Thursday 14 May 2015

ఇదే ప్రజాస్వామ్యమైతే నియంతృత్వమేల?

ఇదే ప్రజాస్వామ్యమైతే నియంతృత్వమేల? (13-May-2015)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై హైకోర్టు ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసును కొట్టివేసి నప్పుడు ఆమెను అభినందించిన తొలి ప్రముఖుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకరు కావడంలో ఆశ్చర్యంలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అవినీతి కేసు నుంచి బయటపడితే ఒక ప్రధాని అభినందించడం ఎటువంటి సంకేతాలను అంది స్తుంది? అన్న ప్రశ్నకు ఆస్కారం లేదు. రాజకీయాల్లో రాజకీయ అవసరాలే కానీ నేతల నేర చరిత్ర రాజకీయ సంబంధాలను నిర్ణయించదు. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల రాజకీయాలు కూడా నేతల నేరచరిత్రకు పెద్ద ప్రాధాన్యత నిచ్చినట్లు కనపడదు. ‘ప్రజాస్వామ్యం మన కణకణాల్లో ఉంది.. మనకు నియంతృత్వం అవసరం లేదు..’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల టైమ్స్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊరికే అనలేదు. ఈ దేశంలో ఎటు వంటి ప్రజాస్వామ్యం అమలులో ఉన్నదో మోదీకి తెలియనిది కాదు. జయలలిత అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్నప్పుడు ప్రజల నిరసన వీధుల్లో పొంగింది. ఆత్యహత్యకు పాల్పడిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడామెపై హైకోర్టు కేసు కొట్టి వేసిన తర్వాత వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అన్నాడీఎంకేకు చెందిన 48 మంది ఎంపీలు సోమవారం పోటాపోటీగా పార్లమెంట్‌లో స్వీట్లు పంచిపెట్టారు. ఎవరైనా పంచిపెట్టకపోతే మేడమ్‌కు తెలుస్తుందని భయపడిన వారు కూడా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో బయట పడినందుకు జయలలిత మహదానందంతో ఉన్నారని, త్వరలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే కాక, ఆరునెలల ముందే ఎన్నికలు జరిపి అఖండ విజయం సాధించే ఆలోచనలో ఉన్నారని పార్టీ ఎంపీలు చెబుతున్నారు. జనం కూడా నిజంగా జయలలితకు భారీ మెజారిటీతో పట్టం కడతారనడంలో అతిశయోక్తి లేదు. వారికి నాయకుల నేర చరిత్రతో కానీ, ఆ నేతల వందిమాగధుల బానిస వైఖరితో కానీ ఏమి సంబంధం? మోదీ అన్నట్లు ఇదే ప్రజాస్వామ్యం చలామణిలో ఉంటే ఇక నియంతృత్వం ప్రయోగించాల్సిన అవసరం ఎందుకుంటుంది?
 
ఇంతకీ జయలలిత నేరం చేయలేదా? అక్రమంగా ఆస్తు లను సంపాదించలేదా? ఆమె కేవలం ఆదాయానికి మించి రూ.66 కోట్ల మేరకే ఆస్తులు సంపాదించారా? అన్న ప్రశ్నలు అప్రస్తుతం. ఎందుకంటే కోర్టు కేవలం తెలిసిన మార్గాల ద్వారానే సంపాదించిన ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. తెలియని మార్గాల గురించి ఎప్పుడూ తెలిసే అవకాశాలు లేవు. తెలిసిన మార్గాల ద్వారా అక్రమంగా సంపాదించిన రూ.66 కోట్ల లెక్కల విషయంలో కూడా గౌరవనీయ న్యాయమూర్తులు విభేదించారు. వారే ఆడిటర్ల యిపోయారు. ‘సెషన్స్‌ కోర్టు చేసింది తప్పుడులెక్కలు.. వారు పెళ్లి ఖర్చుల్ని, నిర్మాణ ఖర్చుల్ని ఎక్కువచేసి చూపారు. అప్పుల్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు..’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కుమారస్వామి తన తీర్పులో చెప్పారు. చివరకు ఆదాయానికి మించి ఆమె సంపాదించింది కేవలం 8.12 శాతం మాత్రమే. ఇలాంటి సంపాదన పదిశాతం కంటే తక్కువుంటే నిందితుల్ని వదిలిపెట్టవచ్చని తేల్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ లాంటి రాషా్ట్రల్లో అయితే ఆదాయానికి మించి 20 శాతం ఆస్తుల్ని సంపాదించినా తప్పు కాదుని ప్రకటించి జయలలితను నిర్దోషిగా తేల్చేశారు. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తే తప్పుడు లెక్కలు చేశారని వార్తలు వస్తున్నాయి. కానీ తాంబూలాలిచ్చాక తన్నుకు చావడం తప్ప చేయగలిగిందేముంది?
 
