Monday, 20 July 2015

ప్రపంచస్థాయి నగరంగా అమరావతి : బాబు

సీడ్ క్యాపిటల్ ప్లాన్ అందజేసిన ఈశ్వరన్
ఏపీ ప్రజలు గర్వపడేలా అమరావతి నిర్మాణం
ప్రపంచస్థాయి నగరంగా అమరావతి : బాబు

రాజమండ్రి, జులై 20: ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబుకు అందజేసింది. ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఈశ్వరన్ చంద్రబాబు ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ ప్రణాళిక అద్భుతంగా ఉందని, బృహత్ ప్రణాళికలు రూపొందించిన 30 మంది సభ్యుల సింగపూర్ బృందానికి అభినందనలు తెలిపారు. పుష్కరాల సమయంలో మాస్టర్ ప్లాన్ ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అది నెరవేరుస్తామని సీఎం ఉద్ఘాటించారు. 3 లక్షల నివాస గృహాలకు అనుగుణంగా సీడ్ క్యాపిటల్ ప్రణాళిక ఉందన్నారు. బృహత్ ప్రణాళికతో 7 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని వివరించారు.
 
రాజధాని మాస్టర్ ప్లాన్‌పై సింగపూర్‌తో సంప్రదింపులకు సంబంధించి సీఎం చంద్రబాబు వివరిస్తూ.. నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలనే ఉద్దేశ్యంతో 2014 నవంబర్ 12న సింగపూర్ ప్రతినిధులను కలిశామని, డిసెంబర్ 8న సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎంవోయూ కుదిరిందన్నారు. ఆ తరువాత 2015 మార్చి 30న సింగపూర్ బృందం క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు.. జూన్ 20 నాటికి మూడు మాస్టర్ ప్లాన్స్ డిటైల్స్ ఇచ్చారు అని వివరించారు. మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్‌కు తాము ఒక్కపైసా కూడా చెల్లించలేదన్నారు. వారే స్వయంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారని, ఏపీప్రభుత్వం తరఫున సింగపూర్ ప్రభుత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
 
భారత్‌లో ఇప్పటి వరకు ప్రపంచస్థాయి నగరాల నిర్మాణం కాలేదని, ఇంతగొప్ప నగరం ఏపీదే కావడం విశేషమని సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 7,420 కి.మీ పరిధిలో ఏపీ క్యాపిటల్ రీజియన్ ఉంటుందని, 40 లక్షల జనాభాకు అనుగుణంగా రాజధాని అమరావతి ఉంటుందని సీఎం వివరించారు. 217 చ.కి.మీ పరిధిలో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా సింగపూర్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించామని సీఎం చెప్పారు. ప్రధాని మోదీ తరఫున సింగపూర్, జపాన్ ప్రధానులనూ ఆహ్వానించామన్నారు.
మూడు దశల్లో అమరావతి అభివృద్ధి జరుగుతుందని వివరిస్తూ.. సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్ భాగాలుగా రాజధానిని అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతి అభివృద్ధిలో స్విస్ చాలెంజ్ పద్ధతిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుందన్నారు. 2018లోపు అమరావతి తొలిదశ పనులను పూర్తిచేస్తామని చెప్పారు. డబ్బుతోనే అన్ని పనులు కావంటూ.. డబ్బు పెట్టినా దేశంలో ఎక్కడా భూసేకరణ జరగలేదని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా రైతులు 33వేల ఎకరాల భూములు ఇచ్చారని ప్రశంసించారు. మౌలిక సదుపాయాలు కల్పించి 25 నుంచి 27 శాతం భూమిని తిరిగి రైతులకిస్తామని చెప్పారు. రాజధానిలో హార్డ్‌వేర్, తయారీ, బ్యాంకింగ్, సేవారంగాలుంటాయని వివరించారు. అమరావతి అభివృద్ధి చెందితే ప్రపంచ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో తమ సంస్థలను నెలకొల్పేందుకు ముందుకొస్తాయన్నారు. తక్కువ భూమిలో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం చేపడతామని, భూకంపాలు, తుఫానులు తట్టుకునే విధంగా భవన నిర్మాణం జరుగుతుందన్నారు. రాజమండ్రిని టూరిజం హబ్‌గా తయారుచేస్తామన్నారు. అమరావతి నగరం పరిధిలోకి విజయవాడ, గుంటూరు ఉంటాయని సీఎం పేర్కొన్నారు.
 
అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ విశేషాలు..
హిందూ విశ్వాసాల ప్రకారం.. ఆధ్యంతం వాస్తుకు ప్రాధాన్యమిస్తూ రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ బృందం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి ప్లాన్‌ను రూపొందించారు. రాజధానిలో 40 లక్షల మంది నివాసముండే విధంగా ప్లాన్‌ను తయారుచేశారు. కృష్ణా నది మధ్యలో ఉన్న దీవులను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పరిపాలనా సౌలభ్యం కోసం 45 అంతస్థులతో రెండు టవర్లతో సెక్రటేరియట్‌ భవనం నిర్మించనున్నారు. అదేవిధంగా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉట్టిపడేలా రాజధానిలో అంతర్జాతీయ స్టేడియం, మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉంటాయి. కృష్ణానదికి కుడివైపు ఐటీ టవర్, ఎడమ వైపు సెక్రటేరియట్ ఉంటాయి. అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలకు పెద్దపీఠ వేశారు. రాజధానిలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పించారు. వారసత్వ సంపదను గుర్తించి, కాపాడే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజల జీవనశైలి, నాణ్యత ప్రమాణాలు పెంచే విధంగా ప్లాన్ రూపకల్పన చేశారు. సహజ వనరుల నిర్వహణకు ప్రత్యేక ప్రతిపాదనలు చేశారు. అందరికీ ఇళ్లు, ఉద్యోగాలు కల్పించడమే రాజధాని నిర్మాణ ధ్యేయంగా ప్లాన్ రూపొందించారు. రాజధానిలో ఒక మెగాసిటీ, 7 రీజనల్ సెంటర్స్, 7 డెవలప్‌మెంట్ కారిడార్లు నిర్మించనున్నారు. రీజనల్ కేంద్రాలుగా గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి, గుడివాడ, గన్నవరం, నందిగామ, నూజివీడుకు చోటు కల్పించారు.
 
ఉపాధి కల్పనే లక్ష్యంగా..
ఉద్యోగ కల్పనే లక్ష్యంగా భవిష్యత్తును అంచనా వేసి సింగపూర్ బృందం సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. భవిష్యత్తులో పెరగనున్న రాష్ట్ర జనాభాను అంచానా వేసి అందుకు అనుగుణమైన చర్యలను ప్రణాళికలో పొందుపర్చారు. ప్లాన్ ప్రకారం.. ప్రస్తుతమున్న రాష్ట్ర జనాభా 11 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే 2035 నాటికి 3.3 మిలియన్ల ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా 2050 నాటికి 13.5 మిలియన్లకు జనాభా పెరిగే అవకాశం ఉందని, ఆ సమయంలో 5.6 మిలియన్ల ఉద్యోగాల లక్ష్యంగా ప్లాన్‌లో చర్యలు రూపొందించారు.
 
నాలుగు విభాగాల్లో సీడ్ క్యాపిటల్..
నాలుగు విభాగాల్లో సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అమరావతి గేట్‌వే, అమరావతి డౌన్‌టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్, అమరావతి వాటర్ ఫ్రంట్‌గా విభజనించారు. వీటిలో 135 కి.మీ మేర మెట్రో రైల్, 250 కి.మీ టూరిజం సర్క్యూట్, 1000 కి.మీ మేర రోడ్లు, 40 శాతం పార్కులు, వినోద కేంద్రాలు ఉంటాయి.

No comments:

Post a Comment