Saturday, 9 May 2015

ప్రొఫెసర్‌ సాయిబాబా అత్యంత ప్రమాదకర వ్యక్తా?: అరుంధతి రాయ్

ప్రొఫెసర్‌ సాయిబాబా అత్యంత ప్రమాదకర వ్యక్తా?: అరుంధతి రాయ్

‘అవుట్‌లుక్‌’ వ్యాసంలో అరుంధతి రాయ్‌ ప్రశ్నలు
న్యూఢిల్లీ, మే 8 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేసేది ఎప్పుడంటూ ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతి రాయ్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయనను అరెస్ట్‌ చేసి, శనివారం నాటికి ఏడాదవుతున్న నేపథ్యంలో ‘‘భారతదేశంలో అందరికంటే ప్రమాదకరమైన వ్యక్తి ఈయనేనా?’’ అనే శీర్షికతో ‘అవుట్‌లుక్‌’ ఆంగ్ల పత్రికకు ఆమె ముఖపత్ర వ్యాసం రాశారు. శుక్రవారం విడుదలైన ఈ తాజా సంచికలోగల ఈ వ్యాసంలో ఆమె అనేక మౌలిక ప్రశ్నలను లేవనెత్తారు. నడుము నుంచి కాళ్లదాకా చచ్చుబడి, 90 శాతం వైకల్యంతో బాధపడే ఆయనను నానా రకాల ఆరోపణలతో అరెస్ట్‌ చేసి, పలు సెక్షన్లకింద లేనిపోని కేసులు మోపారని పేర్కొన్నారు. ఆదివాసీలపై ‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’ వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించినందుకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. దేశంపై యుద్ధం ప్రకటించారంటూ ‘రాజద్రోహం’ కేసు కింద నిరవధిక నిర్బంధం ఎన్నాళ్లని ప్రశ్నించారు. సాయిబాబా నివాసం నుంచి 2013 సెప్టెంబర్‌లో 50 మంది పోలీసులు ల్యాప్‌టాప్‌, హార్డ్‌ డిస్క్‌లు, పెన్‌ డ్రైవ్‌లు ఎత్తుకెళ్లడంతో దమనకాండ మొదలైందన్నారు. మే 9న కిడ్నాప్‌ చేసి నాగపూర్‌ జైల్లో 300 మంది రకరకాల నేరస్థులున్న సెల్‌లో పడేశారని ఆరోపించారు. కాలకృత్యాలకూ మరొకరి సాయం అవసరమైన వ్యక్తిని నానా రకాలుగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ అల్లర్లలో వందలాది మందిని ఊచకోత కోసినవారిని కూడా బెయిల్‌పై విడుదల చేశారన్నారు. కానీ, సాయిబాబాపై నేరం రుజువు కాకుండానే నిర్బంధించడం చూస్తే, అసలు సజీవంగా బయటకు రాగలరా? అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
 
కాగా, సాయిబాబా తన బంధువని, ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రొఫెసర్‌ను ఇంతకాలం నిర్బంధించడం దారుణమని తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని, నాగపూర్‌ కూడా వెళ్లి చూసి వస్తానని ఆయన చెప్పారు. కాగా, సాయిబాబా అరెస్టును నిరసిస్తూ శనివారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అధ్యాపకులు నిరాహార దీక్ష చేయనున్నారు.

No comments:

Post a Comment