- మర్యాద ఉండదు.. ఒకటి అంటే పది అంటం
- నన్ను అనండి.. తెలంగాణను అంటే ఊరుకోను
- మా పాలన మమ్మల్ని చేసుకోనివ్వరా?
- దాశరథి జయంతి సభలో కేసీఆర్ ఆగ్రహం
- శ్రీనివాసాచార్యకు దాశరథి అవార్డు ప్రదానం
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్ర జ్యోతి): ‘‘మాకు నిద్ర లేచే అలవాటును మీరు నేర్పారా? తెలంగాణ సమాజం అంటే అంత చిన్న చూపా? మమ్మ ల్ని స్వతంత్రంగా పరిపాలించుకోనివ్వరా. ఎందుకు అంత అక్కసు, బాధ. పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు’’ అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ రాజధానిని బాగా నిర్మించుకోండి. మాకు సంతోషం. కానీ హైదరాబాద్‌తో పోటీ ఎందుకు? లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌తో అమరావతికి పోటీయా? పద్ధతి మార్చుకో’’ అని హెచ్చరించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ఎలుగెత్తిచాటిన దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం తొలిసారి అధికారికంగా బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ అస్తిత్వం గురించి పద్యాల ద్వారా ప్రపంచానికి చాటిన మహాకవి దాశరథి అని కొనియాడారు. మాతృభూమిని తల్లిగా భావించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని దాశరథి ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి వారి చరిత్ర మరుగున పడిందని అభిప్రాయపడ్డారు. అలాగే.. ‘‘హైదరాబాద్ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా లేచేవారు. కానీ, ఎన్టీఆర్ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు’’ అంటూ మూడురోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. ‘‘నన్ను అంటే భరిస్తానుగానీ.. తెలంగాణ సమాజాన్ని ఏమైనా అంటే సహించేది లేదు. మాకు ఉండేదేదో ఉంది. లేనిదేదో లేదు. మా పాలన మేం చేసుకుంటున్నాం. మీకు అంత అక్కసు, బాధ ఎందుకు? పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. నిద్ర లేవడాన్ని మీరు నేర్పారా? దీన్ని కవులు, కళాకారులు ఖండించాలి. ఇదేమి సంస్కారం. కేసీఆర్‌ను అంటే పడతాను. కానీ, తెలంగాణ సమాజాన్ని అంటే ఊరుకునేది లేదు. ఇది హెచ్చరిక. రీతి లేని పత్రికలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వెకిలి రాతల్ని వండి వారుస్తున్నాయి. ఆంధ్రా రాజధానిని బాగా కట్టుకోండి. అయితే.. హైదరాబాద్‌తో అమరావతికి పోలికేంటీ? హైదరాబాద్ గొప్ప చరిత్ర ఉన్న నగరం. దీని విస్తీర్ణం 18.30 లక్షల చదరపు ఎకరాలు. ఫారెస్ట్‌కు వదిలినదే 1.50 లక్షల ఎకరాలు ఉంది. అమరావతికి, హైదరాబాద్‌కు ఏ రకంగా పోలిక? ఆంధ్రప్రదేశ్‌లోని మేధావులు కూడా ఆలోచించాలి. సినారే వంటి మేధావులు ఇక్కడ ఉన్నారు. ఆయనకు పోటీ ఉందా? ఎవరి ప్రతిభ వారికి ఉంటుంది. ఇప్పటికైనా బాబు భ్రమను వీడాలి. ఆంధ్రప్రదేశ్ పాలనపై దృష్టి పెట్టాలి. మీరు ఒకటి అంటే...మేం పది అంటాం. ఇప్పటికైనా అలాంటివి మానుకోవాలి. లేదంటే మర్యాద ఉండదు.’’ అని తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ చారిత్రక నగరమని.. హైదరాబాద్ రాజధాని కావడం తెలంగాణ అదృష్టమని అన్నారు. తెలంగాణలోని కవుల ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలను చేపడుతుందని, దీనిపై త్వరలోనే కార్యాచరణను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా దాశరథి సాహితీ పురస్కారాన్ని తిరుమల శ్రీనివాసాచార్యకు ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. రూ. ఒక లక్షా వెయ్యి నూట పదహార్లు, మొమెంటో, శాలువాతో శ్రీనివాసాచార్యను ఘనంగా సత్కరించారు. అలాగే ఆయన రచించిన బంగారు తెలంగాణ పాటల పుస్తకం, సీడిలను కూడా ఆవిష్కరించారు. దాశరథి విశ్వకవి అని ఈ సందర్భంగా శ్రీనివాసాచార్య కీర్తించారు. ‘‘సినారె కవిత్వం జగన్మోహనం.. దాశరథి కవిత్వం విద్వత్వం’’ అని కొనియాడారు. ఇక.. ఏ గడ్డమీదైతే తెలంగాణ డైనమిజం అణచివేతకు గురైందో అదే గడ్డ మీద తెలంగాణ కవులను గౌరవించుకుంటున్నామని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ డైనమిజాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి పలు కవితలు చదివారు. సీఎం కేసీఆర్ గురించి రాసిన కవితలు చదివి ఆయనకు అంకితమిచ్చారు. కేసీఆర్ చింత అంతా తెలంగాణనే అన్నారు. తెలుగు వర్సిటీ వీసీ ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక విద్వత్తు-విద్యుత్తు.. అనే రెండు అంశాలపై దృష్టి పెట్టారన్నారు. తెలంగాణ తల్లిని మొట్టమొదట కీర్తించిన కవి దాశరథి అని.. దాశరథి బలమంతా తెలంగాణ అని. సీఎంవోలో ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా.. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, దాశరథి కుమారుడు లక్ష్మణ్, సాంస్కృతిక సారథి చైరన్ సమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment