|
నాలుగో త్రైమాసికంలో 7.5 శాతం వృద్ధి.. వ్యవసాయరంగంలో వృద్ధి ఢమాల్
న్యూఢిల్లీ: సేవలు, ఉత్పత్తి రంగం మెరుగైన ప్రదర్శనతో 2014- 15 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 7.3 శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే ఫిబ్రవరిలో సిఎస్‌ఒ విడుదల చేసిన ముందస్తు అంచనాల కన్నా ఇది 0.1 శాతం తక్కువ. కొత్త సీరిస్ లెక్కల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి భారత్ 6.9 శాతం జిడిపిని నమోదు చేసింది. 2014- 15 సంవత్సరం చివరి త్రైమాసికంలో దేశ జిడిపి 7.5 శాతంగా నమోదయింది. దీంతోపాటు తొలి త్రైమాసిక వృద్ధిని 6.5 నుంచి 6.7 శాతానికి, రెండో త్రైమాసిక వృద్ధిని 8.2 నుంచి 8.4 శాతానికి, మూడో త్రైమాసిక వృద్ధిని 7.5 నుంచి 6.6 శాతానికి సిఎస్‌ఒ సవరించింది. వచ్చే ఆగస్టు 28న ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు జిడిపి అంచనాలను సిఎస్‌ఒ విడుదల చేయనుంది.
జిడిపి విశేషాలు..
పురోగమన దిశగా..
అంతర్జాతీయంగా మందగమన పరిస్థితుల నేపథ్యంలో కూడా భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని, దీన్నిబట్టి దేశీ ఆర్థిక రంగంలో దమ్ములేదన్న విమర్శలు ఉత్తవేనని తేలిపోయాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిందని తాజా గణాంకాలు చాటుతున్నాయని తెలిపారు. ప్రధానంగా ఉత్పత్తి రంగం మంచి వృద్ధిని సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాకు ఈ గణాంకాలు ప్రోత్సాహానిస్తాయన్నారు. వ్యవసాయరంగం, ఎగుమతుల్లో కూడా వృద్ధి మెరుగుపడితే 9 శాతం వృద్ధి సాధించడం కష్టం కాదని పేర్కొన్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడమే వ్యవసాయరంగంలో అల్పవృద్ధికి కారణమన్నారు. తాజా గణాంకాలు ఉద్యోగ కల్పన పెరుగుతోందని సూచిస్తున్నాయని ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మెహర్షి అన్నారు.
వృద్ధి వాస్తవమేనా?..
ఆర్థిక వ్యవస్థలో రికవరీ సంకేతాలు కనపడుతున్నా క్షేత్రస్థాయిలో భారీ సంస్కరణలు తీసుకు రావాలని, వ్యవసాయ రంగం పునరుజ్జీవానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఇండియా ఇంక్ అభిప్రాయపడింది. మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావాలంటే ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకు రావాలని, ఇండసీ్ట్ర ఫ్రెండ్లీ వాతావరణాన్ని నెలకొల్పాలని పిహెచ్‌డి ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిక్కీ, సిఐఐ, అసోచామ్ పేర్కొన్నాయి.
మరోపక్క కొత్త గణాంకాలు స్థూల ఆర్థిక థృక్కోణా న్ని దెబ్బతీస్తాయని, వాస్తవ పరిస్థితులను కానరానీయకుండా చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బిఐ సైతం కొత్తవిధానంతో ఎకానమీ పై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొత్త విధానంలో జిడిపి డేటాను ఫేస్‌వాల్యూగా గణించడాన్ని ఆర్థిక వేత్తలు తప్పుబడుతున్నారు. జిడిపి గణాంకాలు ఎకానమీ బలాన్ని అతిగా పెంచి చూపుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. వృద్ధి రేటు పెంచి చూపుతున్నా, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్నా, వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నా... పెట్టుబడులు పెద్దగా పెరగకపోవడం ప్రస్తుతం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వం చెబుతున్నట్లు బాగాలేవనీ, అందుకే పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారన్నది నిపుణుల మాట.
హమ్మయ్య చైనాను దాటేశాం...
ఒకపక్క కొత్త గణాంకాలపై సర్వత్రా విమర్శలు వినపడుతున్న నేపథ్యంలో నూతన మదింపు పద్ధతిలో చైనా వృద్ధిని దాటేశామని ప్రభుత్వం చెబుతోంది. నాలుగో త్రైమాసికంలో చైనా కేవలం 7 శాతం వృద్ధినే నమోదు చేసింది. భారత్ మాత్రం 7.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో వరుస గా రెండో త్రైమాసికంలో కూడా భారత్ జిడిపిలో చైనాను అధిగమించినట్లయింది.అయితే కొత్త గణాంక పద్ధతిలో వృద్ధిని ఎక్కువ చేసి చూపడం వల్లనే ఈ మాత్రం వృద్ధి నమోదయిందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేవని పలువురు విమర్శకులు హెచ్చరిస్తున్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపు తథ్యం?
దేశ జిడిపి అంచనాలకు అనుగుణంగా వృద్ధి చెందిన నేపథ్యంలో పెట్టుబడుల ప్రవాహం పెరిగేందుకు ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు అన్నీ బాగున్నట్లు కనపడుతున్నా, రుణ లభ్యత తగినంత లేకపోతే పెట్టుబడులు పెరగవని భావిస్తున్న ప్రభుత్వం.. తనవైపు నుంచి వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్‌బిఐపై ఒత్తిడి తెస్తోంది. పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వ వర్గాల ఒత్తిడి నేపథ్యంలో జూన్ 2న రేట్ల కోతకే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. |
No comments:
Post a Comment