విచిత్రమేమంటే న్యాయమూర్తి ఈ తీర్పును రిజర్వు చేసిన తర్వాత పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించారు. అంతకు ముందు తనకు అనుకూలుడైన భవానీసింగ్‌ అనే వ్యక్తిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కొనసాగించే విషయంపై జయలలిత సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. భవానీ సింగ్‌ నియామకం చెల్లనేరదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కొత్త ప్రాసి క్యూటర్‌ను నియమించేలోపే న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. అలాంటప్పుడు ఆయనను నియమించి లాభం ఏముంది? సుప్రీంకోర్టు తీర్పుకు విలువ ఏముంది? ఒకదశలో ఆమె తనకు అనుకూలుడైన ట్రయల్‌కోర్టు జడ్జి పదవీ కాలాన్ని పొడిగించేందుకు కూడా ప్రయత్నించారు. 1996 నుంచి ఆమెపై సాగుతున్న కేసులను నీరుకార్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. వాజపేయి హయాంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న తంబిదురై ఆమె కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టులను రద్దు చేశారు. ఆయనిప్పుడు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌!
 
న్యాయపరంగా, రాజకీయ పరంగా ఎన్నో ఒడిదుడుకు లెదుర్కున్నప్పటికీ జయలలిత తమిళనాడులో ప్రబలమైన శక్తిగా నిలిచారంటే దాన్ని ప్రజాస్వామ్య వైరుధ్యంగా భావించ వచ్చేమో కానీ మోదీకి ఈ వైరుధ్యంతో పనిలేదు. ఆయనకు రాజ్యసభలో బీజేపీ మైనారిటీలో ఉన్నందువల్ల కీలక బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అన్నాడీఎంకే మద్దతు అవసరం అన్న వాస్తవంతో మాత్రమే సంబంధం. నిజానికి మోదీయే ప్రజాస్వామ్యంలో ఒక వైరుధ్యం అని చెప్పకతప్పదు. గుజరాత్‌లో ఎన్ని ఆరోపణలకు గురైనప్పటికీ నాలుగు సార్లు విజయం సాధించడమే కాక ఢిల్లీలో ఆయన సారథ్యంలో బీజేపీ అఖండ మెజారిటీ సాధించి, ఆయన ప్రధాని కావడమే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులకు నిదర్శనం.జయలలిత విషయంలోనే కాక మమతాబెనర్జీ విషయంలో కూడా నరేంద్రమోదీ ఎంతో స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో కీలకమైన సామాజిక భద్రతా కార్యక్రమాలను ప్రారంభించే విషయంలో ఏ ప్రధానమంత్రి అయినా తన స్వంత నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తారు. కానీ ఆయన గత వారం వారణాసిలో సామాజిక భద్రతా కార్యక్రమాలను ప్రారంభించే బాధ్యత తన మంత్రివర్గ సహచరుడు
వెంకయ్యనాయుడుకు వదిలిపెట్టి, తాను కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ మోదీ, మమతా బెనర్జీల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయతానుబంధం అంతా ఇంతాకాదు. ఒకప్పుడు ఇరువురూ ఘోరంగా పరస్పరం దూషించుకున్న వారే. కానీ వేలాది మధ్యతరగతి జీవితాలతో చెలగాటమాడిన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో పలువురు తృణమూల్‌ పెద్దలు నిందితులైన నేపథ్యంలో మమతకు మోదీ అవసరం తెలిసివచ్చింది. ఈ చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ వేడి పెరుగుతున్న తరుణంలోనే ఆమె మోదీకి స్నేహహస్తం చాచారు. ఢిల్లీకి వచ్చి ప్రధానిని కలుసుకున్నారు. ఆ తర్వాతే రాజ్యసభలో కీలకమైన బిల్లులను తృణమూల్‌ సహకారంతో మోదీ సర్కార్‌ ఆమోదింప చేయగలిగింది. విచిత్రమేమంటే జయలలిత మాదిరే మమతా బెనర్జీపై ఉన్న ఆరోపణలను కూడా ప్రజలు పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించింది. బలమైన ప్రాంతీయ పార్టీల నేతలుంటే వారితో ఢీకొనడం బదులు స్నేహసంబంధాలు పెంచుకోవడమే మంచిదన్నది ప్రస్తుతం మోదీ విధానంగా మారింది. పైగా వారు ఇబ్బందుల్లో ఉండి తన శరణుజొచ్చితే తన ఎజెండా అమలు చేసేందుకు వారిని ఉపయోగించుకునే వీలుండగా వారి రాషా్ట్రల్లో లేని ఉనికికోసం పోరాడడం దేనికి? అని మోదీ గ్రహించినట్లున్నారు. ఈ రెండు పార్టీల విషయంలోనే కాదు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీలన్నిటి విషయంలోనూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలన్నది మోదీ విధానంగా కనిపిస్తున్నది. ఇటీవల ఒక ప్రాంతీయ పార్టీ నేత కూతురు వచ్చి తనతో మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ దిగితే మోదీ సంతోషించకుండా ఎలా ఉండగలరు?
 
