- కవితకు కేంద్ర మంత్రి కావాలనే షోకు ఉంది: ఎర్రబెల్లి
- మజ్లిస్ వైఖరి ప్రకటించాలి: వివేకానంద
- మోదీ మెప్పు కోసం సీఎం యత్నం: జీవన్‌రెడ్డి
హైదరాబాద్/జగిత్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): కేంద్ర కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌ను చేర్చుకునే అంశమే ఉండదని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ తన కూతురు, ఎంపీ కవితకు కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలుచేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఈసడించుకున్నా కేంద్ర మంత్రి పదవి కోసం టీఆర్‌ఎస్ నేతలు పాకులాడుతున్నారని విమర్శించారు. ఒకవేళ కేంద్ర కేబినెట్‌లో టీఆర్‌ఎస్‌ను చేర్చుకున్న పక్షంలో తెలంగాణలో బీజేపీతో తమకు దోస్తీ ఉండదని స్పష్టం చేశారు. ఎంపీ కవితకు కేంద్రమంత్రి కావాలనే షోకు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, మోదీ ఆహ్వానిస్తే కేంద్రమంత్రి వర్గంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత చేసిన ప్రకటనపై మజ్లిస్ నేతలు తమ వైఖరిని ప్రకటించాలని టీడీపీ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు సాక్షాత్తు శాసనసభలోనే టీఆర్‌ఎస్ తమ మిత్రపక్ష పార్టీగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మజ్లిస్‌తో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారులో చేరడానికి తహతహలాడుతోందని విమర్శించారు. కాగా, కవితకు మంత్రి పదవి కోసమే సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. నాడు కేసీఆర్ కేంద్రంలో మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని, ఇప్పుడు కవిత మంత్రి పదవి కోసం రైతాంగాన్ని బలి పెట్టడం సరికాదన్నారు.
|
No comments:
Post a Comment