- చరిత్రను, భాషను మరిచిపోతే మనుగడ లేదు
- తెలుగు భాష- సంస్కృతి సదస్సులో ఏపీ సీఎం
రాజమండ్రి, జూలై 24: ‘‘తెలుగు జాతి చరిత్రలో అనేకసార్లు విడిపోయింది. శాతవాహనుల కాలంలో కూడా విడిపోయింది. మళ్లీ కలిసింది. ఇటీవల మళ్లీ విడిపోయింది. తెలుగు జాతికి విడిపోయి కలిసే చరిత్ర ఉంది. మనకు సుమారు 3000 ఏళ్లకుపైగా సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన భాష, కళలు ఉన్నాయి. వాటిని కాపాడుకోవాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాల సందర్భంగా స్థానిక ఆనం కళాకేంద్రంలో శుక్రవారం జరిగిన ‘తెలుగు భాష - సంస్కృతి’ సదస్సులో ఆయన మాట్లాడారు. చరిత్రను, భాషను మరిచిపోతే మనుగడ లేదని, భవిష్యత్ తరాల కోసం చరిత్రను నెమరువేసుకోవాలని, గుర్తుంచుకోవాలని, పరిణతి చెందుతూ భవిష్యత్ తరాలకు అవసరమైన నూతన శకానికి నాంది పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పుష్కరాల సందర్భంగా తెలుగు జాతిని తిరుగులేని శక్తిగా నిలపాలన్నదే తన ఆశయమని చెప్పారు. ‘‘11 రోజుల్లో సుమారు 4.28 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఇతర రాష్ట్రాలు.. ప్రాంతాల నుంచి వచ్చారు. ఇటువంటి మహా యజ్ఞాన్ని నిర్వహించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. సదస్సులో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్ర్తి, చేగొండి అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ కవి సిరివెన్నెలకు పుష్కర జ్ఞాపికను చంద్రబాబు అందజేశారు. మనది ఆనంద ఆంధ్ర ‘‘భారతదేశంలో గొప్ప కుటుంబ వ్యవస్థ ఉంది. అమెరికాలో 20 ఏళ్లకే పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోతారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు. 60-70 ఏళ్లలో ఒంటరి బతుకు. చైనాలో కుటుంబ నియంత్రణ తర్వాత కొంత మార్పు వచ్చింది. అక్కడ కొన్ని సమస్యలున్నాయి. జపాన్‌లో వృద్ధాప్య సమస్య మొదలైంది. యువకులు లేరు. మాట్లాడాలన్నా, మందులు వేసుకోవాలన్నా రోబోట్లతోనే! మనకు ఆ పరిస్థితి లేదు. ఇంటికెళ్లేసరికి పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ హాయిగా ఆహ్వానిస్తారు. అందరం కలిసి ఉంటాం. ఇది మన గొప్పతనం’’ అని చంద్రబాబు కొనియాడారు. ఇటీవల బాగా చదువుకున్న పిల్లలు పెళ్లిళ్ల తర్వాత స్వార్థం పెరిగి పిల్లలు వద్దనుకుంటున్నారని, తల్లిదండ్రులను వదిలేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ‘‘ఎంత సంపద ఉన్నా.. ఎన్ని సౌకర్యాలున్నా ఆనందముండాలి. కొందరు బంగారు కుర్చీలు, మంచాలు కూడా చేయించుకుంటున్నారు. పడుకోవడానికి గట్టిగా ఉండచ్చు ఉపయోగమేముంది? కొన్ని దేశాలకు సంపద ఉంది. కానీ, మనకున్న ఆనందం వాళ్లకు లేదు’’ అని చెప్పారు.
|
No comments:
Post a Comment