Wednesday 13 May 2015

అమ్మాయా? అయితే తరలించేద్దాం.

అమ్మాయా? అయితే తరలించేద్దాం.. అక్రమ రవాణా అడ్డాగా హైదరాబాద్
నాగరిక సమాజాన్ని అనేక జాడ్యాలు వెక్కిరిస్తున్నాయి. శాస్త్ర, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మనిషి పయనం ఎటో అర్థం కాని పరిస్థితి. ఆధునిక యుగంలో సైతం మనుషులను అమ్మే కుహనా సంస్క ృతి పెచ్చుమీరుతోంది. ఆడపిల్లల అక్రమ రవాణా నేటి సమాజానికి ఓ పెను సవాల్‌గా పరిణమిస్తోంది.
 
అమాయకత్వం, పేదరికంలో మగ్గే ఆడపిల్లలనే లక్ష్యంగా చేసుకొని లొంగదీసుకుంటున్నారు కొందరు మాయగాళ్లు. ఆ పై వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే ఇలాంటి నేరాలకు నగరం కేంద్రమవుతోంది. అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడే ముఠాల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. - ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ 
 
రెండు నెలల క్రితం నగరంలోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడిలో ఓ పదహారేళ్ల అమ్మాయి పట్టుపడింది. ఆ అమ్మాయిని న్యాయస్థానం ఆదేశాల మేరకు స్వచ్ఛంద సంస్థ నిర్వహించే వసతిగృహంలో ఉంచారు. ఆమె పూర్వాపరాలు పరిశీలిస్తే పేదరికం వల్ల అమ్మాయిని చదివించలేక తల్లిదండ్రులు ఒంగోలు దగ్గర ఓ సంక్షేమ వసతిగృహంలో ఉంచి చదివిస్తున్నారు.
 
అమ్మాయి వసతిగృహం నుండి పాఠశాలకు వెళుతున్న మార్గమధ్యలో ఓ నలభై ఏళ్ల ఆవిడ ప్రేమగా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంది. నేను చెప్పినట్టు వింటే నీవు ఇంకా మంచి బట్టలు కొనుక్కోవచ్చు..అంటూ మాయమాటలు చెప్పి గుంటూరుకు చెందిన ఓ వ్యభిచార ముఠా దగ్గరకు పంపించింది. వారు అమ్మాయిని నగరానికి తీసుకొచ్చి...ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచారు. ఈ విషయాలన్నీ ఆ అమ్మాయే స్వయంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో తెలిపింది.. పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ ముఠా సభ్యులపై ఫిర్యాదు చేద్దామని పోలీస్‌ స్టేషన్‌కు వెళితే అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు కానీ ముఠా సభ్యులపై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం.
 
డబ్బు ఆశ చూపి 11 నుండి 16 ఏళ్లలోపు ఆడపిల్లలకు మాయమాటలు చెబుతారు. బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అని ఆశలు కల్పిస్తారు. ఆ తరాత అక్కడ నుండి 60 వేల నుండి లక్ష రూపాయల వరకూ అమ్మాయిని వ్యభిచార ముఠాలకు లేక వ్యభిచార గృహానికో అమ్మేస్తారు. నలభై వేలు నుండి యాభైవేలవరకూ ఆమెకు ముట్టచెబుతారు.. ఆ తరాత అమ్మాయిని నగరానికి తీసుకొచ్చి అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌ లో దుకాణం తెరుస్తారు. లేదంటే అడ్డామీదకు పంపిస్తారు. మొదటి నెలలోనే సుమారు 200నుండి 250 మంది విటులను పంపి సుమారు 6లక్షలవరకూ అమ్మాయి శరీరంతో వ్యాపారం చేస్తారు.. ఆ తర్వాత ఇక అమ్మాయిని వ్యాపారానికనుగుణంగా వివిధ ప్రాంతాలకు తిప్పుతారు. పోలీసులు దాడిచేస్తే అందులో అమ్మాయిని అరెస్టు చేస్తారు. లేకపోతే టింప్ప్‌(తార్పుడుగాళ్లు)ను అదుపులోకి తీసుకుంటారు. అంతేకానీ ముఠా సభ్యుల జోలికి మాత్రం పోరు. కారనం వారికి పెద్దల అండదండలు భారీగానే ఉంటాయి కనుక అని చెబుతున్నారు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ సామాజిక కార్యకర్త.
 
