Saturday 9 May 2015

ప్రాణం తీసిన ల్యాండ్ పూలింగ్

ప్రాణం తీసిన ల్యాండ్ పూలింగ్

Sakshi | Updated: May 09, 2015 02:08 (IST)
- బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
- ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చిన భూ వివాదమే కారణం

అమరావతి:
 రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన భూ వివాదం ఓ వివాహిత మృతికి కారణమయింది. భూమి పత్రాలు, దానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాల విషయంలో భర్త, సోదరుడి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మనోవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా అమరావతిలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. మంగళగిరి మండలం కురగల్లు గ్రామానికి చెందిన సామ్రాజ్యంతో అమరావతిలోని గోపాల్‌నగర్‌కు చెందిన బైనబోయిన వాసుకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడున్నాడు. వివాహ సమయంలో కట్నకానుకల కింద ఆమెకు పుట్టింటివారు రూ.30 వేల నగదు, 25 సెంట్ల వ్యవసాయ భూమి ఇస్తామన్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ల్యాండ్ పూలింగ్‌లో ఆ 25 సెంట్లను ప్రభుత్వానికి ఇచ్చారు. సామ్రాజ్యానికి తల్లిదండ్రులు లేకపోవటంతో కుటుంబ బాధ్యత వహిస్తున్న ఆమె సోదరుడు అడవి అంజయ్యను వాసు 25 సెంట్ల పొలం, దానికి సంబంధించిన ప్రభుత్వ ప్రయోజనాలను తనకు ఇవ్వాలని అడిగాడు. దీంతో వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం సామ్రాజ్యం తన కొడుకుని కొట్టడంతో ఆమెకు, అత్తకు వాగ్వాదం జరిగింది. దీంతో సామ్రాజ్యం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు, సీఐ హనుమంతరావు కేసు నమోదు చేశారు. మృతదేహనికి శనివారం పోస్టుమార్టం నిర్వహిస్తామని ఎస్‌ఐ వెంకటప్రసాద్ తెలిపారు.

No comments:

Post a Comment