|
గోదావరి తీరం శోభాయమానంగా వెలిగిపోతున్నది. పుష్కర సంరంభానికి సర్వమూ సిద్ధమైంది. పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసి తరించడానికి లక్షలాదిమంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత వచ్చిన తొలి పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఘనమైన ఏర్పాట్లు చేశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వపరంగానూ, ప్రసారమాధ్యమాల ద్వారా ఈ పుష్కరాలకు విస్తృతమైన ప్రచారం కూడా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో పుష్కర స్నానాలు ఆచరించబోతున్నారు.
నవగ్రహాల్లో ఒకటైన బృహస్పతి ఆయా రాశులలోకి అడుగుపెట్టినప్పుడు దేశంలో ప్రసిద్ధి చెందిన పన్నెండు నదులలో పుష్కరాలు జరుగుతాయి. ఈ పన్నెండు నదులనూ పుష్కర నదులనీ, పన్నెండు రోజూలనూ పుష్కరాలనీ అంటారు. చాంద్రమానం ప్రకారం 27 నక్షత్రాలు, తొమ్మిది పాదాలు కలిపితే ఒక రాశి. ఈ రోజు గురుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో నేటినుంచి గోదావరి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. రాబోయే ఏడాది కన్యారాశి ప్రవేశంతో కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయి. ఒక్కోనదికి ఒక్కోరాశి అధిష్ఠానమై ఉంటుందనీ, పుష్కర సమయంలో ఆ నదిలో సకలదేవతలూ కొలువై ఉంటారనీ, ఆ కాలంలో ఆ నదిని చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల సకల తీర్థాల దేవతలనూ పూజించినట్టవుతుందని విశ్వాసం. అలాగే, ఈ పన్నెండు రోజుల గోదావరి పుష్కరాలను ఆది పుష్కరాలనీ, వచ్చే ఏడాది జూలై 31నుండి ఆగస్టు 11 వరకూ ఆ పన్నెండురోజులనూ అంత్యపుష్కరాలనీ పిలుస్తారు. అవి కూడా పుణ్యప్రదాలే కనుక, ఇప్పుడు అనివార్య కారణాల వల్ల పుష్కరస్నానాలు ఆచరించలేనివారు అప్పుడు చేయవచ్చునని అంటారు. అంత్యపుష్కరాలు గోదావరికి మాత్రమే ప్రత్యేకం.
‘ఉత్తమంతు, నదీస్నానం’ అని పెద్దలంటారు. బావి, చెరువు, బకెట్ స్నానాలతో పోల్చినపుడు ప్రవహించే నదికి స్నానవిధిలో సహజంగానే ప్రథమస్థానం ఉంటుంది. సాధారణ రోజుల్లోనే నదికి ఈ అగ్రతాంబూలం దక్కినప్పుడు, పవిత్రతలో గంగ కంటే గోదావరినే ముందుగానే పేర్కొనాలని విజ్ఞులు వాదిస్తున్నప్పుడు ఈ పుష్కరస్నానానికి తప్పక ఎంతో ప్రాశస్త్యం ఉంది. గోదావరి తీరంలో నివసించి, ఆ జలాన్ని సేవించినందువల్లే నన్నయ్య మూడున్నర పర్వాల ఆంధ్రమహాభారతాన్ని సునాయాసంగా రచించాడట. ఈ తీరంలో భద్రాద్రి రాముడిని కొలిచిన కంచర్ల గోపన్న వైకుంఠానికీ భద్రాద్రికీ భేదం లేదనీ, అక్కడి విరజానదే ఈ గోదావరి అనీ అన్నాడు. సీతారాముల స్నానంతో ఇది ఎన్నడో పునీతమైనదట. సువిశాలమైన పరీవాహక ప్రాంతం ఉన్న గోదావరి తీరమంతా ప్రసిద్ధపుణ్యక్షేత్రాలకు నిలయం. మహారాష్ట్రలోని త్య్రంబకేశ్వరంలో ఆవిర్భవించినదాది గోదావరి క్రమంగా విస్తృత రూపాన్ని సంతరించుకొంటూ సాగింది. మరాఠా నేలనుంచి వడివడిగా పరుగులు తీస్తూ తెలుగునేలమీద అడుగిడిన ప్రాంతం నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి. గోదావరి, హరిద్ర, మంజీరా నదుల ఈ సంగమ ప్రాంతం ప్రాచీన సంగమేశ్వరాలయానికి నెలవు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో సరస్వతి అక్షరాలు దిద్దించి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. కరీనంగర్ జిల్లాలో కాళేశ్వరుడు దర్శనమిస్తాడు. కోడెదూడలను కానుకగా అందుకొనే వేములవాడ రాజరాజేశ్వరుడు, ధర్మపురిలో నృసింహస్వామి ఈ నదీతీరానే కొలువైనారు. అఖండ గోదావరి మధ్యలో కొండమీద వెలిసిన వీరభద్రుడితో పట్టిసీమ ప్రాచీన శివక్షేత్రమే కాదు, సుందరమైనది కూడా. కొవ్వూరులోని గోష్పాదక్షేత్రం, రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర రేవులే కాదు, పుణ్యక్షేత్రాలు కూడా. దక్షిణకాశి ద్రాక్షారామం పంచారామాలలో ఒకటి. పాలకొల్లు, అమరావతి పంచారామక్షేత్రాలకు నిలయాలు. ధవళేశ్వరం తరువాత సప్త గోదావరుల మధ్యలో ఎన్నో క్షేత్రాలున్నాయి. సాగర సంగమంలో ఉన్న అంతర్వేది ప్రాచీన నృసింహస్వామి క్షేత్రం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి తీరం ఇలా అనేక సుప్రసిద్ధ ఆలయాలకు నిలయాలు కావడం వల్ల పుష్కరాలకు అమితమైన ప్రాధాన్యం ఉంది.
పుష్కరానుభూతి కలకాలం భక్తుల మదిలో నిలిచిపోయేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ ఘనంగా ఏర్పాట్లు చేశాయి. నీటి లభ్యతకు లోటులేకుండా చూడటానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులనుంచి నీటిని విడుదల చేస్తూ, మరోపక్క మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నిత్యహారతులతోనూ, అఖండ పుష్కరజ్యోతితోనూ గోదావరి కళకళలాడుతున్నది. తెలుగునేలమీద అడుగుపెట్టిన దగ్గరనుంచి సగరుని దరిచేరే వరకూ గోదావరి తీరం వెంబడి విస్తరించిన గ్రామాలు, ఆలయాలు, క్షేత్రాలు కొత్తకాంతులీనుతున్నాయి. పుష్కర ప్రారంభవేళలో నదీస్నానాలు చేసి జన్మతరింప చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న భక్తులకు స్నానవాటికలు ఘన స్వాగతం పలుకుతున్నాయి.
|
No comments:
Post a Comment