Saturday, 9 May 2015

గౌతమబుద్ధుడికి గిరాకీ! (07-May-2015)

గౌతమబుద్ధుడికి గిరాకీ! (07-May-2015)
బుద్ధుడిని విష్ణు అవతారంగా మార్చి జీర్ణం చేసుకున్నట్టే, అంబేద్కర్‌ను అధికారిక చరిత్రలోకి, ఆమోదనీయ శ్రేణిలోకి జీర్ణం చేసుకుని నిశ్శక్తుడిని చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రెండోసారి తలెత్తిన బుద్ధుడిని మరోసారి జీర్ణం చేసుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. అంబేద్కర్‌నూ, గౌతమబుద్ధుడినీ ఇద్దరినీ రక్షించుకోవలసిన బాధ్యత భారత్‌లోని ప్రగతిశీల, సామాజిక శక్తులన్నిటికీ ఉన్నది.

చైనా కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్‌ నాస్తికుడని అందరికీ తెలుసు. బుద్ధుడి గురించి, బౌద్ధ స్థలాల గురించి కానీ ఆయన గొప్పగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. చారిత్రకస్థలాలు వారసత్వ సంపద అని, వాటిని పరిరక్షించుకోవాలని మాత్రం ఆయన అనేక మార్లు చెప్పారు. టిబెట్‌ మీద చైనా చేసిన ఆక్రమణ, సాంస్కృతిక విప్లవకాలం లో బౌద్ధారామాలపై, భిక్షుగృహాలపై జరిగిన దాడులు మావోప్రకటిత అభిప్రాయాలకు భిన్నమైన ఆచరణను చూపిస్తాయి.
 
బౌద్ధం చైనాలోకి ప్రవేశించడమే మహాయాన రూపంలో ప్రవేశించడం, రాచరిక భూస్వామ్యశక్తుల ప్రోద్బలంతో అది విస్తరించడం కారణంగా మావోకు గానీ, ఇతర చైనా విప్లవనేతలకు గానీ ఆ మతం మీద అభిమానం లేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు చైనాలో ఉన్న అధికార పక్షం తాను కూడా కమ్యూ నిస్టు పార్టీయేనని చెప్పుకుంటున్నప్పటికీ, మావో సిద్ధాంతాల నుంచి చాలా ఎడం జరిగిపోయింది. బౌద్ధం మీద, సన్యాసుల మీద, పురావస్తు స్థలాల మీద సహనం, ఆదరణ పెరిగాయి కానీ, ప్రస్తుత పాలకులకు కూడా మౌలిక బౌద్ధ సిద్ధాంతాల మీద ఆసక్తిగానీ, గౌరవం కానీ లేవు.
 
చైనాలో పన్నెండువందల ఏళ్ల పురాతనమైన బౌద్ధస్థలం ఒకటి ఉన్నది. అది వుటై పర్వతం. బుద్ధుని శిష్యుడైన మంజుశ్రీ బోధిసత్వ నివసించాడన్న కారణంగా ఆ స్థలాన్ని చైనీయ బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శిస్తారు. 1949లో అక్టోబరు విప్లవం విజయవంతమయ్యాక, ఇంకా అధికారం చేపట్టడానికి మధ్య ఉన్న విరామంలో మావో వుటై పర్వతాన్ని సందర్శించాడు. అదృష్టాన్ని జాతకాన్ని చెప్పే చిలకజోస్యం కార్డుల వంటివి ఆ చోట ప్రసిద్ధం. మావో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడట. ఒక కార్డు తీశాడు. ఆయనకు 8341 నెంబరు గల కార్డు వచ్చిందట. ఆ కార్డు ఏమి చెబుతోందో వివరించమని అక్కడున్న బౌద్ధ సన్యాసిని అడిగాడట. ఆ సన్యాసి మౌనం వహించాడు. ఎంత బతిమాలినా చెప్పలేదు.
 
సరే అనుకుని హడావుడిగా మావో వెళ్లిపోయాడట. తరువాత తెలిసిందేమిటంటే, ఆ కార్డులోని మొదటి రెండు అంకెలు ఆయన ఆయు ష్షుని, తరువాతి రెండు అంకెలు ఆయన పార్టీ సారథ్యకాలాన్ని సూచించేవి. మావో 83 సంవత్సరాలు బతికారు. 41 సంవత్సరాల పాటు (1935 నుంచి) కమ్యూనిస్టుపార్టీ అధినేతగా వ్యవహరించారు. వుటై పర్వతం చూడ్డానికి వచ్చే సందర్శకులందరికీ అక్కడి ప్రభుత్వ గైడ్‌లు ఈ కథను చెబుతుంటారు. బౌద్ధం కారణంగా ఆ స్థలానికి ఎంత ప్రాశస్త్యం అబ్బిందో, మావో కథ వల్ల అంతకు రెట్టింపు ప్రాచుర్యం లభించింది.
 