సమస్యల్లో ఉన్న అమ్మాయిలే లక్ష్యంగా
నగరంలో అమ్మాయిల అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. ఖచ్చితమైన నిఘావ్యవస్థ లేకపోవడంతో నేరగాళ్లు ఇష్టారాజ్యంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. హైదరాబాద్‌లో సుమారు 130 అక్రమ రవాణా ముఠాలు తిష్టవేసుకొని ఉన్నట్టు అంచనా. గత పదేళ్లగా ఈ సంఖ్య పెరగలేదు. తగ్గలేదు కూడా. రాష్ట్ర స్థాయి, జిల్లా, మండల స్థాయి వరకూ వీరి మనుషులు కాపుకాచుకొని ఉంటారు. అమాయకత్వం, పేదరికం, కుటుంబ సమస్యల్లో ఉన్న ఆడపిల్లల కోసం గాలిస్తారు.
 
అదును చూసి వలపన్నుతారు. ప్రేమగా, వారి మంచి కోరే వ్యక్తులుగా నటిస్తారు. అరచేతిలో స్వర్గాన్ని చూపెడతారు. మాయమాటలు చెప్పి లొంగదీసుకుంటారు. ఆ పై అమ్మేస్తారు. అనంతపురం, చిత్తూరు లోని కొన్ని మండలాలు, మదనపల్లె, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలు, కరీంనగర్‌, నల్గొండ, మొహబూబ్‌ నగర్‌ జిల్లాల్లోని కరువు ప్రాంతాల్లో ట్రాఫికింగ్‌ ముఠాన్నీ వేళ్లూనుకొనున్నాయి. అక్కడ నుండి తీసుకొచ్చిన అమ్మాయిలతో నగరంలో వ్యాపారం చేస్తారు. బలవంతంగా నెట్టివేయడం, పరిస్థితుల ప్రతికూలతను చూపి ఒప్పించడం వంటి పద్ధతుల ద్వారా ఆడవాళ్లను, అభం శుభం తెలియని ఆడపిల్లలను ఈ రొంపిలోకి దించుతారు.
 
నిఘా ఎక్కడ?
నగరంలో రోజుకు ఎంత మంది ట్రాఫికింగ్‌కు గురవుతున్నారన్న సమాచారం పోలీస్‌ వ్యవస్థ వద్ద కూడా లేదు. నిరుడు దేశ వ్యాపితంగా 20, 000వేల మంది చిన్నారులు కనిపించకుండా పోయినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 56 శాతం మంది 11 నుండి 16 ఏళ్లలోపు అమ్మాయిలే ఉన్నారు. అందులో కేవలం 7వేల మంది పిల్లల ఆచూకీ మాత్రమే తెలిసింది. మిగతా 63 శాతం మంది పిల్లల గురించి నూలుపోగు ఆధారం కూడా లభించలేదు. ఏటా భారత్‌లో కనపడకుండాపోతున్న పిల్లల సంఖ్య 60, 000వేలకు పైనే ఉంటుంది. చాలా వరకూ ఇవి పోలీస్‌ రికార్డులకు ఎక్కడం లేదని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
 
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రలకు సంబంధించిన మొత్తం 3 లక్షల నలభై వేల మంది ఆడపిల్లలు కలకత్తా, పూనె, బొంబాయివంటి ప్రాంతాల్లోని వ్యభిచార కూపాల్లో మగ్గుతున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కనిపించకుండా పోతున్న ఆడపిల్లల్లో 95శాతం మంది వేశ్యావృత్తిలోకి నెట్టివేయబడుతున్నారు. ఇవికాక నగరానికి వచ్చే అమ్మాయిలు, ఇంటి నుండి పారిపోయి వచిన ఆడపిల్లలను ఈ వృత్తిలో దింపేందుకు రైల్వే స్టేషన్ల దగ్గర కాపు కాచుకొనుంటారు ఈ ముఠా సభ్యులు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తావని, పనిఇప్పిస్తామని రకరకాల మాయమాటలు చెప్పి ఈ వృత్తిలోకి దించుతారు. .ప్రేమించి పెళ్లిచేసుకొని ఆ తర్వాత బ్రోతల్‌ హౌస్‌కు అమ్మడం వంటి నేరాలాకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. గత ఐదేళ్లతో పోలిస్తే ఇలాంటి నేరాలు ఇప్పుడు చాలా వరకూ తగ్గాయి. బలవంతంగా ఒప్పించి ఈ వృత్తిలోకి దించుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి అంటున్నారు చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలు జయమ్మ.
 
