Wednesday 27 May 2015

టాయ్‌లెట్‌లో కూతురు.. బడిలో కొడుకు !

టాయ్‌లెట్‌లో కూతురు.. బడిలో కొడుకు !
ఆ అపార్ట్‌మెంట్‌లో మూడేళ్లుగా...

చెన్నై, మే 26: తన భార్య ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న కోపంతో వాడు జంతువుకన్నా హీనంగా మారిపోయాడు. భార్యను, తొమ్మిదేళ్ల వయసున్న తన కూతుర్ని మూడేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉంచాడు. ఇంకా హేయమైన విషయం ఏమిటంటే... కూతురిని మాత్రం టాయ్‌లెట్‌లో బంధించి రోజుకు కేవలం రెండంటే రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చాడు. ఆ చిన్నారి ఒంటి మీద దుస్తులు లేవు. పాపం రోజూ దెబ్బలు కూడా. కొడుకుని మాత్రం చక్కగా తయారు చేసి రోజూ బడికి పంపుతున్నాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తెలంగాణ వాసి రామేశ్వర్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకునే సమయానికి ఆ ఇంట్లో కనిపించిన పరిస్థితి ఇది. మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్న అతని భార్య ప్రియాంక (32), తమ పొరుగింటి వ్యక్తి సాయంతో వరంగల్‌లోని తన తల్లిదండ్రులకు కాల్ చేసి ఎట్టకేలకు ఈ నరకం నుంచి బయటపడింది.
 
మగజాతికే మచ్చ తెచ్చేలా ఆ నీచుడు చేసిన ఈ దారుణాన్ని తల్చుకుంటే ఎవరికైనా కడుపు రగిలిపోతుంది. ఈ నరకపు నేపథ్యాన్ని గమనిస్తే....
 
వరంగల్‌కు చెందిన ప్రియాంకకు 2004లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రామేశ్వర్‌తో పెళ్లయింది. కొన్నాళ్లకు ప్రియాంక గర్భవతి కాగానే, స్కాన్ చేయించాడు. ఆమె గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశారు. ప్రియాంక అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత విడాకుల కోసం ఒత్తిడి చేశాడు. అయితే ఫ్యామిలీ కౌన్సిలర్ల జోక్యంతో వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలో ప్రియాంక ఒక అబ్బాయికి కూడా జన్మనిచ్చింది. ఇప్పుడైనా కష్టాలు తగ్గుతాయని ఆమె భావించింది కానీ, పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోయాయి. అందుకు కారణం, రామేశ్వర్ తల్లి, తమ్ముడు కూడా వచ్చి చేరారు.
 
చెన్నైలోని పెరుంగుళత్తూర్ ప్రాంతంలో రామేశ్వర్ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ ప్రియాంక, ఆమె కూతురికి బందీఖానాగా మారిపోయింది. బయటివారితోను, ప్రియాంక తల్లిదండ్రులతోను సంబంధాలు లేకుండా చేశారు. కూతురిని టాయ్‌లెట్‌కు పరిమితం చేసి, రోజుకు రెండు ఇడ్లీలు మాత్రం పెడుతున్నాడు రామేశ్వర్. చివరికి అతికష్టం మీద పొరుగువారి ద్వారా తాంబరం ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌కు ప్రియాంక ఫోన్ చేసి ఈ భూతగృహం నుంచి బయటపడింది. అయితే, ఇంత జరిగినా రామేశ్వర్ మీద ఫిర్యాదు చెయ్యడానికి బదులు, స్వంతూరికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో కలిసుండాలని ప్రియాంక నిర్ణయించుకున్నట్టు సమాచారం. దేశంలో ఎన్ని నిర్భయ చట్టాలు, ఇంకెన్ని పథకాలు ప్రవేశపెట్టినా పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదనడానికి రామేశ్వర్ పెద్ద ఉదాహరణగా మిగిలాడు.

No comments:

Post a Comment