Thursday, 28 May 2015

కొండవీటి వాగుపై అధికారుల అధ్యయనం

కొండవీటి వాగుపై అధికారుల అధ్యయనం

  • 430 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే
  • క్యాచ్‌మెంట్‌ ఏరియాలో రెయిన్‌ఫాల్‌ డేటా సేకరణ 

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
కొండవీడు వాగుపై సమగ్ర సర్వే చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. సింగపూర్‌ ప్రభుత్వ మాస్టర్‌ ప్లాన్‌ ఈ మేరకు సూచించింది. కొండవీడు వాగుకు సంబంధించి పూర్తిస్థాయి ఇన్‌పుట్‌ డేటాను ఇవ్వలేకపోవటంతో దీనిపై ప్రత్యేక అధ్యయనం చేయాలని మాస్టర్‌ప్లాన్‌లో సూచించింది. కొండవీడు వాగు నీటిని రాజధాని అవసరాలకు వినియోగించుకునేలా రెండు రిజర్వాయర్లను ఏర్పాటు చేయడంతో పాటు రాజధాని ప్రాంతానికి దెబ్బ తగలకుండా లో లెవలింగ్‌ ప్రాంతంలో మెరక చేయాలని సింగపూర్‌ ప్రభుత్వం సూచించింది. వాగు ముంపును సమర్థంగా ఎదుర్కోవాలంటే సమగ్ర అధ్యయనం అవసరమని పేర్కొంది. రాజధాని నిర్మాణానికి ముందుగానే కొండవీడు వాగుపై సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 430 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న కొండవీడు వాగును అధ్యయనం చేసేందుకు కన్సల్‌టెంట్స్‌ను నియమించనుంది. సీఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ విభాగం కూడా ఈ వాగుపై అధ్యయనం చేస్తుంది. రెయిన్‌ ఫాల్‌ డేటా తప్పనిసరి కావడంతో దీనిపై దృష్టి సారించనున్నారు. దీనితో పాటు వరదను కూడా అంచనా వేస్తారు. ప్రస్తుతం కొండవీడు క్యాచ్‌మెంట్‌ ఏరియాను పరిశీలిస్తే లాం దగ్గరకు ఒక టీఎంసీ వరద నీరు వస్తుంది. నీరుకొండ దగ్గరకు 0.8 టీఎంసీల వరద వస్తుంది. కృష్ణాయపాలెం దగ్గరకు మొత్తంగా 3.50 టీఎంసీల వరద వస్తోంది. ఈ వరద నీరు మూడు టీఎంసీలు వర్షం ద్వారా, 0.50 టీఎంసీల నీరు ఇతర రూపాల్లో వస్తోంది. ఇది సగటు అంచనా మాత్రమే. సమగ్ర అధ్య యనం ద్వారా వాస్తవ లెక్కలు తెలుస్తాయి.
 
వాగు మెరకకు రూ.1500 కోట్లు? 
కొండవీడు వాగు ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టవలసి ఉంది. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు రాకుండా దాదాపు పది వేల ఎకరాలను మెరక చేయాల్సి ఉంటుంది. మెరక చేయటానికి రూ. 1500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

No comments:

Post a Comment