- ఏపీపై భారం పడకుండానే రాజధాని నిర్మాణం
- ముందుగా కీలక రాజధాని నగరం నిర్మాణం
- ఆ తర్వాత రాజధాని ప్రాంతంపై దృష్టి
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అట్టహాసంగా.. అధునాతనంగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని నిర్మించబోతున్నారు. అందుకు తగ్గట్టే సింగపూర్ మాస్టర్ ప్లాన్‌ను అందజేసింది. మరి అంతటి అమరావతికి ఎంత ఖర్చవుతుంది? దానికి కావలసిన నిధులను ఎలా సమకూరుస్తారు? ఆదాయ వనరులేమిటి? అన్నదానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. అందరినీ ఆకట్టుకొనేలా సింగపూర్ ప్రభుత్వం రూపొందించి ఇచ్చిన కీలక రాజధాని నగరం ప్రణాళికలు అమరావతిపై అంచనాలు పెంచాయి. ఈ ప్రణాళికలు సాకారం అయ్యేలా నిర్మాణాలు ఉండాలంటే ఎలా లేదన్నా.. రూ.లక్ష కోట్ల వ్యయం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కీలక రాజధాని నగరం ఉండేలా సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అయితే అది కేవలం ప్రాంతం మొత్తానికి కలిపి ఇచ్చిన ప్రణాళిక. ప్రతి భవనానికి సంబంధించి విడి విడి ఆర్కిటెక్చర్ ప్లాన్ ఇంకా తయారు చేయాల్సి ఉంది. ఈ ప్లాన్ కూడా తయారైతే నిర్దిష్టంగా నిర్మాణ వ్యయం తేలుతుంది. ప్రస్తుతం ఈ ఆర్కిటెక్చర్ ప్లాన్ల తయారీ కసరత్తునూ మొదలు పెట్టారు. కానీ, సుమారుగా ఈ ప్రాంతానికి సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధి, భవనాల నిర్మాణం వంటివాటికి రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా. సుమారుగా పదేళ్ళలో ఈ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
సింగపూర్‌తో పాటు జపాన్ చేదోడు
రాజధాని నిర్మాణానికి ఖర్చయ్యే అంత మొత్తాన్ని సమకూర్చుకుని.. ఖర్చు చేసే స్థితిలో లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సింగపూర్, జపాన్ దేశాలు ఆదుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలతో సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. కీలక రాజధాని నిర్మాణం కోసం సంస్ధ ఎంపికకు ప్రభుత్వం పిలిచిన బిడ్‌కు.. సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తూ ఇప్పటికే అధికారికంగా బిడ్ దాఖలు చేసింది. పెట్టుబడినీ సమీకరించే శక్తి ఉన్నవారే బిడ్ దాఖలు చేయాలన్న ఏపీ షరతును సింగపూర్ ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటిదాకా ఆ దేశం తప్ప మరెవరూ దీనికి బిడ్ వేయలేదు. పదేళ్ళలో సుమారుగా రూ.70 వేల కోట్లు సేకరించి రాజధాని నిర్మాణానికి వెచ్చించేందుకు ఆంతరంగిక చర్చల్లో సింగపూర్ సుముఖత వ్యతక్తం చేసినట్లు సమాచారం. ఏటా రూ.ఏడు వేల కోట్ల చొప్పున నిధులు సేకరించి వ్యయం చేసే యోచనలో సింగపూర్ ఉన్నట్లు చెబుతున్నారు. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం, కేంద్రం కలిసి ఏడాదికి మరో రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఆలోచనలు కార్యరూపం దాలిస్తే రాజధాని ప్రాంతంలో ఏటా రూ.10 వేల కోట్లు నిర్మాణాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఖర్చవుతాయి. మరోవైపు రాజధాని పెట్టుబడిలో భాగస్వాములయ్యేందుకు జపాన్ కూడా ఆసక్తి వ్యక్తం చేసింది. నిర్మాణం చేపట్టే కన్సార్టియంలో సింగపూర్ ముఖ్య భాగస్వామిగా ఉంటే.. మరో భాగస్వామిగా ఉండేందుకు జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు జపాన్‌లో అక్కడి మంత్రులతో చర్చించారు. దీనిపై ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ఆసక్తిని చూపించింది. సింగపూర్‌తో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదనీ సీఎంకు జపాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అమరావతి అభివృద్ధి భాగస్వామి
రాజధాని నిర్మాణం చేపట్టే సంస్థను మాస్టర్ డెవలపర్ అని పిలవాలని గతంలో అనుకొన్నా.. ప్రస్తుతం ‘అమరావతి అభివృద్ధి భాగస్వామి’ అని కొత్త పేరు పెట్టారు. ఈ భాగస్వామి ఎంపికకు స్విస్ ఛాలెంజ్ విధానం అనుసరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలో ఎంపికయ్యేందుకు ముందుకు రావలిసిందిగా.. సోమవారం జరిగిన భేటీలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను చంద్రబాబు కోరారు. పరోక్షంగా దీనికి ఈశ్వరన్ తన సానుకూలతను వ్యక్తం చేశారు. కొద్ది రోజుల్లో సింగపూర్ ప్రభుత్వం తన కమర్షియల్ బిడ్‌ను దాఖ లు చేసే అవకాశం ఉంది. దసరా నాటికి ఈ కసరత్తు పూర్తి చేసి అప్పటి నుంచి నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2018 డిసెంబర్ నాటికి కీలక రాజధాని ప్రాంతంలో మొదటి దశ నిర్మాణాలు పూర్తి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మొదటి దశలో ప్రభుత్వ భవనాలు, గేట్‌వేలు, వాటర్ ఫ్రంట్ నిర్మాణాలు, అంతర్గత రహదారులు, పార్కులు, డౌన్‌టౌన్‌లోని వాణిజ్య భవనాల నిర్మాణం పూర్తవుతాయి. వచ్చే ఎన్నికల నాటికి కీలక రాజధానికి ఒక స్వరూపం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
No comments:
Post a Comment