Wednesday 26 August 2015

తిరుపతి వస్తా.. ప్రకటన చేస్తా.. - మోదీ

మాట మరువం.. హామీలు అమలు చేస్తా
తిరుపతి వస్తా.. ప్రకటన చేస్తా..

  • ముఖ్యమంత్రి  చంద్రబాబుకు ప్రధాని మోదీ హామీ
  •  హామీలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వండి
  • నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడికి ప్రధాని ఆదేశం
  • మాట ఇచ్చారు.. మీరిక తప్పించుకోలేరు!
  • ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వాల్సిందే
  • వెంకన్న సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చారు
  • ఇవేవీ మా రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదు
  • ఇవ్వలేకపోతే ప్రజల్ని ఒప్పించే బాధ్యత మీదే
  • ప్రధానికి తేల్చిచెప్పిన చంద్రబాబు
‘‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అనుకూలంగా లేవన్న మాట నిజమే! కానీ, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నిజమే. వాటిలో మనం దేనిని ఎంత వరకు చేయగలం అన్న దానిపై కసరత్తు చేయండి. వీలైనంత త్వరగా నాకు నివేదిక ఇవ్వండి’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియాను ఆదేశించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా, తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీ ప్రజలకు హామీలు ఇచ్చిన మాట కూడా నిజమేనని, నవ్యాంధ్రను ఆదుకుంటానని తిరుపతిలో తానే చెప్పానని, ఢిల్లీకి దీటైన రాజధానిని కూడా నిర్మిస్తానని చెప్పానని, మళ్లీ తిరుపతికి వచ్చి తానే ప్రకటన చేస్తానని మోదీ భరోసా ఇచ్చారు. 
 
న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు కేంద్రం ఇచ్చిన హామీలపై మంగళవారం ఉదయం చంద్రబాబు ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యారు. గంటా 35 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఆ శాఖ సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబు 45 నిమిషాలపాటు మాట్లాడారు. వాస్తవానికి, మోదీ వద్ద 45 నిమిషాలు మాత్రమే భేటీ జరగాల్సి ఉంది. కానీ... దీనిని మరో 50 నిమిషాలపాటు పొడిగించారు. హడావుడిగా రాషా్ట్రన్ని విభజించిన తీరు, హైదరాబాద్‌ నగరాన్ని, అక్కడ ఉన్న సంస్థలు, వ్యవస్థలను వదులుకొని రావడం ద్వారా తాము పడుతున్న (మొదటిపేజీ తరువాయి)
ఇబ్బందులు, తెలంగాణలో కొందరు పనిగట్టుకొని లేవనెత్తుతున్న ద్వేష భావం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో పెరుగుతున్న అసహనం, ఆత్మహత్యాయత్నాలు వంటివాటిని ఆయన వరుస క్రమంలో వివరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘ఈ విభజన సీమాంధ్ర ప్రజలు కోరుకున్నది కాదు. ఇప్పుడు... నవ్యాంధ్ర పొరుగు రాష్ర్టాలతో సమానంగా అభివృద్ధి చెందే దాకా సాయం చేయాల్సిన బాధ్యత మీదే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వాల్సిందే. హోదా ఇవ్వలేకపోతే... ఎందుకు ఇవ్వలేరో మీరే ప్రజలకు చెప్పండి! హోదాకు బదులుగా ఏం ఇస్తారో చెప్పండి. వాటిని ముందు స్పష్టం చేయండి. తప్పించుకోవాలని చూస్తే బాధ్యతారాహిత్యం అవుతుంది. విభజన సమయంలో పార్లమెంటులో మీ పార్టీ ఏం చెప్పిందో గుర్తుకు తెచ్చుకోండి. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే... అది సరిపోదని, పదేళ్లు కావాలని వెంకయ్య నాయుడు, జైట్లీ కోరారు. ఈ విషయాన్ని ఏపీ ప్రజలు మరచిపోలేదు’’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను అన్నీ విన్న తర్వాత ప్రధాని స్పందించారు. ‘‘ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. మీ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలకు మేం కట్టుబడి ఉన్నాం. వాటి నుంచి వైదొలగే ఆలోచన లేదు’’ అని తేల్చి చెప్పారు.
 
