Wednesday, 26 August 2015

హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు

హిందువులు తగ్గారు.. ముస్లింలు పెరిగారు
వృద్ధిరేటులోనూ ముందు.. జనాభా మతగణన వివరాలు

  • దశాబ్దకాలంలో 0.8 పర్సంటేజ్‌ పాయింట్ల వృద్ధి
  • హిందువుల్లో 0.7 పర్సంటేజ్‌ పాయింట్ల తగ్గుదల
  • హిందువుల్లో 16.8 శాతమే
  • ముస్లింల వృద్ధిరేటు 24.6 శాతం 
  • మొత్తం జనాభాలో హిందువులు 79.8శాతం
  • ఐదు దశాబ్దాలుగా తగ్గుతూ వస్తున్న హిందూ జనాభా
న్యూఢిల్లీ, ఆగస్టు 25 : మతాలవారీగా జనాభా లెక్కల వివరాలను ఎన్డీయే సర్కార్‌ మంగళవారం విడుదల చేసింది. 2011 జనగణన ఆధారంగా రిజిసా్ట్రర్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం దేశ జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. జనాభా వృద్ధి రేటులో హిందువుల కన్నా ముస్లింలు ముందువరుసలో ఉన్నారు. 2001-11 నడుమ దశాబ్ద కాలంలో హిందూ జనాభా వృద్ధి రేటు 16.8 శాతంగా నమోదైతే, ముస్లిం జనాభా వృద్ధి రేటు 24.6 శాతంగా నమోదైంది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు(17.7శాతం) కన్నా ఎక్కువ. 1991-2001 నడుమ ముస్లిం జనాభావృద్ధి రేటు(29 శాతం) కన్నా తక్కువ. దశాబ్ద కాలంలో మొత్తం జనాభాలో ముస్లిం జనాభాలో 0.8 పర్సంటేజ్‌ పాయింట్ల(పీపీ) శాతం వృద్ధి నమోదైతే హిందూ జనాభాలో 0.7 పీపీ తగ్గుదల నమోదైంది. అసోంలో ముస్లిం జనాభా వృద్ధి మిగిలిన రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మణిపూర్‌లో మాత్రం దశాబ్దకాలంలో ముస్లిం జనాభా తగ్గడం గమనార్హం. దేశంలో ముస్లిం జనాభా తగ్గుదలను నమోదు చేసిన ఏకైక రాష్ట్రం మణిపూర్‌. దశాబ్దకాలంలో మిగిలిన మతాల వృద్ధిరేటును పరిశీలిస్తే.. క్రైస్తవుల్లో 15.5 శాతం, సిక్కుల్లో 8.4 శాతం, బౌద్ధుల్లో 6.1 శాతం, జైనుల్లో 5.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. 1961 నుంచి హిందూ జనాభా క్రమేణా తగ్గుతూ వస్తుండగా, ముస్లిం జనాభా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 
  • తెలంగాణలో హిందువులు 85.09 శాతం
  • ముస్లిం జనాభా 12.68 శాతం(హైదరాబాద్ ముస్లింలు టాప్)
  • క్రైస్తవులు 1.27 శాతం  
తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 3.51 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 85.09 శాతం, ముస్లింలు 12.68 శాతం ఉన్నారు. క్రైస్తవుల జనాభా 1.27 శాతంగా నమోదైంది. మతపరమైన జనాభా లెక్కలను 2011 జనగణన ఆధారంగా మంగళవారం భారత గణాంక శాఖ విడుదల చేసింది. తెలంగాణలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌లో ముస్లింల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక్కడ 17.13 లక్షల మంది ముస్లింలు ఉండగా, అత్యల్పంగా ఖమ్మంలో 1.58 లక్షల ముస్లింలు ఉన్నారు. క్రైస్తవుల సంఖ్య కూడా హైదరాబాద్‌లోనే ఎక్కువగా(87.5వేలు) ఉంది. ఆదిలాబాద్‌లో అతి తక్కువ సంఖ్యలో(15.4) క్రైస్తవులు ఉన్నారు.  
  • ఏపీలో హిందువులు 90.86 శాతం, 
  • ముస్లింలు 7.3 శాతం.. కృష్ణాలో అధికసంఖ్యలో క్రైస్తవులు
ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభాలెక్కల ప్రకారం 4.93 కోట్ల మంది జనాభా ఉండగా వారిలో హిందువులు 90.86 శాతం ఉన్నారు. ముస్లిం జనాభా 7.3 శాతంగా నమోదైంది. భారత గణాంకశాఖ మంగళవారం మతపరమైన జనాభా లెక్కల వివరాలను వెల్లడించింది. ఏపీలో క్రైస్తవుల జనాభా శాతం 1.3గా నమోదైంది. ఏపీలో హిందూ, ముస్లింలలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. క్రైస్తవుల్లో మాత్రం మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలవారీగా కర్నూలులో అత్యధికంగా 6,70,737 మంది ముస్లింలు ఉండగా, రెండోస్థానంలో గుంటూరు ఉంది. ఇక్కడ 5,59,770 మంది ముస్లింలు ఉన్నారు. అత్యల్పంగా శ్రీకాకుళంలో 9025 మంది ముస్లింలు ఉన్నారు. ఏపీలో క్రైస్తవుల సంఖ్య కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉంది. ఇక్కడ 1,45,598 మంది క్రైస్తవులు ఉన్నారు.

No comments:

Post a Comment