Tuesday, 21 July 2015

మహానగరి.. అమరావతీ పురి

మహానగరి.. అమరావతీ పురి
సీడ్ కేపిటల్ ప్లాన్‌ బాబుకు అందజేసిన సింగపూర్ మంత్రి

  •  బెజవాడ వైపు నుంచే భారీ ఎంట్రెన్స్‌.. గేట్‌ వే 
  •  30 కిలోమీటర్ల పొడవునా వినోద స్థలి.. వాటర్‌ఫ్రంట్‌ 
  •  ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక కూడలి.. డౌన్‌టౌన్‌
  •  ఒకేచోట అసెంబ్లీ, సచివాలయం.. గవర్నమెంట్‌ కోర్‌
  • 5 దశల్లో ‘కీలక రాజధాని’ నిర్మాణం.. 2018లోపు తొలి దశ 
  • 40 శాతం పార్కులు, ఖాళీ స్థలాలు.. మాస్టర్‌ప్లాన్‌ ఆవిష్కరణ
  • రాజధాని ప్రాంత అథారిటీ 
  • 7420 చదరపు కిలోమీటర్లు
  • నగర విస్తీర్ణం 125 చ.కి . మీ. 
  • సీడ్‌ క్యాపిటల్‌ 16.9 చ.కి . మీ. 
  • పదేళ్లలో లక్ష కోట్ల వ్యయం
  • 75 ు పెట్టుబడి సింగపూర్‌దే
  • దసరా నుంచి పనులు మొదలు
  • మూడేళ్లలో తొలి దశ పూర్తి

నవ్యాంధ్రులకు భవ్యమైన రాజధాని నిర్మాణం దిశగా కీలకమైన అడుగు ముందుకు పడింది. గోదావరి పుష్కరాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న రాజమండ్రి వేదికగా... కృష్ణా తీరాన వెలయనున్న ఆధునిక నగరి ‘అమరావతి’ చిత్రం ఆవిష్కృతమైంది. ‘అమరావతి’కి శుభాశీస్సులు పలుకుతూ... అమరపురిన ఉన్న దేవతలు చిరుజల్లులనే అక్షతలుగా కురిపించారు. సూర్యుడు మురిసి ఇంధ్ర ధనుస్సును సృష్టించాడు. 

చూడచక్కటి దారులు... ఆకాశ హర్మ్యాలు... ఆకు పచ్చని ఉద్యానవనాలు... ఆ పక్కనే కృష్ణమ్మ చల్లని చూపులు... అద్భుత నిర్మాణ కౌశలంతో అసెంబ్లీ, సచివాలయం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు! ఇది... నవ్యాంధ్ర రాజధాని ప్రధాన ప్రాంత (సీడ్‌ క్యాపిటల్‌) బృహత్‌ ప్రణాళిక చిత్రం! నవ్యాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ ప్రభుత్వం తరఫున ఆ దేశ మంత్రి ఈశ్వరన్‌, సోమవారం రాజమండ్రిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించారు. ఈ ప్రణాళికకు ‘అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజా రాజధాని-2050’ అని నామకరణం చేశారు. పశ్చిమ తీరాన ముంబై నగరంలో ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ భారత్‌కు ముఖద్వారంకాగా... నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ‘భారతదేశ తూర్పు ముఖద్వారం’గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉజ్వలమైన, విభిన్నమైన, సమ్మిళితమైన, అధునాతనమైన నగరంగా రాజధాని ఉండాలన్న చంద్రబాబు ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఈ మాస్టర్‌ ప్లాన్‌ తయారైంది. మరో వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా చరిత్రలో నిలిచిపోయే సుస్థిర రాజధానిని నిర్మించాలన్న ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా... సింగపూర్‌ ప్రభుత్వం నిర్మాణ రంగంలో ఉన్న అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. రాజధాని అమరావతిలోని కీలక ప్రాంతం 16.9 చదరపు కిలోమీటర్లలో నిర్మితమవుతుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ... కాలుష్యాన్ని నియంత్రిస్తూ ‘హరిత వర్ణం’ సంతరించుకుంటుంది. కృష్ణా తీరం వెంబడి పార్కులు, ఉద్యానవనాలు విస్తరిస్తారు. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించేలా ప్రత్యేక ప్రతిపాదనలు చేశారు. పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘స్మార్ట్‌’ సొబగులు అద్దుతారు. సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చిన మూడు దశల మాస్టర్‌ ప్లాన్‌లో ‘సీడ్‌ కేపిటల్‌’ బృహత్‌ ప్రణాళిక చివరిది. సుస్థిరమైన అభివృద్ధి సూత్రాల ఆధారంగానే దీనికి రూపకల్పన చేశారు. ఉపాధి కల్పన, పెట్టుబడుల భాగస్వామిని ఎంపిక చేశాక, పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో సీడ్‌ కేపిటల్‌ ఏరియా మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తారు.

http://epaper.andhrajyothy.com/detailednews?box=aHR0cDovL2VjZG4uYW5kaHJhanlvdGh5LmNvbS9GaWxlcy8yMDE1MDcyMTA3MjEwMTM4MzE2MjIuanBn&day=20150721

No comments:

Post a Comment