ఏపీ ఆర్థిక సమస్యలను చంద్రబాబు వివరిస్తున్నప్పుడు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఒకటి రెండుసార్లు అడ్డుపడ్డారు. ‘‘రుణ మాఫీ వంటి పథకాలకు మీరు విపరీతంగా ఖర్చు చేస్తూ లోటు బడ్జెట్‌ అని మా వద్దకు వస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. ఇందుకు చంద్రబాబు కూడా దీటుగానే జవాబిచ్చారు. ‘‘పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు నేను మీ అందరికంటే ఎక్కువగా ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడాను. అమలు చేశాను. దానివల్ల చివరకు ఓడిపోయాను. రైతులకు రుణ మాఫీ మా ఎన్నికల వాగ్దానం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా సమతుల్యం చేసుకోవాలి. ఆర్థిక సిద్ధాంతాలు వినడానికి బాగానే ఉంటాయి.
రాజకీయంగా మా మనుగడ కూడా చూసుకోవాలి. రైతులు బాగా చితికిపోయినందువల్లే ఆ హామీ ఇచ్చాం. అమలు చేశాం’’ అని చెప్పారు. ఏపీలోని విద్యుత్‌ సంస్థలకు భారీగా సబ్సిడీలు ఇవ్వాల్సి వస్తోందని, వేల కోట్లు దానికి ఖర్చు పెడుతూ ఆ లోటును తమను పూడ్చమంటే ఎలా అని మరో సందర్భంలో అరవింద్‌ ప్రశ్నించారు. ‘‘మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే మేం విద్యుత్‌ సంస్థలను బాగా నడుపుతున్నాం. వచ్చే ఏడాదినాటికి పంపిణీ నష్టాలు ఆరు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. అయినా విద్యుత్‌ సంస్థలకు ఇప్పుడున్న నష్టాలు ఈ ఒక్క ఏడాదిలో మా పాలనలో వచ్చినవి కావు. వారసత్వంగా వచ్చాయి. వాటిని దిద్దుకోవడానికి కష్టపడుతున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.
 
విదేశీ రుణాలే మాకు ముఖ్యం
నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాపై కూడా సమావేశంలో తర్జనభర్జన జరిగింది. ‘‘ప్రత్యేక హోదాను నేరుగా ప్రకటించడానికి మాకు కొన్ని ఇబ్బందులున్నాయి. మీకు అదే కావాలంటే ఇస్తాం. కానీ, దానివల్ల మీకు మరీ ఎక్కువ ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చు. పేరుతో సంబంధం లేకుండా అంతకంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు తీసుకోవడం మీకు సమ్మతమైతే దానిపై మేం ఆలోచన చేస్తాం’’ అని జైట్లీ సూచించారు. దాంతో, హోదా ఇవ్వలేకపోతే ఆ మాట మీరే ప్రజలకు చెప్పి ఒప్పిస్తే బావుంటుందని, మీరు ఇచ్చిన హామీలకు వేరే ఎవరినో బలి చేస్తామనడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. ‘‘మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. మాకు అభ్యంతరం లేదు. ప్రత్యేక హోదా ఇస్తే మాకు మీ నుంచి వచ్చే నిధులు 90 శాతం గ్రాంటుగా వస్తాయి. అంతే శాతం నిధులు మాకు గ్రాంటుగా కావాలి. ప్రత్యేకించి విదేశీ రుణాల్లో ఈ గ్రాంటు మాకు చాలా అవసరం. ఆ రుణాలే మాకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏ పేరుతో అయినా సరే ఎంత ఇస్తారన్నదే మాకు ముఖ్యం. ఈ విషయంలో మీరు ఉదారంగా ఉంటే చాలు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. దాంతో, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు దీనికి అనుకూలంగా లేవని అరవింద్‌ వ్యాఖ్యానించారు. అయితే, ‘‘అది నిజమే. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు కూడా నిజం. ఇందులో మనం ఏది ఎంత వరకూ చేయగలమన్న దానిపై మీరు కసరత్తు చేసి వీలైనంత త్వరగా నాకు నివేదిక ఇవ్వండి’’ అని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ను ప్రధాని ఆదేశించారు. మళ్లీ తిరుపతికి వచ్చి ప్రకటన చేస్తా. వెంకన్నను దర్శించుకుంటానని మోదీ చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment