|
గుంటూరు, ఆంధ్రజ్యోతి: జిల్లాలో వక్ఫ్ భూములు అన్యా క్రాంతం కాకుండా పరిరక్షించడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మైనార్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్ స్థానిక అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, మైనార్టీ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్బా ల్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని సర్వే నెంబర్ 234 నుంచి 245 వరకు, నెంబర్ 247లలో 180 ఎకరాలు, పెదకాకాని మండలంలోని వెనిగళ్ళలో 50.68 ఎకరాలు, నల్లపాడులో 9 ఎకరాలు, పేరేచర్లలో 8 ఎకరాలు మేర విలువైన వక్ఫ్ భూములున్నాయన్నారు. నగరానికి సమీపంలో ఆ భూములున్నందున వాటిని ఆక్రమణదారులు కబ్జా చేసే అవకాశం ఉంటుందన్నారు. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్‌తో పాటు స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్‌వోలు ఒక బృందంగా ఏర్పడి ప్రతీ శుక్రవారం భూములను తనిఖీ చేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పించాలన్నారు. మైనార్టీలలో పేద మహిళల వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం దుల్హన్ పథకం కింద రూ. 50 వేలు ఆర్థిక సాయం చేస్తోందన్నారు. జిల్లాలో మైనార్టీల సంక్షేమ పథకాల అమలు కోసం రూ. 70 లక్షల సబ్సిడీ అందుబాటులో ఉందని, దానిని వినియోగించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో గుంటూరు ఆర్‌డీవో భాస్కర్‌నాయుడు, రెవెన్యూ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
No comments:
Post a Comment