|
కర్నూలు, మే 14 : పోలవరం ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం ఉదయం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని తెలిపారు. ప్రాజెక్టుల పనులు ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని, అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కావాలని స్పష్టం చేశారు.
సమయానికి పూర్తిచేస్తేనే అనుకున్న బడ్జెట్ సరిపోతుందని చంద్రబాబు అన్నారు. కావాలని ఆలస్యం చేస్తూ వ్యయం పెంచుతున్నారన్న సీఎం ఇకపై ప్రతిపనిని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టుపై అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. సీమకు నీరిస్తున్నామని గోదావరి వాసులను రెచ్చగొడుతున్నారని, అడ్డుకోవాలని చూస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టును ఆపేదిలేదని సీఎం స్పష్టం చేశారు. నీచరాజకీయాలతో గోదావరి ప్రాజెక్టుకు అడ్డుపడ్డారన్నారు. గోరకల్లు ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు ఉంచుతామని తెలిపారు. అవుకు రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అవసరమైతే జలవిద్యుత్‌ను తెలంగాణకు ఇచ్చి నీటిని రాయలసీమకు తరలిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
|
No comments:
Post a Comment