Tuesday 5 May 2015

వాజపేయి భారత రత్నమా?

వాజపేయి భారత రత్నమా?

  • బాబ్రీ విధ్వంసం వెనుక ఆయనా ఉన్నారు
  • ‘నేలను చదును చేస్తాం’ అని తెలిపారు
  • విద్వేషాన్ని విస్తరించిన ఆడ్వాణీకి ‘పద్మ విభూషణ్‌’?
  • పురస్కారాలను తప్పుపట్టిన ఒవైసీ
హైదరాబాద్‌, మే 4: భారత మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు వాజపేయికి భారత రత్న అవార్డు బహూకరించడంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఉప ప్రధాని ఆడ్వాణీని ‘పద్మ విభూషణ్‌’తో సత్కరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఆదివారం రాత్రి జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో అసదుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అయోధ్య అంశంపై వాజపేయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతపరంగా రెచ్చగొట్టేలా మాట్లాడారు. 1992 డిసెంబర్‌ 5వ తేదీన వాజపేయి చేసిన ఆ ప్రసంగం వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. మనం ఈ విషయాన్ని మరిచిపోయామా? నాడు ‘నేలను చదును చేస్తాం’ అని వ్యాఖ్యానించిన వారికి నేడు భారత రత్న ఇచ్చారు’’ అంటూ ఒవైసీ విమర్శించారు. ఆడ్వాణీకి ‘పద్మ విభూషణ్‌’ ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ... ‘‘ఆడ్వాణీ తన రథయాత్రతో దేశమంతా విధ్వంసాన్ని విస్తరించారు. నేర అభియోగాలు (అయోధ్య కేసులో) ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ దేశపు రెండో అత్యున్నత పురస్కారాన్ని ఎలా ఇస్తారు?’’ అని ప్రశ్నించారు. 
 
మరి... లాడెన్‌కు ఇవ్వాలా: బీజేపీ
అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ అంశానికి మతంరంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. ‘‘ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వారికి అవార్డులు ఇవ్వడాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఎందుకంటే... దేశానికి సేవ చేసిన నేతలంటే వాళ్లకు గిట్టదు. చెడు చేసే వారంటేనే వారికి ఇష్టం. బహుశా... వారి దృష్టిలో ఒసామా బిన్‌లాడెన్‌కు గొప్ప అవార్డులు ఇవ్వాలి కాబోలు’’ అని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఎద్దేవా చేశారు. కేవలం మతపరమైన విద్వేషాన్నే రెచ్చగొట్టి జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎదగాలనుకునే వారి వైఖరి ఇలాగే ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు ద్వివేదీ వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment