|
బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారం వేగంగా వేడెక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన చిరకాల ప్రత్యర్థి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తోంది. అందుకోసం మోదీ-అమిత్ షా ద్వయం సర్వశక్తుల్ని వినియోగిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం ‘పరివర్తన ర్యాలీ’లను బీజేపీ ప్రారంభించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మోదీ గయ సందర్శించడం ఇది రెండోసారి. ‘మోదీ గేట్’ వివాదం నేపథ్యంలో ప్రధాని మోదీ మంత్రం బీహార్‌లో ఫలించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ), రాషీ్ట్రయ జనతాదళ్ (ఆర్‌జేడీ) కూటమిని ఎదుర్కొనేందుకు ఆదివారం గయలో బీజేపీ నిర్వహించిన రెండవ పరివర్తన యాత్రలో ప్రధాని మోదీ పాల్గొనడం విశేషం. పదిహేను రోజుల్లో ఆయన రెండవసారి బీహార్‌కు వచ్చారంటే ఈ శాసనసభ ఎన్నికల్ని బీజేపీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తుందో ఊహించవచ్చు. ఆగస్టు 18న సహర్సా, 30న భగల్పూర్ పరివర్తన యాత్రలలో ప్రధాని పాల్గొనబోతున్నారు. అక్టోబర్-నవంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీహార్‌లో ఆటవిక పాలనకు తెరపడనుందని నితీశ్ సర్కారుపై మోదీ వ్యంగ్యాసా్త్రలు సంధించారు. ఈ ఎన్నికల్లో జేడీ(యూ), ఆర్జేడీ రాజకీయ అవకాశవాద కూటమికి అధికారం కట్టబెడితే మరోసారి అటవిక రాజ్యమే వస్తుందని ఆయన హెచ్చరించారు. నితీశ్‌కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ పొత్తుపై మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్ అంటే ‘బీమార్’ (రోగగ్రస్థ) రాష్ట్రం అనే మచ్చను తొలగించుకుని, అన్ని విధాల అభివృద్ధికి నోచుకోవాలంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు మోదీ పిలుపు ఇచ్చారు. జులై 25న ముజఫర్‌పూర్‌లో జరిగిన బీజేపీ పరివర్తన యాత్రలో నితీశ్ కుమార్ డీఎన్‌ఏలోనే ‘ప్రజాస్వామ్యం’ కొరవడిందని మోదీ చేసిన వ్యాఖ్య వివాదాస్పదంగా మారింది. ఆ వ్యాఖ్యానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ‘శబ్దవాపసీ’ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు నితీశ్ ప్రకటించారు. అందులో భాగంగా 50 లక్షల మంది బీహారీయుల సంతకాలతో డీఎన్‌ఏ శాంపిల్స్‌ను నిరసనగా ప్రధాని మోదీకి పంపుతున్నట్లు నితీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. బీహార్‌లో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని ప్రకటించిన మోదీ ఆయన హయాంలో గుజరాత్‌లో మైనారిటీ వర్గాలపై జరిగిన మారణహోమాన్ని మరచినట్లున్నారని నితీశ్ ఎద్దేవా చేశారు. నితీశ్ డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం లేదని మోదీ చేసిన వ్యాఖ్య ఈ ఎన్నికల్లో కీలక రాజకీయ వివాదాంశంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
1970ల నుంచి అభివృద్ధి విషయంలో బీహార్ రాష్ట్రం ఇతర రాషా్ట్రల కంటే బాగా వెనకబడి పోయింది. కేంద్ర ప్రభుత్వం 1952లో రూపొందించి 1993 వరకు కొనసాగించిన ‘ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ’ ప్రకారం దేశంలో ఏ మూల పరిశ్రమను నెలకొల్పినా ముడి ఖనిజాలను సబ్సిడీపై ప్రభుత్వమే రవాణా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఖనిజ సంపదలున్న ప్రాంతాలలో ప్రైవేటు కంపెనీలకు పోత్సాహకాలు సన్నగిల్లాయి. దాంతో ప్రైవేట్ పరిశ్రమలు కోస్తా ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి. పర్యవసానంగా బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్), పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ (చత్తీ్‌సగఢ్), ఒరిస్సా వంటి ఖనిజ సంపదలున్న రాషా్ట్రల్లో అభివృద్ధి కుంటు పడింది. దాంతో బీహార్ ప్రజలు దేశవ్యాప్తంగా వలసల బాట పట్టారు. అభివృద్ధిపరంగా, సామాజికంగా బాగా వెనకబడి, వలస సమస్యతో సతమతమవుతున్న బీహార్ సంకటకాల్ని పరిష్కరించే విధానాలు కలిగిన రాజకీయ పక్షం అధికారంలోకి రావడం ఆ రాష్ట్ర ప్రజల తక్షణావసరం. బీహార్‌లో శాసనసభ 2015 నవంబర్ 29తో ముగుస్తుండడంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. బీజేపీ దూకుడును ఎదుర్కొనేందుకు చిరకాల ప్రత్యర్థులుగా అధికారం కోసం పోటీపడుతున్న జేడీ(యూ), ఆర్జేడీలు, సమాజ్‌వాది పార్టీ, జనతా దళ్ (సెక్యులర్), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, సమాజ్‌వాది జనతా పార్టీ నితీశ్ కుమార్ సారథ్యంలోని ‘జనతా పరివార్’ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి కాంగ్రెస్, ఎన్‌సీపీలతో కలసి ఉమ్మడిగా త్వరలో జరగబోయే బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి లోక్ జనశక్తి, రాషీ్ట్రయ లోక్ సమతా పార్టీ, మాంఝి నాయకత్వంలోని హిందుస్తానీ అవామీ మోర్చాలతో కలసి ఉమ్మడి పోరాటానికి రంగం సిద్ధం చేసింది. పదిన్నర కోట్ల బీహార్ జనాభాలో 51 శాతం బీసీలు ఉండగా, 16 శాతానికి పైగా దళితులు, మహాదళితులు ఉన్నారు. దాంతో వర్గ-కుల-మత సోషల్ ఇంజనీరింగ్ పునాదిపై ఏర్పడిన రాజకీయ పొత్తుల రూపంలో బీహార్ రాజకీయాలు నడుస్తున్నాయి. మూడునెలల కిందట ఈబీసీ జాబితాలో తెలీ కులంతో పాటు మరికొన్ని కులా ల్ని నితీశ్ చేర్చడం వివాదాస్పదమైంది. రూ.15 లక్షల లోపు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఓబీసీ ఈబీసీ, ఎస్సీ ఎస్టీలకు 50 శాతం కోటాను నితీశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఒకటిన్నర లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న అగ్రవర్ణాలకు, ముస్లింలకు ఆర్థిక సహాయాన్ని, కుల ధ్రువీకరణ పత్రాలను అందించాలని కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కుల-మత ఓటు బ్యాంకుల పునాదిగా సాగుతున్న బీహార్ రాజకీయాలు సమ్మిళిత అభివృద్ధికి నామమాత్ర ప్రాధాన్యమిస్తున్నాయి. ముంబయి పేలుళ్ళ కేసులో యాకూబ్ మెమెన్‌ను ఉరి తీయడం, రూ.50వేల కోట్ల అభివృద్ధి ప్రణాళికల వంటివి, ‘పరివర్తన ర్యాలీ’లు బీహార్ పీఠాన్ని అధిష్ఠించేందుకు బీజేపీకి ఏ మేరకు ఉపకరించగలవో చూడాలి! |
No comments:
Post a Comment