నిజానికి తృణమూల్‌, అన్నాడీఎంకే వంటి రెండు బలమైన పార్టీలతో కేంద్రంలో మోదీ సర్కార్‌కు సత్సంబంధాలు ఏర్పడి నప్పటి నుంచీ పార్లమెంట్‌లో రాజకీయ సమీకరణలు మారి నట్లు కనిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన బిల్లులన్నీ ఎడా పెడా ఆమోదం పొందుతున్నాయి. ఒకేరోజు రెండు, మూడు బిల్లులు కూడా ఆమోదంపొందిన సందర్భాలున్నాయి. పార్ల మెంట్‌లో కాంగ్రెస్‌ నిరసన కేవలం నామమాత్రంగా, అసహ జంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అనుకున్న బిల్లులన్నీ ఆమోదం పొందగా, కేవలం భూసేకరణ బిల్లు, జీఎస్‌టీ బిల్లు మాత్రమే మిగిలాయి. జీఎస్‌టీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో సెలెక్ట్‌ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అంగీకరించింది. ఎలాగూ ఏప్రిల్‌ 2016 వరకు సమయం ఉన్నందువల్ల తమ నిరసనకు విలువ ఇచ్చి సెలెక్ట్‌ కమిటీకి పంపమని ప్రధాన ప్రతిపక్షమే అభ్యర్థిస్తే ప్రభుత్వం అంగీకరించకుండా ఎలా ఉంటుంది? భూసేకరణ బిల్లును సంయుక్త కమిటీకి నివేదించడం కూడా వ్యూహాత్మ కమే. ఈ కమిటీలో అత్యధికులు బీజేపీ, మిత్రపక్షాల సభ్యులే ఉంటారు కనుక ఈకమిటీ బిల్లును ఆమోదించేందుకే అధిక అవకాశాలున్నాయి. ’ప్రతిపక్షాల నిరసన గురించి పత్రికల్లో ఎక్కువ వార్తలు వస్తేనేమిటి? చివరకు మన ఎజెండా సాధిం చామా లేదా అన్నదే ముఖ్యం. అది కార్యసాధకుల లక్షణం..’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య అన్నారు.
 
రాజకీయ అవసరాల కోసం, పార్లమెంట్‌లో ఎజెండాను అమలుచేయడం కోసం వివిధ పార్టీలతో సంబంధాలు పెట్టుకోవడం ప్రభుత్వానికి అవసరమే కావచ్చు. గతంలో అణు బిల్లును ఆమోదింపచేసుకునేందుకు, పార్లమెంట్‌లో విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు యూపీఏ సర్కార్‌ కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించించింది. కానీ రాజకీయ అవసరాలు దేశంలో నేతల అవినీతికి, అక్రమాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయా? న్యాయవ్యవస్థ కూడా రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నదా? కీలక నేరాలకు సంబంధించి కేసులు కొట్టి వేయడం అన్నది సహజ న్యాయసూత్రం ప్రకారం జరిగిందని నిజాయితీగా చెప్పగలిగే పరిస్థితి ఉన్నదా? ప్రజా స్వామ్యం, న్యాయవ్యవస్థ ఇప్పుడున్న రీతిలోనే ఉంటే మోదీకైనా ఎవరికైనా నియంతృత్వం అవసరం ఎందుకుంటుంది?
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

No comments:

Post a Comment