హైదరాబాద్ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర రాజధాని నగరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి రకరకాల ప్రణాళికలు రచిస్తోంది. విదేశీమారకద్రవ్యం ఇబ్బడిముబ్బడిగా రావాలంటే గోల్ఫ్ కోర్స్ నిర్మాణమే మార్గమని తలుస్తోంది. విదేశీయులు నగరానికి వచ్చి గోల్ఫ్ ఆడుకోవడానికి ఏర్పాట్లు చేయడమే కాక.. వారు ఉండటానికి అత్యాధునిక సదుపాయాలతో హోటల్, కాటేజీలు నిర్మించడానికి సిద్ధమైంది. రాజేంద్రనగర్ మండలం బుద్వేలు గుట్టపై టూరిజం డెవల్‌పమెంట్ కార్పోరేషన్‌కు 91 ఎకరాలు ఉండడంతో పాటు టూరిజం డిపార్ట్‌మెంట్‌కు 120 ఎకరాల భూమి ఉంది. దీంతో ఇక్కడ అంతర్జాతీయ పర్యాటకుల కోసం రకరకాల ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ మేరకు తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పేర్వారం రాములు ఇటీవల బుద్వేలు గుట్టను సందర్శించారు. హిమాయత్ సాగర్ నుంచి చల్లటిగాలులు గుట్టమీదకు వీయడంతో ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు, బయటి ఉష్ణోగ్రత కన్నా ఇక్కడ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉందని.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలంటే బుద్వేలు గుట్టే అనువైన ప్రాంతమని ఆయన గుర్తించారు. రూ.200 కోట్ల నిధులతో దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు తయారుచేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
అంతర్జాతీయ ప్రమాణాలతో 21 హోల్స్‌తో గోల్ఫ్ కోర్స్ నిర్మించాలంటే 180 ఎకరాలు స్థలం ఉండాలి. ఇక్కడ తగినంత భూమి ఉండడం ఉండడం కలిసివచ్చే అంశంగా మారింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుద్వేలు గుట్టకు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అలాగే, విదేశీయలు సౌకర్యవంతంగా బస చేసేందుకు 7 స్టార్ హోటల్‌ను పలు కాటేజీలను నిర్మిస్తారు. హెల్త్ స్పా, కాసినో వంటి సౌకర్యాలు సహా బోటింగ్‌ను అభివృద్ధి చేస్తారు. బుద్వేలు గుట్టలో ఓ భాగాన్ని లోకల్ బిల్డర్లు తవ్వి రాళ్లను అమ్మేశారు. దీనివల్ల 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఏర్పడింది. అలా బిల్డర్ల వల్ల కలిగిన నష్టాన్ని లాభంగా మార్చే ప్రయత్నం చేయనున్నారు. ఇందుకోసం చెరువు చుట్టూ రహదారులు ఏర్పాటు చేసి, లైటింగ్, లాన్లు ఏర్పాటు చేస్తారు. హరితహారంలో భాగంగా మొక్కలను పెంచుతారు. ఇక స్థానికుల కోసం వివిధ హంగులతో రూ.100 కోట్లతో థీమ్ పార్క్‌ని సిద్ధం చేస్తారు. ఈ పార్క్‌ని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలోని హెద్వాయ్ కాటేజీ పక్కన 250 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. దీనిని అభివృద్ధి చేయడానికి భూమిని సమర్థమైన సంస్థకు 33 ఏళ్లకు లీజుకు ఇస్తారు. ఆ తర్వాత ప్రాజెక్టు టూరిజం డిపార్ట్‌మెంట్ దీన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు కిలోమీటర్ దూరంలోనే ఉండడంతోపాటు.. సెంట్రల్ ఫైనాన్స్ డిసి్ట్రక్ట్ అయిన నానక్‌రాంగూడ 10 కిలోమీటర్ల దూరంలో ఉండడం సందర్శనకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు
No comments:
Post a Comment