Friday, 24 July 2015

ప్లాన్‌ ఓకే... ప్లాట్లు ఎప్పుడు?

ప్లాన్‌ ఓకే... ప్లాట్లు ఎప్పుడు?
ఏపీ రాజధాని రైతుల మదిలో సందేహాలు

విజయవాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ‘నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు 2035 వరకు దశల వారీగా పూర్తవుతాయి. 2018 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయి’- రాజధాని ప్లాన్‌లో సింగపూర్‌ ప్రభుత్వం ఈ వాక్యాలను చేర్చడం భూములు ఇచ్చిన రైతులను అయోమయానికి గురి చేస్తోంది. రాజధాని భూములను దశలవారీగా అభివృద్ధి చేస్తే తమకు ఇవ్వాల్సిన ప్లాట్లను ఎప్పుడు ఇస్తారనే సందేహాలు వారిని ముసురుకుంటున్నాయి. ‘‘మాస్టర్‌ ప్లాన్‌, సీడ్‌ కేపిటల్‌ ప్లాన్‌ రెండూ చాలా బాగున్నాయి. కానీ, 2018 నాటికి తొలిదశ పనులు పూర్తవుతాయని అంటున్నారు. అప్పటికి సీడ్‌ కేపిటల్‌ మాత్రమే పూర్తవ్వవచ్చు. మరి మిగిలిన భూముల మాటేమిటి? వాటి అభివృద్ధి సంగతి ఏమిటి? వాటిని ఎప్పటికి అభివృద్ధి చేసి మాకు ప్లాట్లు కేటాయిస్తారు?’’ అని రాజధానికి భూమి ఇచ్చిన ఒక రైతు ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఉండగానే అన్ని ప్రాంతాలను కొంతమేరకు అభివృద్ధి చేయడంతోపాటు ప్లాట్ల విభజన కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి తమకు పట్టాలు ఇవ్వాలని రాజధాని రైతులు కోరుతున్నారు. భూ సమీకరణ నుంచి పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం వరకూ ప్రతిపక్షాలు రకరకాల సందేహాలను వ్యక్తం చేసినా.. విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసినా రైతులంతా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విశ్వాసం ఉంచారు. ఆయనను నమ్మి భూములు ఇచ్చారు. చంద్రబాబు తమ ప్రాంతాన్ని అద్భుత మహా నగరంగా తీర్చిదిద్దగలరని కూడా నమ్ముతున్నారు. అయితే, దశలవారీగా రాజధానిని నిర్మిస్తే ప్లాట్ల విభజన, కేటాయింపు ఆలస్యం అవుతుందేమోనన్న ఆందోళన వారిని వేధిస్తోంది. వాస్తవానికి, భూ సమీకరణ పూర్తయిన తర్వాత.. రాజధాని నిర్మాణానికి ముందే ప్లాట్ల విభజన పూర్తవుతుందని, ఏ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఆ ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో వారిని సందేహాలు ముసురుకుంటున్నాయి.

No comments:

Post a Comment