|
ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేలు.. డెడికేటెడ్ రవాణా రహదారులు.. 135 కిలోమీటర్ల మేర పరుగులు పెట్టే మెట్రో రైలు.. హైస్పీడ్ రైల్వే లైన్లు.. మంగళగిరిలో భారీ విమానాశ్రయం, పర్యావరణ హిత, అలంకృత జలమార్గాలు.. ఎక్కడికక్కడ పార్కులు.. సరికొత్త రిజర్వాయర్లు.. క్రికెట్ స్టేడియం.. కృష్ణానదిలో వాటర్ టాక్సీలు.. పుణ్యక్షేత్రాలను కలిపే రోడ్, వాటర్ సర్క్యూట్లు.. వెరసి 21వ శతాబ్ది హంగులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ ప్రణాళిక రూపుదిద్దుకుంది! తన అనుభవాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను రంగరించి సింగపూర్ దీనిని రూపొందించింది. ఈ ప్లాన్ ప్రకారం.. మొత్తం రాజధాని ప్రాంతం.. 7420 చదరపు కిలోమీటర్లు! అందులో కేంద్ర ప్రణాళిక ప్రాంతం 854 చదరపు కిలోమీటర్లు!! అందులోనూ 217 చదరపు కిలోమీటర్లు.. అంటే 55 వేల ఎకరాలు ప్రధాన రాజధాని ప్రాంతం. దాని మధ్యలో పరిపాలన భవనాలుండే సీడ్ కేపిటల్. ఇదీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ముఖచిత్రం!
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి సుమారు 55 వేల ఎకరాల్లో ఉండనుంది. దీని విస్తీర్ణాన్ని 217 చదరపు కిలోమీటర్లుగా అంచనా వేసింది. రాజధాని నగర మాస్టర్ ప్లాన్ పేరుతో దీనిని అందచేసింది. ఇందులో మొత్తం తొమ్మిది భాగాలు ఉన్నాయి. మొత్తం రాజధాని రీజియన్ ప్రాంతం 7,420 చదరపు కిలోమీటర్లు. ఇందులో కేంద్ర ప్రణాళిక ప్రాంతం 854 చదరపు కిలోమీటర్లు. ఇందులోనే 217 చ.కి.మీ.ల్లో రాజధాని నగరం ఉంటుంది. ప్రభుత్వ భవనాలుండే సీడ్ కేపిటల్ ఇందులో అంతర్భాగంగా మధ్యలో వస్తుంది. మాస్టర్ ప్లాన్‌లో ఐదు కీలక ఘట్టాలు ఉన్నాయి. గణనీయమైన ఆర్థికాభివృద్ధి, నివాసయోగ్య నగరం, కనెక్టివిటీ, యాక్టివ్ మొబిలిటీ, సుస్థిరతలను ప్రధానంగా రాజధానిని డిజైన్ చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీఐఎస్, ఫార్మాస్యూటికల్ కంపెనీల కారణంగా అమరావతి కమర్షియల్ హబ్‌గా రూపొందనుంది. సెంట్రల్ బిజినెస్ డిసి్ట్రక్ట్, కమర్షియల్ జోన్లు, పారిశ్రామిక పార్కులు ఏర్పడతాయి. వారు నివశించే ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు ఉంటాయి.
