Saturday, 30 May 2015

భయంకర వ్యాధి ముంచుకొస్తోంది

భయంకర వ్యాధి ముంచుకొస్తోంది
కోట్ల ప్రాణాలను హరించబోతోంది: బిల్‌గేట్స్

 పోరాటానికి టెక్నాలజీనే ఆయుధం
బెర్లిన్‌:  స్వైన్‌ ఫ్లూ.. రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను.. నిన్నమొన్నటి దాకా భారత్‌ను ముప్పు తిప్పలు పెట్టిన పరాన్నజీవి! ఎబోలా.. ఆఫ్రికా దేశాల్లో పుట్టి ప్రపంచ పర్యటన చేసి అన్ని దేశాల వెన్నులో వణుకు పుట్టించిన ప్రమాదకర వ్యాధి! కొన్ని వేల ప్రాణాలను మింగేసిన వైరస్‌! ఇప్పుడు వాటికి మించిన వైరస్‌ రాబోతోందట! ప్రపంచాన్ని తిప్పేసేందుకు సిద్ధమవుతోందట! అది దాడి చేస్తే ఏడాది లోపే సుమారు 3.3 కోట్ల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయమట! ఈ వివరాలు..హెచ్చరిక చేసింది మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌ గేట్స్‌! ఎబోలా మీద చేసిన పోరాటం ఆధారంగా ఈ కొత్త వ్యాధితో ‘యుద్ధం’ చేసేందుకు సదా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఇటీవల జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ భయంగొలిపే విషయాలు తెలిపారు. దాని మీద పోరాడేందుకు ‘టెక్నాలజీ’ అనే ఆయుధం చేబూని సమరాంగణులవ్వాలంటున్నారు. ఆ వ్యాధిని ఎదిరించడంలో సాంకేతిక పరిజ్ఞానానిదే కీలక పాత్ర అని ఆయన చెప్పారు. ‘‘అయితే అది వచ్చేది..రానిది మనం చెప్పలేకపోవచ్చు. కానీ, జరగడానికి ఆస్కారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మామూలుగా యుద్ధం చేసేందుకు వెళ్లేముందు అన్ని చూసుకుంటాం. విమానాలు సిద్ధం చేస్తాం. కఠోర శిక్షణలో ఉంటాం. ఇప్పుడూ అంతే.. ఓ యుద్ధానికి సిద్ధమవ్వాలి’’ అని చెప్పారు. అందుకు వలంటీర్లతో ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో దూసుకుపోయే ఓ బృందాన్ని నిర్మించుకోవాలని, ఎబోలా ప్రభావిత దేశాల్లో ఎలా అయితే స్వచ్ఛందంగా పాల్గొన్నారో అలాగే ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ‘‘ఒక్క సారి 20 శతాబ్దం మరణా లు చూడండి. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 2.5 కోట్ల మంది చనిపోయారు. రెండో ప్రపంచయుద్ధంలో 6.5 కోట్ల మంది చనిపోయారు. కానీ, ఆ రెండింటికి మధ్య మరో ప్రపంచయుద్ధం ఒకటి వచ్చిందని తెలుసా? అది స్పానిష్‌ ఫ్లూ! ఈ ప్రాణాంతక వైరస్‌ రెండో ప్రపం చ యుద్ధంలో ఎంత మంది చనిపోయారో అంతకన్నా ఎక్కువ మందినే పొట్టన పెట్టుకుంది. అది మొదటి ప్రపంచ యుద్ధ మరణాలకు మూడింతలు. ఇప్పటి వర కు ఆరోగ్య కారణాల వల్ల సంభవించిన మరణాల్లో ఇదే రికార్డు’’ అని ఆనాటి వైరస్‌ దాడిని గుర్తు చేశారు. ఆ వైరస్‌ 1918 కన్నా ముందే తన ఉనికిని చాటినట్లు ఇటీ వలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు వెల్లడించినట్లు ఆయన గుర్తు చేశారు. హెచ్‌1 వైరస్‌గా పేర్కొంటున్న అది 1900 కాలం నుంచే మానవాళిలో తిష్ట వేసుకు కూర్చుందని, బర్డ్‌ ఫ్లూ వైరస్‌లలోని జన్యు పదార్థాలను కూడగట్టుకుని బలంగా తయారైందని ఆ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చాలా వరకు ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీన రోగులే మరణిస్తారు. కానీ, 1918లో వచ్చిన ఆ స్పానిష్‌ ఫ్లూ యువతీయువకుల ప్రాణాలనూ బలి తీసుకుంది. పేద దేశాలకు వ్యాక్సిన్లు అందించే గావీ అలయన్స్‌ సంస్థ జనవరిలో నిర్వహించిన సదస్సులో గేట్స్‌.. పాత వ్యాధిని గుర్తుచేస్తూ కొత్త వ్యాధి గురించి చెప్పుకొచ్చారు. పాశ్చాత్య దేశాల్లో యాంటీ-వ్యాక్సినేషన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ ఇంజెక్షన్ల వల్ల వచ్చే ముప్పులకు భయపడి వారు వ్యాక్సి న్లు వేయించుకోవట్లేదన్నారు. పేద చిన్నారులకు వ్యాక్సినేషన్‌ చేయించాల్సిన అవసరం ఉందన్నారు. 

No comments:

Post a Comment