Wednesday, 22 July 2015

కృష్ణ పొడవునా ఆకాశహర్మ్యాలు.. 2050కి కోటిమందికి ఆవాసం.

కృష్ణ పొడవునా ఆకాశహర్మ్యాలు.. 2050కి కోటిమందికి ఆవాసం.. 90 రోజుల్లో ఏపీ సీడ్ కేపిటల్ ఏర్పాట్లు

  • ప్రధాన ఆకర్షణగా కృష్ణా తీర రహదారి
  • రాజ్‌పథ్‌కు దీటుగా కేంద్ర రహదారి
హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కృష్ణానదీ తీరం పొడవునా ఆకాశహార్మ్యాలు దర్శనమివ్వనున్నాయి. 2050 నాటికి అమరావతిలో కోటి మంది నివాసం ఉండే అవకాశం ఉందని ఏపీ సర్కార్‌ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా నదీ తీరం పొడవునా బహుళ అంతస్థుల నివాస సముదాయాల నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లో చోటు కల్పించారు. ఈ భారీ అపార్టుమెంట్లను నిర్మించే బాధ్యతను తీసుకునేందుకు సింగపూర్‌ డెవలపర్లు ముందుకొస్తున్నారు. సుమారు 17 చదరపు కిలోమీటర్ల మేర ఆకాశహార్మ్యాల నిర్మాణానికి బిడ్‌ వేసేందుకు సింగపూర్‌ టౌన్‌షిప్‌ డెవలపర్లు సిద్ధమవుతున్నారు. ఇది ఒకే అయితే, దక్షిణ భారత దేశంలో వీరు నిర్మించే మూడో టౌన్‌షిప్‌ ఇదే అవుతుంది. ఏపీ రాజధాని నగరం సుమారు 7వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించనుంది. రాజధాని నగరం నడిబొడ్డున అసెంబ్లీ, సచివాలయం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, ఇతర ప్రభుత్వ పాలనా విభాగాల కోసం భవంతులు నిర్మిస్తారు. ఈ భవంతుల నడుమ నివాస, వాణిజ్య భవనాలూ ఉంటాయి. వీటిలో నివాస సముదాయాలను నిర్మించేందుకు సింగపూర్‌ డెవలపర్లు ముందుకు వచ్చారు. అమరావతిలో ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్‌ ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌లో సగర్వంగాప్రకటించింది. మరోవైపు తాము ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ను సమగ్రంగా అమలు చేసే డెవలపర్‌ను ఎంపిక చేసుకునే బాధ్యత ఏపీ సర్కార్‌దని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. సింగపూర్‌ టౌన్‌షిప్‌ డెవలపర్లు చైనా, వియత్నాంలో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణంలో ప్రఖ్యాతిగాంచారని, వారి సేవలనూ ఏపీ సర్కార్‌ వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు. అసెండస్‌ సింగ్‌ బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ వంటి సంస్థల సేవలు వినియోగించుకోవచ్చన్నారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో భవనాల నిర్మాణంలో తాము ముందంజలో ఉన్నామని సెంబ్‌కార్ప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ టో వివరించారు. భారతదేశంలోని 7 రాష్ట్రాల్లో 11వేల హెక్టార్లలో 3,300 మెగావాట్ల థర్మల్‌, సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ప్లాంట్లను నిర్మించామన్నారు. ఇందులో ఏపీ కూడా ఉందన్నారు.
 
రమ్యమైన రహదారులు..
అమరావతిలో ప్రధాన రహదారులను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సర్కార్‌ భావిస్తోంది. సింగపూర్‌ బృందం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది. ‘కృష్ణ’ పేరు మీద పిలిచే కృష్ణాతీర రహదారి రాజధాని నగరంలో 3.8 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. దీనికి మధ్యలో ఒక వంతెన వస్తుంది. మొత్తం సీడ్‌ క్యాపిటల్‌లో ఇది కీలకం కానుంది. దీనికి ఒక పక్కన నది, మరో పక్కన వివిధ పర్యాటక ఆకర్షణలు, రెస్టారెంట్లు రానున్నాయి. దీనికి బస్‌రాపిడ్‌ విధానం, రైలు మార్గాలు అనుసంధానమై ఉంటాయి. 1.6కిలోమీటర్ల పొడవైన కేంద్ర రహదారి మరో ఆకర్షణ కానుంది. ఢిల్లీలో ఇండియా గేట్‌నుంచి రాష్ట్రపతి భవన్‌వరకూ ఉన్న విశాలమైన రహదారి తరహాలో ఉంటుంది. నగరం మధ్యలో రద్దీ తగ్గింపుతోపాటు పెద్ద ఆకర్షణగా దీన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వాణిజ్య ప్రాంతాన్ని అంతర్జాతీయ పరిభాషలో డౌన్‌టౌన్‌ అంటారు. ఇందులోని రహదారులను వీలైనంత వరకూ పాదచారులకు పరిమితంచేసే ప్రతిపాదన ఉంది. వీటికి అనుబంధంగా ఉన్న రహదారుల్లోకి వాహనాలను అనుమతిస్తారు. ఆకాశహర్మ్యాలు, అత్యాధునిక వాణిజ్య సముదాయాలు డౌన్‌టౌన్‌లో వస్తాయి.
దేశంలోనే తొలిసారిగా వాటర్‌ టాక్సీలు
దేశంలో మరెక్కడా లేనివిధంగా అమరావతిలో వాటర్‌ టాక్సీల విస్తృత వినియోగానికి ప్రణాళికలో ప్రాధాన్యమిచ్చారు. ఈ రాజధాని ప్రాంతం కృష్ణా నదికి అభిముఖంగా వస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఒక పాయను ప్రత్యేకంగా నగరంలోకి తీసుకువచ్చి అది మళ్లీ నదిలో కలిసే ఏర్పాటు చేస్తున్నారు. నదిలోను, అలాగే ఈ పాయలోను వాటర్‌ టాక్సీలను నడుపుతారు. రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లకు బాగా దగ్గర్లో ఈ ట్యాక్సీ స్టేషన్లు కూడా ఉంటాయి. రాజధానిలో హైస్పీడ్‌ రైలు, బస్‌ రాపిడ్‌ సిస్టం, వాటర్‌ టాక్సీలను ఏర్పాటు చేస్తు న్నారు.
ప్రత్యేక నిర్మాణశైలిలో భవనాలు
రాజధానిలో భవనాలు చూడముచ్చటగా కనిపించే నిమిత్తం ఆర్కిటెక్చర్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ భవనాలను ఆధునిక, సంప్రదాయ శైలి సమ్మేళనంతో నిర్మించనున్నారు. భవనాల్లో కొన్నింటిని లాండ్‌ మార్క్‌ నిర్మాణాలుగా ఎంపిక చేసి వాటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నారు. అమరావతి గేట్‌ వే, కొన్ని ప్రముఖ ప్రభుత్వ భవనాలు ఇలా లాండ్‌ మార్క్‌ భవనాలుగా ఉండనున్నాయి. ఆకాశహర్మ్యాలు, పరిమిత అంతస్తుల భవనాలు కలిసి ఉండేలా చూస్తున్నారు. సీడ్‌ క్యాపిటల్‌ నగరం సరిహద్దులను చంద్రబాబు వద్ద జరిగిన భేటీలో ప్రాథమికంగా ఖరారుచేశారు. ఉండవల్లి గుహలనుంచి అమరావతి గ్రామం మధ్యవరకు సీడ్‌ క్యాపిటల్‌ ఉంటుంది. విజయవాడ-గుంటూరు రహదారిలో ప్రకాశం బ్యారేజి దాటాక కొంత దూరంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. దాని పక్క నుంచి తుళ్లూరు మీదుగా అమరావతికి ప్రస్తుతం ఒక రోడ్డు ఉంది.

No comments:

Post a Comment