రాజధాని మధ్యలో జలమార్గాలు
కృష్ణా నదికి అభిముఖంగానే రాజధాని నగర నిర్మాణం జరుగుతున్నా మళ్లీ దాని మధ్యలో ఒక అలంకృత జలమార్గం నిర్మించనున్నారు. దానిపక్కనే ఢిల్లీలోని రాజ్‌పథ్ తరహాలో ఒక ప్రధాన రహదారి వస్తుంది. దీనికి అటూ ఇటూ పార్కులు వస్తాయి. ఈ జలమార్గంలో లాంచీలు, పడవల్లో ప్రయాణం చేసే వీలు క ల్పిస్తారు. రాజధాని నగరంలో పచ్చదనానికి, నీటి ప్రవాహాల అనుసంధానానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. పచ్చదనానికి మొత్తం 21 శాతం ప్రాంతాన్ని వదలాలని నిర్ణయించారు. రాజధానిలో అంతర్భాగంగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు, కుంటలను ప్రతిదానినీ అభివృద్ధి చేస్తారు. వాటి గట్లపై పెద్దఎత్తున చెట్లు, హరిత వనాలను పెంచుతారు. సివిక్ పార్క్, సెంట్రల్ పార్క్ పేరుతో రెండు భారీ పార్కులు నిర్మిస్తారు. ఇవికాక, కృష్ణా నది ఒడ్డున కెనాల్ పార్కులు ఏర్పాటు చేస్తారు. రాజధానికి అభిముఖంగా ఉన్న కృష్ణా నదికి అనుసంధానిస్తూ జలమార్గాలను అభివృద్ధి చేస్తారు. నదికి సమాంతరంగా పారుతున్న కొండవీటి వాగును మరింత వినియోగంలోకి తేవడానికి దానిపై రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మిస్తారు. రాజధాని ప్రాంతంలో మూడు శాతం ప్రాంతంలో జలాశయాలు, జల మార్గాలు ఉంటాయి. వీటి పొడవు 80 కిలోమీటర్లు. 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో పచ్చదనం ఉంటుందని అంచనా.
రాజధానిలో సగం ప్రాంతం మౌలిక వసతులకే పోతోంది. సుమారుగా 22-23 వే ల ఎకరాల భూమిని రోడ్లు, పార్కులు, జల మార్గాలు, పైప్‌లైన్లు, మెట్రో మార్గాలు, పాఠశాలలు, ఆస్పత్రులు వంటి సామాజిక అవసరాలకు కేటాయిస్తారు. రైతుల వాటా కింద వారికి పది వేల ఎకరాల భూమి ఇస్తున్నారు. ఇందులో 2 వేల ఎకరాలు వాణిజ్య భూమిగా ప్రత్యేకించి విడిగా ఇస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో గృహాల లభ్యత కోసం కనీసం 10ుభూమి కేటాయించాల్సి వస్తోంది. ఇవి పోను ప్రభుత్వ అవసరాలకు సుమారుగా 7 వేల ఎకరాల భూమి మిగులుతోంది. దీనిలోనే ప్రభుత్వం తన అవసరాలు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.
సీఆర్‌డీఏ పరిధిలో రాజధాని సమగ్ర చిత్రమిది! ఎక్కడెక్కడ అర్బన్ గ్రోత్ కారిడార్లు ఉండనున్నాయి.. ఎక్కడెక్కడ విమానాశ్రయాలు, వ్యవసాయ జోన్లు, పారిశామ్రిక కేంద్రాలు ఉండనున్నాయనే వివరాలు ప్లాన్‌లో ఇచ్చారు. కృష్ణా నదికి అటూ ఇటూ రాజధాని నగరం ఉండనుందని స్పష్టం చేశారు. సుమారుగా వెంకటపాలెం నుంచి రాయపూడి వరకూ రాజధాని నగర విస్తీర్ణం ఉండనుంది. భవిష్యత్తులో రాజధాని విస్తరణకు వీలుగా మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి వరకూ విశాలమైన స్థలాన్ని రిజర్వు చేశారు. గన్నవరానికి తోడుగా మంగళగిరిలో భారీ విమానాశ్రయం రానుంది. సీఆర్‌డీఏ పరిధిలో ఇప్పుడున్న పంట పొలాలను యథాతథంగా అలాగే ఉంచనున్నారు. ఇక, రాజధాని నుంచి హైదరాబాద్‌కు, విశాఖపట్నానికి రైలు, రోడ్డు కారిడార్లు నిర్మిస్తారు. విశాఖకు ప్రత్యేకంగా రైలు మార్గం ఉంటుంది. మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులకు రోడ్డు కారిడార్ నిర్మిస్తారు. ఓడరేవు పోర్టుకు మాత్రం రైలు, రోడ్డు మార్గాలు ఏర్పాటు చేస్తారు. రాజధాని నుంచి చెన్నై, బెంగళూరులకూ రోడ్డు కారిడార్లు ఉంటాయి.
