Wednesday 27 May 2015

తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా?: హరగోపాల్

తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా?: హరగోపాల్
  • ఈ ప్రభుత్వానిదీ ఉమ్మడి ప్రభుత్వ స్వభావమే
  • పౌరహక్కులకు నాయకుడిగా ఉంటానన్న మాట ఏమైంది?
  • ‘ఓయూ వివాదం’ ప్రభుత్వానికి కొరివితో తలగోక్కున్నట్లే 
  • ఇకనైనా సీఎం కేసీఆర్‌ సోయిలోకి రావాలె: పాశం యాదగిరి
 హైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి సిటీ బ్యూరో): ’కొత్త రాష్ట్రంలోనూ మార్పేమీ కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ స్వభావమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనూ కనిపిస్తోంది. అసలు మనం నూతన రాష్ట్రంలో ఉన్నామా? అనే సందేహం కలుగుతోంది. ఇందుకేనా అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నది’’ అంటూ పౌర హక్కుల నేత, ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తెలంగాణ సర్కారు విధానాలపై ధ్వజమెత్తారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల గొడవలో విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పౌరహక్కులకు పెద్దదిక్కుగా ఉంటానని ఉద్యమ సందర్భంగా కేసీఆర్‌ చెప్పిన మాటలు ఇప్పుడేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాల తీరునే తెలంగాణ ప్రభుత్వమూ అమలు చేస్తోందని విమర్శించారు. ఓయూ విద్యార్థులపై ప్రభుత్వ రాక్షస క్రీడను హరగోపాల్‌ తీవ్రంగా ఖండించారు. హక్కుల్ని సాధించుకోవడం ఎలాగో తెలిపిన తెలంగాణ ఉద్యమ పంథానే నేడు విద్యార్థులు పాటిస్తున్నారని, ఇందులో తప్పేమి లేదని అన్నారు. ఓయూ భూములపై ప్రభుత్వం అనవసర రాద్ధాంతానికి తెరలేపిందని, కొరివితో తలగోక్కున్నట్లుందని వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్లు కట్టించడానికి జీవీకే, జీఎంఆర్‌ లాంటి కార్పొరేట్లకు ఇచ్చిన వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు కట్టించకుండా విశ్వవిద్యాలయాల భూములపై పడడమేంటని సర్కారును ప్రశ్నించారు. భవిష్యత్‌ తరాల వారికోసం యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని హరగోపాల్‌ అన్నారు. ఓయూ భూముల జోలికి వెళ్లి ప్రభుత్వం ఇప్పటికే ఓ తప్పు చేసిందని, విద్యార్థులపై దాడికి దిగి మరో తప్పు చేసిందని అన్నారు. ఈ పద్ధతి తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదని హితవుపలికారు. అరెస్టు చేసిన విద్యార్థుల్ని వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ జర్నలిస్టు, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్‌ పాశం యాదగిరి మాట్లాడుతూ.. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వాలకన్నా తెలంగాణ ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని ఆరోపించారు. ఇకనైనా సీఎం కేసీఆర్‌ సోయిలోకి రావాలని, కాదని ఇదే మొండివైఖరి అవలంబిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విద్యార్థుల పోరాట ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని, అటువంటి విద్యార్థులపైనే ఇలాంటి పాశవిక చర్యలకు పాల్పడడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని, ఆంధ్ర కబ్జాదారుల గుప్పిట్లో ఉన్న వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లక్షల రూపాయల విలువ చేసే భూముల్ని కార్పొరేట్లకు అర్ధ రూపాయికి ధారాదత్తం చేశారని, వాటన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రామోజీ ఫిల్మ్‌సిటీని లక్షనాగళ్లతో దున్నిపిస్తానని, కబ్జాభూముల్ని స్వాధీనం చేసుకుంటానని నాడు చెప్పిన మాటలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఓయూ భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తామనడం దారుణమైన నిర్ణయంగా యాదగిరి అభివర్ణించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై దాడులు ఆపాలని, వారిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.
 
టీపీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ తన రాజకీయ పబ్బం కోసం పేదలకు, విద్యార్థులకు మధ్య చిచ్చు పెడుతున్న సీఎం కేసీఆర్‌కు పదవిలో ఉండే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఆది నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ అన్వర్‌ఖాన్‌, నారాయణరావు, రమణాచారి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment