వెనకబడిన జిల్లాలకు సాయం చేయాల్సిందే
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని త్వరగా పరిశీలించాలని నీతి ఆయోగ్ అధికారులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. తన నివాసంలో గురువారం ఆయన నీతి ఆయోగ్ అధికారులతో సుమారు 70 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఇందులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సభ్యులు వివేక్ డెబ్రాయ్, సీఈవో సింధుశ్రీ కుల్లార్ పాల్గొన్నారు. అనంతరం పట్టణాభివృద్ధి శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా విభజనకు దారితీసిన పరిస్థితులతోపాటు విభజన చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు జరిగిన చర్చల సారాంశాన్ని వెంకయ్య వారికి వివరించారు. రాజధాని లేకపోవడంతోపాటు రెవెన్యూ లోటుతో ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షుణ్ణంగా తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అదనంగా ఆర్థిక చేయూత అందజేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సరిపోయినన్ని నిధులు ఇవ్వాలని సూచించారు. కలహండి-బొలంగిరి-కోరాపుట్(కేబీకే) తరహాలో పారిశ్రామిక అభివృద్ధికి ఏపీకి రాయితీలు ఇవ్వాలని, హిమాచల్ ప్రదేశ్‌కు గతంలో ఇచ్చినట్లు పన్ను మినహాయింపులు, విదేశీ సాయంతో ప్రాజెక్టులకు నిధుల శాతాన్ని పెంచడం వంటి వాటిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న వివిధ ప్రాజెక్టులకు తగినన్ని నిధులను కేటాయించాలని కోరారు.
No comments:
Post a Comment