ఆలయాలు.. అనుసంధానం
ఈశాన్యం.. బ్రహ్మస్థానం రోడ్లు.. కనీసం 80 అడుగులు
ఎక్స్‌ప్రెస్‌వేలు.. 8 లేన్ల రోడ్లు
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జాతీయ రహదారులు ఎన్‌హెచ్-9, ఎన్‌హెచ్-22, ఎన్.హెచ్-5లతో పాటు నగరాన్ని అనుసంధానం చేస్తూ ఎక్స్‌ప్రెస్ హైవేలు, సెమీ ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మించాలని నిర్ణయించారు. నగరం మధ్యలో .. 155 కిలో మీటర్ల పొడవున ఆర్టేరియల్ రోడ్లను నిర్మిస్తారు. నగరంలోని అంతర్గత రహదారి మార్గాలను కలుపుతూ 25 కలెక్టర్ రోడ్లు, వాటిని కలుపుతూ 40 పట్టణ రహదారులు, వాటి గుండా 4 లైన్ల రోడ్లను నిర్మిసారు. పట్టణాల్లో వాహన రద్దీ తట్టుకునేలా 50 రహదారులు ఉంటాయి. హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ, ఏలూరు, మచిలీపట్నం, చెన్నై, కర్నూలు, బెంగళూరు జాతీయ రహదారులను 8 లైన్లుగా విస్తరిస్తారు.కృష్ణమ్మ అలలు.. వాటర్ ట్యాక్సీలు కాలుష్యం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో సైకిళ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో కూడా సైకిల్‌పై వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలోనూ.. కృష్ణా నది పొడవునా సైకిళ్లకు ఒక మార్గాన్ని 35 కి.మీ. పొడవుతో నిర్మిస్తారు. పనిచేసే ప్రాంతాలు, నివాసిత ప్రాంతాలు బాగా దగ్గరగా ఉండేలా చూడటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయించారు. మెట్రో.. 135 కిలోమీటర్ల పరుగు
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్య నిర్మాణంపై దాదాపు స్పష్టత వచ్చింది. కృష్ణా నదీ పరీవాహానికి ఇరువైపులా రాజధాని నగరం విస్తరించేలా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. భవిష్యత్ తరాలను ఉద్దేశించి .. ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికలో మార్పులూ చేర్పులూ చేశారు. ఆర్థికాభివృద్ధి కారిడార్లను సింగపూర్ ప్రభుత్వం విస్తరించింది. వాన్‌పిక్ ఇండసి్ట్రయల్ ఏరియాలను యాక్టివేషన్‌లోకి తెచ్చింది. భవిష్యత్ తరాలకు బహుళ ప్రయోజనకారిగా ఉండేలా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు వీలుగా 5 వేల ఎకరాలను తుది మాస్టర్ ప్లాన్‌లో కేటాయించారు. హరిత వనాలు విస్తారంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజధాని నగరంలోనూ.. దానిచుట్టూ దాదాపు 135 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గం ఉండనుంది. నాలుగు కారిడార్లలో మెట్రో రైలు విస్తరించనుంది. ఒక కారిడార్ 35 కిలోమీటర్లు.. మరొక కారిడార్ 34 కిలోమీటర్లు.. ఇంకొక కారిడార్ 32 కిలోమీటర్లు, చివరి కారిడార్ 36 కిలోమీటర్లు ఉండనుంది. దీనిని భవిష్యత్తులో మరింత విస్తరించాలని కూడా ఆలోచనలు ఉన్నాయి. విజయవాడ, ప్రకాశం బ్యారేజీ, తాడేపల్లి నుంచి మూడు మార్గాలు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గాలు రాజధాని నగరం వరకూ కొనసాగనున్నాయి. నగరంలోని దాదాపు ప్రతి ప్రాంతాన్ని కలిపేలా దీనిని రూపొందించారు. అభివృద్ధి ప్రాంతాలను ఏడింటిని గుర్తించింది. రాజధాని నగరాన్ని అనుకుని గుంటూరు, విజయవాడ, మంగళగిరి , తాడేపల్లి, గన్నవరం, గుడివాడలను అభివృద్ధి చేస్తోంది. హెచ్‌ఎ్‌సఆర్, డీఎ్‌ఫసీల కోసం అదనంగా భూములు రిజర్వు చేశారు. గన్నవరం విమానాశ్రయాన్ని ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళగిరి సమీపంలో 5000 ఎకరాల విస్తీర్ణంలో మరొక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు.
|
No comments:
Post a Comment