అదృష్టపు కార్డుల కథ కట్టుకథ అని వేరే చెప్పనక్కరలేదు. కానీ, పెట్టుబడికి కట్టుకథల మీద వ్యతిరేకత ఏమి ఉంటుంది? బౌద్ధం లేని బుద్ధుడిని బంగారు దేవుడిని చేసినట్టే, మావో నుంచి సారాన్ని తీసేసి కొత్తదేవుడిగా ప్రతిష్ఠించుకున్నది చైనా. బుద్ధుడినీ మావోనీ కలిపేసి గుండుగుత్తగా వ్యాపారం చేసుకుంటోంది. భారతదేశం చైనాకు బుద్ధుడిని ఇస్తే, చైనా మనకు మావోను ఎగుమతి చేసిందని కొందరు చమత్కరిస్తుంటారు. భారతదేశం బుద్ధుడిని కానుకగా ఇవ్వలేదు. బుద్ధుడిని చేజేతులా వదులుకున్నది, మావో కూడా పాపం చైనా వదిలి అనేకానేక దేశాల్లో తలదాచుకుంటున్నాడు. తాము నిరాకరించిన, నిర్లక్ష్యం చేసిన వ్యక్తులను కూడా వ్యాపారం కోసం కావలించుకోవడం భారతదేశంలో కూడా మొదలయింది.
 
ఈ ఏడాది మన దేశంలో బుద్ధపూర్ణిమ హడావిడి ఎక్కువైపోయింది. యుద్ధం లేని లోకం కోసం బుద్ధమే శరణమని సాక్షాత్తూ నరేంద్రమోదీ అన్నారు. నాగార్జునసాగర్‌లో మిరుమిట్లు గొలిపే బుద్ధవనాన్ని నిర్మిస్తామని కెసిఆర్‌ ప్రకటించారు.. ఇక నవ్యాంధ్ర రాజధాని పేరే అమరావతి. అక్కడ ఘనంగా వైశాఖపూర్ణిమ వేడుకలు జరిగాయి. లోకంలో బుద్ధుడి మీద ఆసక్తి వేగంగా పెరుగుతున్న మాట నిజమే కానీ, ఇదిట్లా అధికారికమైన అట్టహాసంగా మారితే కొంచెం సందేహించవలసిందే. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా తన గదిగుమ్మానికి బుద్ధశిల్పం ఉండేదని మోదీ చెప్పినప్పుడు ఆశ్చ ర్యమే కలిగింది.
 
స్వయంగా బౌద్ధమతానుయాయులైన పాలకులలో నియంతలూ నరహంతకులూ అనేకులున్నారు. వారి మతం వేరు. ఇతర మతస్థులైనవారు బుద్ధుడిని కీర్తించినప్పుడు మాత్రం వారి ఆసక్తికి బౌద్ధవిలువలే ఆధారమని అను కుంటుంటాము. మోదీకి బౌద్ధం మీద ఇంతటి ఆసక్తి ఉన్నదని మనకు మొన్నటి దాకా తెలియనే తెలియదు. యుద్ధాలు లేని లోకం కోసమే కాదు, అసమానతలు లేని సమాజానికి కూడా బౌద్ధం పనికివస్తుందని మోదీ గుర్తిస్తారా? మనది కాని దాన్ని అపహరించకూడదని, బలవంతంగా తీసుకోకూడదని బుద్ధుడు చెప్పాడని భూసేకరణ బిల్లు తెచ్చిన ప్రధానికి తెలుసునా? చరిత్రలో చంద్రగుప్తుడు, రాణాప్రతాపుడు, ఛత్రపతి శివాజీ వంటివారే కాక, ప్రపంచంలోనే అతి గొప్ప పాలకుడు మానవతావాది బౌద్ధుడు అయిన అశోకుడు కూడా ఉన్నాడని, అతను ఆదర్శప్రాయుడని మోదీ కానీ ఆయన పరివారం కానీ తమ అనుయాయులకు ఇకనైనా చెప్తారా? గోవధ కూడదన్న విలువ బౌద్ధం నుంచి వచ్చిందని, విచక్షణారహిత గోవధకు పాల్పడుతున్న వైదికమార్గీయులకు ఎదురొడ్డింది ఆ మతమేనని చరిత్రను సవరించి చెప్పగలరా? 
 
అమరావతి అని పేరు పెట్టుకుంటే చాలదు, బుద్ధవిహారాలను అలంకరిస్తే చాలదు, మనుషులను ఎదురుకాల్పుల పేరుతో చంపకుండా కూడా ఉండా లని తెలుగు రాషా్ట్రల ముఖ్యమంత్రులకు ఎవరు బోధిస్తారు? డెబ్భై అంతస్థుల భవనాలు, పలువరుసల పలు అరల రహదారులు- అవసరం కోసం కాక ఆడంబరం కోసమే అని తెలిసి వస్తే, మనుషులు సంతృప్తిగా శాంతిగా బతికే నగరాలను నిర్మించే ప్రయత్నం చేస్తాము. అభివృద్ధి ఉన్మాదంలో శివాలూగుతున్నవారికి మధ్యేమార్గాలు రుచిస్తాయా? 
 
