Wednesday, 22 July 2015

విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి

విజయవాడ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వండి.. ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకు సర్వీస్‌ ప్రొవైడర్లు.. నేడు విచారణ

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఈనెల 24వ తేదీలోపు కాల్‌డేటా సమాచారాన్ని సమర్పించాలంటూ విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిసే్ట్రట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ సర్వీస్‌ ప్రొవైడర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరు నెలల సీడీఆర్‌ను భద్రపరచాలని, తెలంగాణ అధికారులు రాసిన లేఖలు ఇవ్వాలని, ట్యాపింగ్‌ జరగకపోతే అదే విషయాన్ని తెలియజేయాలంటూ ఈనెల 17న విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సహా పలు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌ భానుమతిలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్‌ న్యాయవాది లావు నాగేశ్వరరావు బుధవారం ప్రస్తావించారు. కేసు తీవ్రత దృష్ట్యా, ఆదేశాల అమలుకు మరో రోజు మాత్రమే గడువు ఉన్నందున తక్షణం దీనిపై విచారణ జరపాలని, కింది కోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఈ పిటిషన్‌పై గురువారం ఉదయం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

No comments:

Post a Comment