హైదరాబాద్, మే 25(ఆంధ్రజ్యోతి):నవ్యాంధ్ర రాజధాని అమరావతి వాస్తు బాగుందని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం, అధికారుల సహకారం వల్లే ఎంతో సంక్లిష్టమైన రాజధాని నగర నిర్మాణ బృహత్ ప్రణాళికను ఇంత త్వరగా రూపొందించగలిగామని ఈశ్వరన్ అన్నారు. రాజధాని నగర బృహత్ ప్రణాళికను సీఎం చంద్రబాబుకు అందించాక.. ప్రణాళిక సమగ్ర స్వరూపాన్ని ఆయన వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజధాని నగర బృహత్ ప్రణాళిక బ్లూప్రింట్ వంటిదని ఆచరణలోకి వస్తే ఎందో బాగుంటుందని ఈశ్వరన్ అన్నారు. రాజధాని నగరం చుట్టూ అపార జలవనరులున్నాయని .. వాటిని కాపాడుకుంటూ.. జలరవాణాకు పెద్దపీట వేశామని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము రాజధాని నగర బ్లూప్రింట్‌ను తయారు చేశామని వివరించారు. హరిత వనాలను పెంచుతూ ప్రజా పార్కులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్సులు వంటి వాటిని కూడా చేర్చామని అన్నారు. రాజధాని నగరం అంటే.. ఒకటి రెండు సంవత్సరాల కోసం కాదని, దశాబ్దాల పాటు చిరస్థాయిగా నిలిచి ఉండేలా నిర్మించాల్సి ఉందన్నారు.
No comments:
Post a Comment