|
రాజమండ్రి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అధికారుల మధ్య సమన్వయం లేదు! పోలీసులకు ప్రణాళిక లేదు! భక్తులకు సంబంధించిన అంచనాలూ తప్పాయి! సకాలంలో స్పందించాల్సిన వాళ్లు స్పందించలేదు! మొత్తానికి భక్తుల పుణ్య స్నానాలకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు! ఇవన్నీ కలిసి పెను విషాదానికి కారణమయ్యాయి!
పుష్కర ఘాట్ పక్కనే గోదావరి రైల్వే స్టేషన్ ఉంది. స్టేషన్లో దిగిన వెంటనే ఘాట్‌కు రావడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంది. ఇది సరిగ్గా ఘాట్‌కు ఎదురుగా వస్తుంది. ఇక, ఇక్కడ ఎప్పుడూ ఆగని 19 రైళ్లు గోదావరి స్టేషన్లో ఆగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ వచ్చిన రైళ్లలోని భక్తులంతా ఇక్కడ దిగారు. మరీ ముఖ్యంగా, ప్రతీ పుష్కరాలకు తొలి రోజే స్నానాలు చేయడం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖవాసులకు ఆనవాయితీ. దాంతో అటునుంచి వచ్చే రైళ్లలోని భక్తులంతా గోదావరి స్టేషన్లోనే దిగారు. విజయవాడవైపు నుంచి వచ్చే భక్తులు సరేసరి. నేరుగా పుష్కర ఘాట్‌కు వచ్చారు. అయినా, గోదావరి స్టేషన్ నుంచి ఎంతమంది వస్తారనే ముందస్తు అంచనాలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు.
జూ పుష్కర ఘాట్‌లో మూడు రేవులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మధ్య ఘాట్‌లో పుష్కర స్నానాలకు వచ్చారు. ఆ సమయంలో దాని పక్కనే ఉన్న రెండు ఘాట్లలోనూ కొంతమంది భక్తులు స్నానాలు చేస్తున్నారు. అయితే, అప్పటికే అక్కడ భక్తులతో కిక్కిరిసిపోగా, గోకవరం బస్టాండు, కోటగుమ్మం సెంటర్, వేణుగోపాలస్వామి గుడి వైపు నుంచి ఒక్కసారిగా వేలాదిమంది భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఈ ఘాట్లలో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ రద్దీని పోలీసులు చూస్తూనే ఉన్నారు. అప్పుడే భక్తులను పుష్కర ఘాట్‌లోని మిగిలిన రెండు రేవులతోపాటు కోటిలింగాల ఘాట్‌కు, మిగిలిన ఘాట్‌లకు మళ్లించి ఉంటే.. తరలి వస్తున్న భక్తులను నియంత్రించి ఉంటే ఈ ప్రమాదం అసలు జరిగి ఉండేదే కాదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులకు సరైన దిశానిర్దేశం లేకపోవడం, ఘాట్‌లపై పూర్తి అవగాహన లేకపోవడంతో సమన్వయ లోపం కనిపించింది.
పుష్కర ఘాట్‌లలో భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు మైకులను ఏర్పాటు చేశారు. అయితే, ఆ సమయంలో వాటిలో పుష్కర పాటలు వేశారు. తప్పితే, కిక్కిరిసిన భక్తులకు ఎటువంటి దిశానిర్దేశం చేయలేదు. మైకుల్లో చెబుతూ భక్తులకు ఇతర ఘాట్లకు మళ్లించి ఉంటే కూడా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ సమయంలో గౌతమి, సరస్వతి ఘాట్‌లలతో తక్కువ రద్దీయే ఉంది కూడా.
గోదావరిలో ఎక్కడ స్నానం చేసిన ఒకటేనన్న భావన కలిగించడంలో ప్రభుత్వం విఫలమైంది. స్టేషన్ వద్ద ఘాట్‌కు పుష్కర ఘాట్ అని పేరు ఉండడం.. అక్కడే హారతి నిర్వహించడంతో అందరి దృష్టీ అటే ఉంది. పుష్కరాలకు వచ్చే భక్తుల్లో 65ు రాజమండ్రి రేవుల్లోనే స్నానాలు చేయడం ఆనవాయితీ. ఈసారి ప్రచారం ఎక్కువగా ఉండడంతో రాజమండ్రికి జనం పోటెత్తా రు. ఉభయ గోదావరి జిల్లాల్లో 252 ఘాట్‌లు ఉన్నా.. రాజమండ్రిలోనే స్నానం చేయాలన్న సెంటిమెంటు పెరగడం రద్దీకి మరో కారణం.
|
No comments:
Post a Comment