్ర భూభాగంలో ముంపును వ్యతిరేకించడానికి ఆయనకు ఉండే రాజకీయ కారణాలు ఆయనకు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణహిత ప్రాజెక్టుకు వ్యతిరేకంగా విదర్భలో ఉద్యమం నడిపింది ఆయనే. ముఖ్యమంత్రి అయినాక తన వైఖరిని మార్చుకోవడం ఆయనకు రాజకీయంగా సాధ్యం కాదు. గతంలో కాంగ్రేస్‌ ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చవాన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా కొనసాగిస్తున్న ప్రాణహిత పనులపై ఘాటైన లేఖ రాసిన సంగతి గత వ్యాసంలో పేర్కొన్నాను. అంతే కాదు 13 జూలై 2015న ఢిల్లీలో జాతీయ జల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై జరిగిన సదస్సులో మహారాష్ట్ర సాగునీటి సహాయమంత్రి విజయ్‌ శిత్వారె సందర్భం కాకపోయినా తన ఉపన్యాసంలో ఆ తర్వాత పట్టుబట్టి మినిట్స్‌లోనూ నమోదు చేయించినారు. పాఠకుల సౌకర్యం కోసం మినిట్స్‌లోని ఆ భాగాన్ని ఉటంకిస్తున్నాను. “... He requested the state of Telangana to decrease the FRL of Pranahita – Chevella Project by 4.0 meters i.e from FRL + 152.00 m to RL 148.00 m so that about 2100 hectares of land from 30 villages in Chandrapur and Gadchiroli districts of Maharashtra cab be saved from going in the submergence. The special representative , Govt of Telangana agreed to study this issue and assured the Govt of Telangana would ensure to keep the submergence as minimum as possible". దీన్నిబట్టి ముంపు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇప్పుడూ అదే కఠిన వైఖరితో ఉన్నట్లు కనబడుతున్నదని వెంకట్రామయ్య గారు, పాఠకులూ గమనించాలి.

జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలను కుంటున్నది కనుక ముంపు సమస్యను పరిష్కరించడంలో కేంద్రం ద్వారా ప్రయత్నించాలి అని వెంకట్రామయ్య సూచిస్తున్నారు. సూచన మంచిదే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో, కేంద్ర జలవనరుల మంత్రి సమక్షంలోనే వారు తమ వైఖరిని ప్రకటిస్తే, కేంద్రం చుప్‌ చాప్‌గా వారి మాటల్ని సందర్భం కాకపోయినా మినిట్స్‌లో నమోదు చెయ్యడం చూస్తే వెంకట్రామయ్య గారు చేసిన సూచన సాధ్యం అవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. పైగా రెండూ బీజేపీ ప్రభుత్వాలే.
 
మేడిగడ్ద వద్ద ముంపు అసలు లేదు అని నేను మొదటి వ్యాసం రాసిన మాట నిజమే. సమగ్ర సర్వే తర్వాతనే ముంపు ఎంత అనేది తెలుస్తుందని రెండో వ్యాసంలో రాసిన మాటా నిజమే. ఇందులో ఏది నిజం అని ఆయన ప్రశ్న. రెండు మాట లకు కట్టుబడి ఉన్నాను. 100 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద మహా రాష్ట్రలో ముంపు ఉండదని సర్వేఆఫ్‌ ఇండియా వారి కాంటూరు మ్యాపులను అధ్యయనం చేసినప్పుడు తెలిసిన ప్రాథమిక విష యం. గ్రౌండ్‌ సర్వేలో మరింత సమగ్ర సమాచారం అందు తుంది. లైడార్‌ సర్వే ద్వారా 3డీ మోడల్‌లో మనకు మ్యాపులు వస్తాయి కనుక మన రాష్ట్రంలో ముంపు ఎంత ఉంటుంది, 100 మీటర్లు, 101మీటర్లు, 102 మీటర్లు, 103 మీటర్లు ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద మహారాష్ట్రలో ముంపు వివరాలు కూడా తెలుస్తాయి. రెండో వ్యాసం రాసే నాటికి ఆ సర్వే జరుగుతున్నది కనుక ఆ మాటే రాసినాను. ఇందులో పరస్పర విరుద్ధమైన అంశాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. మహారాష్ట్రతో ఎటువంటి కొలుపులు లేకుండానే రెండు బ్యారేజీలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అది తప్పెట్లా అవుతుంది? అది కాళేశ్వరం కోసం పాకులాటగా కనిపిస్తే అది చూసే వారి దృష్టి లోపం. అది పాకులాట కాదు సాంకేతిక అవసరం మాత్రమే.

తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ ఏది ప్రధాన ప్రాజెక్టు అన్నది వారి మరో ప్రశ్న. ప్రాణహిత-చేవేళ్ళ లేదా కాళేశ్వరం లేదా మేడిగడ్డ-పాములపర్తి పేరు ఏదైనా అది అనేక కాంపోనెంట్స్‌ కలిగిన ఒక బృహత్తర ప్రాజెక్టు. ఇందులో ఒకటి ప్రధానం మరొకటి అప్రధానం అంటూ ఉండదు. అన్నీ ప్రధానమైనవే. దేని ప్రాధాన్యం దానిదే. అన్ని కలిస్తేనే అది ఒక సమగ్ర ప్రాజెక్టుగా రూపం సంతరించుకుంటుంది. అందుకని వారి ప్రశ్న అమాయకమైనదే కాక అసమంజసం కూడా. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేది ఈ సమగ్రమైన ప్రాజెక్టుకే తప్ప తుమ్మిడిహెట్టికో, మేడిగడ్దకో, పాములపర్తికో ఇవ్వదు. కాబట్టి కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పుడు రాష్ర్టానికి రావలసిన 90ు గ్రాంటు ఎక్కడికి పోదు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎప్పడు పూర్తి చేస్తారు అని మరో ప్రశ్న. అన్నిపరిస్థితులు కలిసివస్తే మూడేండ్లలో పూర్తి చెయ్యా లని ప్రభుత్వం భావిస్తున్నది. ఇకపోతే తడకపల్లి జలాశయం నుంచి హాల్దీ నది ద్వారా నిజంసాగర్‌కు, అక్కడి నుంచి శ్రీరాం సాగర్‌కు నీటిని తరలించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చేసిన మాట నిజమే. అది సాంకేతికంగా అసాధ్యమేమీ కాదు. భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసినప్పుడు అది సాధ్యమే అని తెలుస్తున్నది. తడకపల్లి ఎఫ్‌ఆర్‌ఎల్‌ 556 మీటర్లు, హల్ది వాగు మట్టం 514 మీటర్లు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ 469 మీటర్లు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎఫ్‌ఆర్‌ఎల్‌ 332 మీటర్లు. నదీ వాలు మార్గం ద్వారా తడకపల్లి నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని తరలించడం సాంకేతికంగా సాధ్యమే పైసా ఖర్చు లేకుండా. అంతకు మించి దిగువ గోదావరి నుంచి ఎగువ గోదావరి నీరు తరలించాలన్న ఆలోచనలో ఉన్న హేతుబద్దతను పాఠకులు అర్థం చేసుకోవాలి. దిగువ గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసిన తర్వాతనే గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్న సంగతి అందరికి ఎరుకే. 3000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసేది ఈ నీరే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలు ఎన్ని నీళ్ళైనా వాడుకునే వెసులుబాటు ఉన్నది ఈ రీచ్‌లోనే. ఎగువ గోదావరి వట్టి పోయింది. నిజాంసాగర్‌ నిర్దేశిత ఆయకట్టుకు నీరిర్వలేని పరిస్థితి ఉన్నది కనుకనే అయకట్టును స్థిరీకరించడానికి శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి 6 టీఎంసీల నీటిని తరలించడానికి అలిసాగర్‌, గుత్పా ఎత్తిపోతల పథకాలని గత ఉమ్మడి ప్రభుత్వం నిర్మించింది. జలయజ్ఞంలో తెలంగాణలో పూర్తి అయినవి ఈ రెండే ప్రాజెక్టులు. శ్రీరాంసాగర్‌ జలాశయానికి నీరు రాకడ అనిశ్చితంగా మారింది. ఎగువన మహారాష్ట్ర అనేక బ్యారేజీలను నిర్మించిన తర్వాత ఈ అనిశ్చితి మరింత పెరిగింది. కాబట్టి నీరున్న దిగువ గోదావరి నుంచి 160 టీఎంసీలను 556 మీటర్ల ఎత్తువరకు తీసుకవస్తున్నప్పుడు పైసా ఖర్చు లేకుండా నదీ వాలు మార్గం ద్వారా అవసర మైనప్పుడు నిజాంసాగర్‌కు, శ్రీరాంసాగర్‌కు తరలించవచ్చునన్న ప్రభుత్వ భావన హేతుబద్దమైనదే.
 
- శ్రీధర్‌రావు దేశ్‌పాండె
ఓఎస్‌డీ, సాగునీటిశాఖ

No comments:

Post a Comment