పెద్దల అండదండలతో
నగరంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ముఠాదే హవా. గుంటూరు, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అమ్మాయిలకు అడ్డా అమీర్‌పేట్‌. ఈ ప్రాంతంలో సుమారు పదిహేను ముఠాలు ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థల అంచనా. అనంతపురం, కపడ, చిత్తూరు జిల్లాలకు చెందిన మహిళలకు కుకట్‌పల్లి, కరీంనగర్‌, వరంగల్‌, మొహబూబ్‌ నగర్‌కు చెందినవారు సికింద్రాబాద్‌, నల్గొండ, శ్రీకాకుళం, గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు దిల్‌సుఖ్‌నగర్‌ ఆలా ఒక్కో ఏరియాలో ఒక్కో ప్రాంతానికి సంబంధించిన ముఠా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ముఠాల మధ్య సఖ్యత కూడా బాగా ఉంటుందట. వీటిల్లో కూడా పెద్ద ముఠాలు, చిన్న ముఠాలు అని ఉన్నాయి పెద్ద ముఠాలకు రాజకీయ పలుకుబడి బాగా ఉంటుంది. పోలీసులు సైతం వీరి జోలికి వెళ్లాలంటే భయపడతారు. చిన్న ముఠాలు మాత్రం ఎక్కువగా మామోళ్లు పంచి వ్యాపారం సాగిస్తుంటారు.

పోలీసుల పాత్రే కీలకం
మనుషుల అక్రమ రవాణా సాదాసీదా నేరం కాదు. దీనిపై ప్రత్యేక నిఘా అవసరం. నిజానికి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చాలా మందికి అక్రమ రవాణా నేరాలపై అవగాహన చాలా తక్కువ. డిపార్టెమెంట్‌ సమావేశాల్లో, ట్రైనింగ్‌ కార్యక్రమాల్లో సైతం హత్యలు, దొంగతనాలు, వంటి నేరాలను అరికట్టేందుకు చేయాల్సిన విధి నిర్వహణ గురించి మాట్లాడతారు కానీ ట్రాఫికింగ్‌ వంటి సమస్యలపై కనీస అవగాహన కూడా కల్పించరు. అక్రమ రవాణా అరికట్టేందుకు క్రైం ఇన్వెష్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బాధ్యతే ఎక్కువ. గతంలో కొంత మంది నిబద్ధత కలిగిన అధికారులు పనిచేసిన సమయంలో ఈ ముఠాలపై కొరడా ఝుళిపించారు. వారు వేరే శాఖలకు మారడంతో కథ మామోలే. ఎక్కడైనా వ్యభిచారం నడుస్తుందని సమాచారమందితే అక్కడ రైడ్‌ చేయడం, మహిళలను అరెస్టు చేయడం మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. బాధితురాలికి శిక్ష వేస్తున్నారు కానీ నిందితుడిని, విటులను వదిలేయడం నేరాలు మరింత ఉదృతం కావడానికి దోహదపడుతున్నాయి. ఇప్పటి వరకూ ముఠా నిర్వాహకుల్లో రెండు శాతం మందికి మాత్రమే నామమాత్రపు శిక్ష పడటం ఆశ్చర్యం.
 
పనిచేయని ఉజ్వల హోమ్స్‌
అక్రమ రవాణా నిలుపుదలకు చేపట్టవలసిన కార్యాచరణపై మహిళా భద్రతా కమిటీతో మహిళా సంఘాలు, సామాజిక వేత్తలు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటన్నింటినీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ చట్టం ప్రకారం బాధిత మహిళలను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయకూడదు. వారిని తిరిగి మామోలు మనుషులుగా జీవించే విధంగా చర్యలు చేపట్టవలసిన బాధ్యతలు ప్రభుత్వం చేపట్టాలని చట్టంలో ఉంది. ఎక్కడా ఆ చట్టం అమలవుతున్న దాఖలాలు లేవు.
 
వేశ్యా వృత్తిలో మగ్గిపోతున్న మహిళలు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు వీలుగా పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల హోమ్స్‌ ప్రారంభించింది. అక్కడ మానసిక, శారరీక వైద్య సేవలు అందించడంతో పాటు, వారిలో జీవన నైపుణ్యాలు పెంచి స్వశక్తితో జీవించగలిగే సామార్థ్యాన్ని వారిలో పెంచేందుకు ఈ వసతి గృహాలు దోహదపడతాయి. అయితే ఆ హామ్స్‌ ఎక్కడా సవ్యంగా సాగుతున్నట్టు కనపడటంలేదు. కుకట్‌పల్లిలో సుమారు 200 మంది ఆశ్రయం పొందేవీలున్న ఉజ్వల హోమ్‌ను నాలుగేళ్ల క్రితం మూసేశారు. కేవలం కొన్ని స్వచ్ఛంద సంస్థల తరపున నడుస్తున్న వసతి గృహాలు నడుస్తున్నాయి.. కానీ అక్కడ వసతుల కొరత ఉందని బాధితులే స్వయంగా చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారానే ఆడవాళ్ల శరీరంతో వ్యాపారం చేసే నీచ సంస్కృతిని రూపుమాపగలం.

No comments:

Post a Comment