బౌద్ధం భారతదేశం మీద వదిలిన ప్రగాఢమైన భౌతిక ముద్రలను ఓరియంటలిస్టులు, వలసవాద ఔత్సాహికులు, పురాతత్త్వవేత్తలు వెలికితేస్తే, బుద్ధునితో ఒక పరంపరాగత అనుబంధాన్ని, భావబంధాన్ని ఆవిష్కరించినవాడు డాక్టర్‌ బి. ఆర్‌. అంబేద్కర్‌. ఆధునిక భారత దేశం, ప్రజాస్వామిక భారతీయ సమాజం అంబేద్కర్‌ను దీర్ఘకాలం వెలిగానూ, మార్జిన్‌లోనూ ఉంచి, ఇప్పుడిప్పుడే ఆయన ప్రాసంగికతను, అనివార్యతను కనుగొంటున్నది. అంబేద్కర్‌తో రక్తసంబంధం ఉన్న వర్గాలు సమాజంలో గొంతువిప్పి, నడుంకట్టి, ఒక సాధికార శక్తిగా రూపొందుతున్న క్రమం నేడు చూస్తున్నాము. బుద్ధుడిని విష్ణు అవతారంగా మార్చి జీర్ణం చేసుకున్నట్టే, అంబేద్కర్‌ను అధికారిక చరిత్రలోకి, ఆమోదనీయ శ్రేణిలోకి జీర్ణం చేసుకుని నిశ్శక్తుడిని చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.
 
మధ్యయుగాల చరిత్రలో మట్టికొట్టుకుపోయిన బౌద్ధస్థలాల పునరావిష్కరణ, సామాజిక న్యాయశక్తుల ఉద్యమ స్ఫూర్తి శాక్యగౌతముని యదార్థతత్వాన్ని మరోసారి లోకం ముందుకు తెచ్చాయి. రెండో సారి తలెత్తిన బుద్ధుడిని మరోసారి జీర్ణం చేసుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. అంబేద్కరూ, బుద్ధుడూ - ఇద్దరినీ ఒకేసారి మర్యాదస్తులుగా తీర్చిదిద్దే సృజనాత్మక తంత్రాన్ని ఇప్పుడు కళ్లా రా చూస్తున్నాము. అంబేద్కర్‌నూ, గౌతమ బుద్ధుడినీ ఇద్దరినీ రక్షించుకోవలసిన బాధ్యత భారత్‌లోని ప్రగతిశీల, సామాజిక శక్తులన్నిటికీ ఉన్నది. 
 
గౌతమబుద్ధుని వలె గౌరవాస్పదుడైన పురాచారిత్రకవ్యక్తి మరొకరు ఉన్నారా అన్నది సందేహమే. తన తార్కిక శక్తి వలన, సామాజిక పరస్పరతను నిలిపే విలువలను బోధించినందున ఆయన గౌరవం పొందాడు. కులాలను, యజ్ఞయాగాదులను నిరసించడం- బౌద్ధం ప్రతిపాదించిన ఒకసమగ్ర జీవనవిధానంలో అవిభాజ్యమైన భాగాలు. అతని కాలానికి అతను ఆకాశమంత ఎత్తున నిలబడగలిగాడు.అతని వంటి ఆలోచనాపరుడైన దేవుడు మరొకరు లేరు. స్వయంగా భౌతికవాదీ వామపక్ష అభిమాని అయిన సీనియర్‌ కొశాంబి కూడా అందుకే ‘భగవాన్‌ బుద్ధ’ అనకుండా ఉండలేకపోయాడు. కొందరి స్వార్థానికీ, అందరి సంక్షేమానికీ వైరుధ్యం నిత్యయుద్ధంగా పరిణమించిన కాలంలో, మిత జీవనమూ సమ్యక్‌ వర్తనమూ వంటి బౌద్ధ విలువలకు అవసరమూ ప్రయోజనమూ పెరిగాయి. వైరుధ్యం అంతిమంగా ఎలా పరిష్కారమవుతుందోకానీ, అప్పటిదాకా జరిగే ప్రయాణానికి విలువల బత్తెం కావాలి.

ప్రకృతినీ, సమష్టినీ కొల్లగొట్టే దురాశను, అందులో మోచేతి విదిలింపుల కోసం దిగజారే కక్కుర్తులను అవినీతిగా చెప్పగలిగే ఒక ఆధ్యాత్మికత కూడా కావాలి. దేవుళ్లూ దేవుళ్ల ఏజెంట్లూ భక్తి పేరుతో మనుషులను పీక్కు తింటున్నపుడు దేవుడు లేని మతమొకటి కావాలి. నాటి నరహత్యలను, పశుహత్యలను ఆపడానికి బౌద్ధం అవతరించినట్టే, నేటి విధ్వంసక అభివృద్ధి యజ్ఞాన్ని నిలువరించే బోధన, నైతికశక్తి కలిగిన బోధన ఒకటి కావాలి. 

No comments:

Post a Comment