Friday, 15 May 2015

హామీలను తుంగలోకి తొక్కిన చంద్రబాబు:జగన్‌

హామీలను తుంగలోకి తొక్కిన చంద్రబాబు:జగన్‌

  • రుణ మాఫీ పేరుతో మోసం చేశారు
  • రైతు భరోసా యాత్రలో జగన్‌
గుంతకల్లు, మే 14:ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలోకితొక్కి అబద్ధాలతో చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం నుంచి గురువారం ఆయన రైతు భరోసా యాత్రను కొనసాగించారు. పట్టణంలోని మహిళలను పలకరిస్తూ ముందుకుసాగారు. మండలంలోని నల్లదాసరిపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు హుసేనప్ప, పుల్లయ్య కుటుంబాలను పరామర్శించారు. పెద్దదిక్కును కోల్పోయిన బాధిత రైతు కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
అనంతరం తిమ్మాపురంలో రైతు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంటలు పండక, అప్పుల బాధలు తాళలేక రైతులు, చేనేత కార్మికులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా సీఎం చంద్రబాబు వారి చెవిలో పువ్వులు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇంటికో జాబు ఇస్తానని నమ్మబలికిన చంద్రబాబు గద్దెనెక్కిన తరువాత విస్మరించారన్నారు.
 
హామీలు నెరవేర్చకుండా గోబెల్స్‌ ప్రచారం చేపట్టి రోజుకో అబద్ధం చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. రైతు భరోసా యాత్రలో రైతుల ఇంటికి వెళ్లినప్పుడు రుణాలు మాఫీ కాలేదంటూ తన వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మహిళల కష్టాలు చూసైనా చంద్రబాబు సిగ్గు పడాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలు చేద్దామన్నారు.

No comments:

Post a Comment