Monday, 20 July 2015

అమరావతికి అక్టోబర్ 22న శంకుస్థాపన

అమరావతికి అక్టోబర్ 22న శంకుస్థాపన
ఏడేళ్లలో జాతి గర్వపడేలా నిర్మాణం: బాబు

(రాజమండ్రి నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
నిఖిల జగత్తూ నిబిడాశ్చర్యంతో చూసేలా నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిని నిర్మించి తెలుగుజాతి ఖ్యాతిని, తెలుగువాడి సమర్థతను ప్రపంచానికి చాటిచెబుతామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం పవిత్ర గోదావరీ నదీ తీరాన.. పుష్కర మహోత్సవ సమయాన రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ’సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ప్లాన్‌’ను సింగపూర్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండసీ్ట్ర మినిస్టర్‌ ఈశ్వరన్‌ నుంచి స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తాము కోరినంతనే పైసా కూడా తీసుకోకుండా, తమ ప్రభుత్వ ఆకాంక్షల మేరకు సింగపూర్‌ ప్రభుత్వం ఈశ్వరన్‌ ప్రమేయంతో రాజధాని కోసం ఎంతో శ్రమించి, బ్రహ్మాండమనిపించేలా 3 మాస్టర్‌ప్లాన్లను రూపొందించి, ఇచ్చిందని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. గోదావరి పుష్కరాలు జరుగుతున్న పవిత్ర సందర్భంలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ’సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌’ను అందివ్వడం ఆనందంగా ఉందన్నారు. సరిగ్గా చెప్పిన సమయానికి రాజధాని ప్రాంతం, క్యాపిటల్‌ సిటీ, తాజాగా సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్లను అందజేయడం సింగపూర్‌ ప్రభుత్వం, నిపుణుల నిబద్ధతను చాటుతుందన్నారు. ఎన్నికలకు ముందు సింగపూర్‌ స్థాయిలో రాజధానిని నిర్మిస్తానన్న తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో అడుగడుగునా సింగపూర్‌ ప్రభుత్వం ఎంతో తోడ్పాటునందిస్తోందని, ఈ బంధం దీర్ఘకాలం కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మాస్టర్‌ప్లాన్ల రూపకల్పనతోనే రాజధాని నిర్మితం కాదని, అకుంఠిత శ్రమ, పట్టుదల, కార్యదక్షత వల్లే అది సాకారమవుతుందని, ఇందుకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఒక ఇటుకనో దానికి సమానమైన సాయాన్నో రాజధాని కోసం చేయాలని కోరారు.
తొలి దశలో సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణం
ప్రపంచస్థాయిలో అందరూ గొప్పగా చెప్పుకునేలా.. భారతదేశం యావత్తూ గర్వపడేలా.. అమరావతిని దశలవారీగా నిర్మించనున్నామని, తొలి దశలో 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘సీడ్‌ క్యాపిటల్‌’ను నిర్మిస్తామన్నారు. 2018 నాటికి ఇక్కడ 3 లక్షల మంది జనాభా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. 7 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఆ తర్వాత 217 చదరపు కిలోమీటర్లలో క్యాపిటల్‌ సిటీని, చివరగా మొత్తం 7,420 చదరపు కిలోమీటర్లలో రాజధాని ప్రాంతాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఇక్కడ 40 లక్షల జనాభా నివాసం ఉండేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. 18 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామన్నారను. భూకంపాలు, తుఫాన్లు వంటి ప్రకృతి ఉత్పాతాలను దీటుగా ఎదుర్కొని, కొన్ని తరాలపాటు నిలవగలిగేలా అమరావతిని నిర్మిస్తామని బాబు పేర్కొన్నారు.
ముగ్గురు ప్రధానమంత్రుల సమక్షంలో శంకుస్థాపన
ఈ ఏడాది అక్టోబరు 22న విజయదశమి పర్వదినాన మన దేశ ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో అమరావతికి శంకుస్థాపన చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్‌, జపాన్‌ ప్రధానులనూ ఆహ్వానించామన్నారు. ఈలోగా మాస్టర్‌ప్లాన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచి, అమరావతిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించి, అమలు చేస్తామని ప్రకటించారు.
ఏవేవి ఎక్కడో ఇంకా తేలలేదు
‘సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాన్‌’ రాజధాని ప్రాంతంలోని ఏఏ గ్రామాల్లో అమలవుతుంది, వివిధ క్లస్టర్లు లేదా జోన్లు ఎక్కడెక్కడ ఏవేవి వస్తాయి, నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుంది.. తదితర విషయాలను ఇంకా ఖరారు చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ముందుగానే ప్రకటించిన విధంగా సాధ్యమైనంతవరకు ఆయా ప్రాంతాల్లోనే ప్లాట్లను కేటాయిస్తామని, అమరావతిలో భూములను వివిధ సంస్థలకు కేటాయించే విషయంలో గతంలో తాము హైదరాబాద్‌లో చేసినట్లుగా పారదర్శక విధానాన్ని అనుసరిస్తామన్నారు. రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటామన్నారు. అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం 40 వేల ఎకరాల అటవీభూములను డీనోటిఫై చేసేందుకు అంగీకరించిందన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా సాధ్యమైనంతవరకు గ్రామాలను కదల్చబోమని, అయితే మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేపట్టేందుకు మరీ అవసరమైతే కొన్నింటిని రీలోకేట్‌ చేస్తామన్నారు. అలాంటి సందర్భాల్లో నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీని అందించి, పునరావాసం కల్పిస్తామన్నారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల మేళవింపుగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. దీనికిగాను సింగపూర్‌ సూచించిన అలైన్‌మెంట్లు, ఇతరత్రా అంశాల్లో పలు మార్పులు చేయాల్సిందిగా కోరామన్నారు. ప్రతి సంక్షోభం ఒక చక్కటి అవకాశమని వ్యాఖ్యానించిన చంద్రబాబు రాజధాని లేకుండా ఏర్పాటు చేసిన రాష్ట్రానికి ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణాన్ని ప్రజలందరి సహకారంతో నిర్మింపజేస్తామన్నారు.

No comments:

Post a Comment