Thursday, 27 August 2015

అమరావతికి ప్రపంచ బ్యాంకు చేయూత

అమరావతికి ప్రపంచ బ్యాంకు చేయూత
ఏపీ సీఎస్‌తో ప్రపంచబ్యాంకు అధికారుల భేటీ

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి సహకరించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఏపీ సర్కార్‌ కోరింది. ఏపీ సర్కార్‌ ప్రతిపాదనకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అమరావతి నిర్మాణానికి ఎంత పెట్టుబడి కావాలన్న దానిపై సమగ్ర నివేదిక ఇస్తే నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ప్రపంచ బ్యాంకు అధికారులు తెలిపారు. రాజధానిలో సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ తదితర నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవని, ప్రపంచ బ్యాంకు సహకరించాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఎదుట ప్రతిపాదన ఉంచింది. ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయంతో జరుగుతున్న పనులపై చర్చించేందుకు గురువారం ఏపీ సీఎ్‌సతో కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ కార్యదర్శి రవికుమార్‌, ప్రపంచ బ్యాంకు భారత ప్రతినిధి ఓర్లార్‌ హుల్‌ తదితరులు భేటీ అయ్యారు. 
 
ఏపీ సర్కార్‌ ఏం కోరిందంటే..
అమరావతి నిర్మాణానికి సహకరించడంతోపాటు గ్రామీణ నీటిపారుదల వ్యవస్థల బలోపేతానికి సహకరించాలని ఏపీ సర్కార్‌ ప్రపంచబ్యాంకును కోరింది. మౌలిక వసతులకు సంబంధించి మరో రెండు ప్రాజెక్టులకు నిధులివ్వాలని కూడా అభ్యర్థించింది. త్వరలోనే వీటి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్‌ ఆధునికీకరణ పనులకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రూ.4,444 కోట్లును ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగాక ఈ రుణంలో ఏపీ వాటా రూ.2832 కోట్లుగా ఉంది. తన వాటా నిధుల్లో ఏపీ సర్కార్‌ ఇప్పటికే రూ.900 కోట్లును వ్యయం చేసింది. ఈ ఆధునికీకరణ పనులను 2016 జూలై నాటికి పూర్తి చేయాల్సి ఉండగా మరో రెండేళ్లు పొడిగించాలని ఏపీ సర్కార్‌ కోరింది. కానీ, సమయం ఉన్నందువల్ల పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని, ఆ తర్వాత కావాలంటే గడువు పెంచుతామని ప్రపంచ బ్యాంకు అధికారులు తెలిపారు. చెరువులు, చిన్నతరహా నీటి వనరుల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు రెండో విడత ఆర్థిక సహాయం కింద రూ.2 వేల కోట్లు మంజూరుచేయాలని ఏపీ జలవనరుల శాఖ కోరింది. సమగ్ర నివేదిక సమర్పిస్తే తాము వాటికి ఆమోదం తెలుపుతామని కేంద్రం తెలిపింది. 

No comments:

Post a Comment