|
విజయవాడ, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘జూన్ 2 నుంచి వారానికి మూడు రోజులు విజయవాడలోనే మకాం. ఇక్కడినుంచే పాలన. దీనికి తగ్గట్లు సీఎం క్యాంపు కార్యాలయాన్ని తీర్చిదిద్దాలి.’’ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలివి. అయితే తాత్కాలిక రాజధాని విజయవాడలో మాత్రం ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరగడంలేదు. ఇక్కడ సీఎం క్యాంపు కార్యాలయ పనులు నత్తనడకన నడుస్తున్నాయి.
ఎంత లేదన్నా మరో నెల రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఈ కార్యాలయాన్ని పరిశీలించి సీఎం భద్రతా విభాగపు అధికారులు ఇదే నిర్ణయానికి వచ్చారు. విజయవాడనుంచి పాలన సాగించాలంటే.. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం, అధికారులతో సమీక్షలు నిర్వహించే హాలు, మీడియాతో మాట్లాడేందుకు కాన్ఫరెన్స్ హాలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యేందుకు మరో హాలు, సాధారణ ప్రజలను కలుసుకునేందుకు చాంబర్‌తోపాటు ఆయన పేషీ ముందుగా సిద్ధం కావాల్సి ఉంది.
అయితే ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగడం లేదు. మే 25 నాటికి తన కార్యాలయ పనులు పూర్తి కావాలంటూ ఇటీవల విజయవాడ వచ్చిన సందర్భంలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాను జూన్ 2నుంచి వారానికి మూడు రోజులు విజయవాడలోనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే.. అందుకు తగిన విధంగా కార్యాలయ పనులు జరగటం లేదని భద్రతాధికారులు భావిస్తున్నారు.
ఇదే అంశాన్ని హైదరాబాద్‌లోని సీఎంవో అధికారులకూ సమాచారమివ్వాలని నిర్ణయించుకున్నారు.
లిఫ్ట్‌కు ఫౌండేషన్ మాత్రమే కార్యాలయంలో సీఎం పైకి,కిందకి తిరిగేందుకు లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలని భద్రతాధికారులు సూచించారు. కార్యాలయంలో లిఫ్ట్‌కు ఇప్పటి వరకు ఫౌండేషన్ మాత్రమే వేశారు. నేటి వరకు లిఫ్ట్‌కు ఆర్డర్ కూడా ఇవ్వలేదు. ఆర్డరు ఇచ్చిన తర్వాత లిఫ్ట్ ఏర్పాటు కావాలంటే కనీసం నెల సమయం పడుతుంది.
ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయానికి రెండు వైపులా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులను అమర్చాలని భద్రతాధికారులు సూచించారు. నేటి వరకు ఈ గ్లాసులను అమర్చలేదు. అసలు ఇంతవరకు ఈ బుల్లెట్ ప్రూఫ్ అద్దాల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వలేదంటే పనుల వేగాన్ని అర్థం చేసుకోవచ్చు.
సీఎంవో కార్యాలయం కోసం ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. కానీ నేటి వరకు ఆ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పనులు వేగంగా జరగకపోవడానికి నిధుల కొరత ఏమన్నా కారణమా అంటే అదీ లేదు. 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న సీఎంఏర్పాట్ల కోసం రూ.10.30 కోట్ల నిధులను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. డబ్బు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కొన్ని రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి బస కూడా సీఎంవోలో ఉండే అవకాశముంది. దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా జరగాల్సి ఉంది. వాస్తవానికి.. సీఎం కోసం విజయవాడలో ఎన్‌ఆర్‌ఐలకు చెందిన నాలుగు గృహాలను పరిశీలించారు. అయితే వాటిని భద్రతా ఏర్పాట్లకు అనుగుణంగా తీర్చిదిద్దిన తరువాతనే చంద్రబాబు అక్కడి వెళ్లే అవకాశం ఉంది. అప్పటి వరకు ఆయన సీఎంవో లో తాత్కాలికంగా బస చేయనున్నారు. అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సీఎంవోలోనే చంద్రబాబు తాత్కాలిక విడిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
|
No comments:
Post a Comment