Tuesday, 26 May 2015

మోదీ పాలనలో అంబానీ డౌన్

మోదీ పాలనలో అంబానీ డౌన్

ముంబై: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో స్టాక్‌ మార్కెట్లు పలు విశేషాలకు నెలవయ్యాయి. ఈ సంవత్సర కాలంలో స్టాక్‌ మార్కెట్లో మదుపరుల సంపద 10 లక్షల కోట్ల రూపాయలను దాటింది. మార్కెట్లు ఈ స్థాయిలో ఉప్పొంగి కదం తొక్కినా, దేశంలో నెంబ ర్‌వన్‌ కుబేర కుటుంబం- అంబానీలకు చెందిన కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ మాత్రం క్షీణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో గుజరాత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ ఆధ్వర్యంలోని అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ అసాధారణ స్థాయిలో పెరిగింది. అదానీలు ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే.
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీ వచ్చినప్పుడు మోదీ ఉపయోగించిన ప్రైవేట్‌ జెట్‌ అదానీలదే. అయితే అదానీ కంపెనీల సంపద, షేర్ల ధరల వృద్ధికి మోదీతో లింక్‌ పెట్టడం సరికాదనే వర్గాలూ ఉన్నాయి. అదానీతో పాటు టాటాలు, భారతి, సన్‌గ్రూప్‌ కంపెనీల షేర్లు కూడా ఈ ఏడాది కాలంలో భారీ లాభాలను నమోదు చేసాయి. అంబానీల కంపెనీలతో పాటు ఐటిసి, వేదాంత, ఎల్‌ అండ్‌ టి కంపెనీలు మాత్రం ప్రతికూలతను చవిచూశాయి. ఏడాది పాలన మధ్యలో రమారమి 30 శాతం లాభపడి జీవితకాల గరిష్ఠస్థాయిలను తాకిన సూచీలు సరిగ్గా ఏడాది పూర్తయ్యేసరికి కేవలం 12 శాతం లాభంతో సరిపెట్టుకున్నాయి.
విరుపులు...
-   ఏడాది కాలంలో ముకేశ్‌ అంబానీ సారధ్యంలోని రిలయన్స్‌ ఇండసీ్ట్రస్‌ గ్రూప్‌ మార్కెట్‌ విలువ 80,000 కోట్ల రూపా యల మేర క్షీణించి 2.9 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఈ సంవత్సరంలో ఆర్‌ఐఎల్‌ షేరు ధర దాదాపు 20 శాతం పతనం కావడం గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌పై ప్రభావం చూపింది.
- అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌ మార్కెట్‌ విలువ 50,000 కోట్ల రూపాయల మేర క్షీణించింది. మొత్తం మీద అన్నదమ్ముల కంపెనీల క్యాపిటలైజేషన్‌ సుమారు 1.3 లక్షల కోట్ల రూపాయల మేర పతనమైంది.
 
- అనిల్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలోని వేదాంత గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ 20000 కోట్ల రూపాయలు, ఐటిసి మార్కెట్‌ క్యాప్‌ 20,000 కోట్ల రూపాయలు, ఎల్‌ అండ్‌ టి మార్కెట్‌ విలువ 2,000 కోట్ల రూపాయల మేర క్షీణించింది.
 
మెరుపులు... 
- ఏడాది కాలంలో టాటా గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 1.10 లక్షల కోట్ల రూపాయల మేర వృద్ధి చెందింది. కేవలం ఒక్క టిసిఎస్‌ మార్కెట్‌ విలువ 85,000 కోట్ల రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ 8.4 లక్షల కోట్ల రూపాయల పైమాటే.
 
- హెచ్‌డిఎఫ్‌సి, సన్‌ గ్రూప్‌ మార్కెట్‌ విలువ లక్ష కోట్ల రూపాయల మేర వృద్ధి చెందింది. ఇదే సమయంలో సునీల్‌ మిట్టల్‌కు చెందిన భారతి గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ 60,000 కోట్ల రూపాయల మేర పెరిగింది.
 
- లాభాలనార్జించిన వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అదానీ గ్రూప్‌ గురించి. ఈ గ్రూప్‌లో ఉన్న మూడు కంపెనీల్లో అదానీ పవర్‌ షేర్‌ విలువ తగ్గినా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కంపెనీల షేర్లు భారీగా లాభాలనార్జించడంతో ఈ గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ 50,000 కోట్ల రూపాయల మేర పెరిగింది.
- కుమార మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కీలక కంపెనీ హిండాల్కో మార్కెట్‌ క్యాప్‌ క్షీణించినా, మొత్తం గ్రూప్‌ మార్కెట్‌ విలువ 40,000 కోట్ల రూపాయల మేర పెరగడం విశేషం.

No comments:

Post a Comment