- తెలంగాణ సర్కారు వేధిస్తోంది..
- లాయర్లపై దాడులు...
- రోడ్లపైకి విద్యుత్ ఉద్యోగులు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని గవర్నర్..
- సెక్షన్ 8 కోసం ఢిల్లీలో ధర్నా: అశోక్‌బాబు
- తెలంగాణ గవర్నర్‌లా నరసింహన్ వ్యవహారం..
- నవాబులా కేసీఆర్: జూపూడి
- టిఆర్‌ఎస్ ఆగడాలపై గవర్నర్ ప్రేక్షక పాత్ర..
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
తుమ్మలగుంట (తిరుపతి), జూలై 2: హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెంటాడి హింసిస్తున్నదని... దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం గురువారం తిరుపతిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం సాక్ష్యాలు దొరక్కుండా కుట్రపూరితంగా దాడులు చేయిస్తూ... శారీరకంగా, మానసికంగా హింస పెడుతున్నదని ఆరోపించారు. ఏపీ ఉద్యోగులు, మీడియా పట్ల కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని నిషేధించడం గవర్నర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు. కాబట్టే సెక్షన్ 8 అమలుకు పోరాటం చేయాల్సి వస్తున్నదని చెప్పారు. హైకోర్టులో తరచుగా ఏపీ న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా, బూతులు తిడుతున్నా స్పందించడం లేదన్నారు. ఏపీ న్యాయమూర్తులకు సైతం కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ స్పందించి సెక్షన్ 8ని అమలు చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాతో సమానంగా నిధులు కేటాయించి, రాయితీలు కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. రాయలసీమ నాయకులకు సరైన కమిట్‌మెంట్ లేకపోవడంవల్లే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెక్షన్ 8 అమలు కోసం విద్యార్థి జేఏసీతో కలసి ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఏపీకి చెందిన 1200 మంది విద్యుత్తు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రోడ్లపైకి నెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. గవర్నర్ స్పందించి విద్యుత్తు ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విభజన నాటి నుంచే ఉద్యోగులకు హైదరాబాద్‌లో కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ లేదన్నారు. సెక్షన్ 8పై వైసీపీ నోరు మెదపకుండా.. పరోక్షంగా కేసీఆర్‌కు మద్దతు తెలుపుతోందని ఆరోపించారు. హైదరాబాద్ ఆదాయంలో 58 శాతం ఏపీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ నరసింహన్ తెలంగాణ గవర్నర్‌గా మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిజాం నవాబులా ఫీలవుతున్నాడని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసుకు, సెక్షన్ 8కి లింకు పెట్టి తెలంగాణ వాదులు తప్పించుకోవాలని చూస్తున్నారని, ఆంధ్రవాదులంతా ఏకమై సెక్షన్ 8 కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు సుగుణ, తలారి ఆదిత్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఆగడాలపై గవర్నర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై గవర్నర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడలేకపోయామని, అయినప్పటికీ హోదా సాధిస్తామన్న నమ్మకం ఉందని చెప్పారు.
No comments:
Post a Comment